పురాతన భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం

Nov 20 2021 @ 08:07AM

- మృతుల కుటుంబాలకు తలా రూ.5 లక్షల పరిహారం 

- సీఎం ప్రకటన


వేలూరు(చెన్నై): వేలూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీవర్షాల కారణంగా ఓ భవనం కూలి నలుగురు చిన్నారులు సహా తొమ్మిదిమంది మృతిచెందారు. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. మృతుల కుటుంబాలకు తలా రూ.5 లక్షల ఆర్ధికసాయం ప్రకటించారు. యావత్‌ రాష్ట్రాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి... వేలూరు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పేరనాంపట్టు నగర్‌ సమీపంలోని కుట్ర వాగులో వరద ఉధృతి కారణంగా సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో, ముందు జాగ్రత్త చర్యగా పలువురిని సమీపంలోని మసీదుకు తరలించగా, మరికొందరు పక్క ఇళ్లలోని మిద్దెపైకి వెళ్లారు. అజీజియా వీధిలోని 18 మంది అనీషాబేగం (63) ఇంట్లో తలదాచు కు న్నారు. 50 ఏళ్ల పురాతనమైన ఆ భవనం శుక్రవారం ఉదయం హఠాత్తుగా కూలింది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల సిబ్బంది అక్కడకు చేరుకొని ఎక్సకవటేర్‌ సాయంతో భవన శిధిలాలు తొలగించి అందులో చిక్కుకున్న వారికి వెలికితీశారు. ఈ ఘటనలో హబిర (4), మనూల (8), తమీత్‌ (2), హబ్రా (3), మిస్బా ఫాతిమా (22), అనిషా బేగం (63), రూహినాజ్‌ (27), కౌసర్‌ (45), తన్షిల (27) మృతిచెందగా, మహమ్మద్‌ కౌసిబ్‌, మహమ్మద్‌ తౌషిక్‌, సన్ను అహ్మద్‌, అబీబ్‌ ఆలం, ఇలియాజ్‌ అహ్మద్‌, హాజీరా, నాసిర, హాజిరా నికాత్‌, మొయిద్దీన్‌లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వేలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి, స్వల్ప గాయాలైన వారిని పేరనాంపట్టు ప్రభుత్వా సుపత్రికి తరలించారు. బాధితులంతా మూడు కుటుంబాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కుమారవేల్‌ పాండియన్‌  ఘటనా స్థలానికి చేరుకొని భవన శిధిలాల తొలగింపు పర్యవేక్షించడంతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ ఘటనపై దిగ్ర్భాంతిని వ్యక్తి చేసిన ముఖ్యమంత్రి, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తలా రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్ధికసాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. బాధితులకు సరైన చికిత్స అందించాలని ఆదేశించారు. 


మొహమాటమే కొంప ముంచింది...!

అనిషాబేగం భవనం పురాతనమైనది, మట్టిగోడలతో నిర్మించి వుండడంతో చాలాకాలంగా దాని దృఢత్వంపై చుట్టుపక్కలవారు అనుమానం వ్యక్తం చేస్తూనే వున్నారు. దీనికి తోడు వారం రోజులుగా వర్షాలు కురు స్తుండడంతో మట్టి గోడలు నాని ఏ క్షణమైనా కూలవచ్చన్నట్లుగా కనిపిం చాయి. అయితే వరద నీరు రావడం, చాలామంది నిరాశ్రయులవడంతో ఆశ్రయం కోసం వచ్చిన వారిని అనిషాబేగం కాదనలేకపోయింది. అంత మందికి ఆశ్రయం ఇచ్చేందుకు ముందు భవనం యజమానులు తటపటాయించారు. కానీ వద్దని చెబితే.. ఎవరైనా ఏదో అనుకుంటారేమోనని వారు అనుమతిచ్చారు. కానీ ఆ మొహమాటమే ఇంతమంది మరణానికి కారణమైంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.