మున్సిపల్‌ కార్యాలయానికి.. భవనం కష్టాలు

ABN , First Publish Date - 2021-04-24T04:42:29+05:30 IST

ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయానికి అద్దె భవనం కోసం అధికారులు అన్వేషణ మొదలుపెట్టారు.

మున్సిపల్‌ కార్యాలయానికి.. భవనం కష్టాలు
స్పోర్ట్స్‌ అథారిటీ రూముల్లో కొనసాగుతున్న మున్సిపల్‌ కార్యాలయం

  1. శిథిలమైన ఆఫీసు
  2. అద్దె భవనం కోసం వెతుకులాట
  3. ఇబ్బంది పడుతున్న ప్రజలు


ఆత్మకూరు, ఏప్రిల్‌ 23:
ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయానికి అద్దె భవనం కోసం అధికారులు అన్వేషణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయం అనుకూలంగా లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పెద్దబజారులోని పాత మున్సిపల్‌ కార్యాలయ భవనం గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో శిథిలమవ్వడంతో దుద్యాల రస్తాలోని స్పోర్ట్స్‌ అథారిటీ రూముల్లో మున్సిపల్‌ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకు గాను  స్పోర్ట్స్‌ అథారిటీ శాఖకు నెలకు రూ.20 వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. ఈ గదుల్లో కార్యాలయ అడ్మినిస్ర్టేషన్‌ విభాగాన్ని నిర్వహించగా, పాత మున్సిపల్‌ కార్యాలయ భవనంలో శానిటేషన్‌ విభాగాన్ని, అలాగే అన్నక్యాంటిన్‌ భవనంలో మెప్మా విభాగాన్ని, కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహిస్తున్నారు. అయితే మున్సిపల్‌ విభాగాలన్నీ వేర్వేరు చోట్ల కాకుండా అన్నింటిని ఒకే చోట నిర్వహించేందుకు వీలుగా అద్దె భవనం కోసం మున్సిపల్‌ అధికారులు వెతుకుతున్నారు. దీంతో ప్రస్తుతం గరీబ్‌నగర్‌లోని ఓ అద్దె భవనాన్ని మున్సిపల్‌ అధికారులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సొంత భవనానికి మోక్షమెక్కడో..?
 పెద్దబజారులో వున్న పాతమున్సిపల్‌ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ఇరుగ్గా ఉండటంతో 2013లోనే అప్పటి శ్రీశైలం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో కొత్త మున్సిపల్‌ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేయించారు. దీంతో దుద్యాల రస్తాలో నూతన భవన నిర్మాణానికి అదే ఏడాది డిసెంబర్‌ 31న భూమిపూజ చేశారు. అయితే అక్కడ మున్సిపల్‌ కార్యాలయం నిర్మిస్తే పట్టణానికి దూరం అవుతోందని నిర్మాణ పనులను ప్రారంభించలేదు. అప్పటి నుంచి నేటి వరకు మున్సిపల్‌ భవన నిర్మాణ ప్రక్రియలో ఏదో ఒక జాప్యం నెలకొంది. తొలుత సంతమార్కెట్‌ ఆవరణలో నిర్మించాలని, తర్వాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న సాంఘిక  సంక్షేమశాఖ స్థలంలో నిర్మించాలన్న ప్రతిపాదనలు జరిగాయి. చివరకు తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని ఇరిగేషన్‌ స్థలంలో కొత్త మున్సిపల్‌ కార్యాలయ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాతన ఉన్నప్పటికీ స్థలసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.  

మున్సిపల్‌ చైర్మన్‌కు చాంబర్‌ కరువు
 ప్రస్తుతం వున్న మున్సిపల్‌ కార్యాలయంలో కొత్తగా ఏర్పడిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించేందుకు వీలు లేకుండాపోయింది. చివరికి చైర్‌పర్సన్‌కు చాంబర్‌ కూడా లేదు. దీంతో చైర్‌పర్సన్‌   కార్యాలయానికి ప్రతిరోజూ  హాజరుకావడం లేదు. కాగా ప్రస్తుతం ఉన్న గదుల్లోనే కమిషనర్‌ చాంబర్‌ పక్కనే ఓ గదిలో మున్సిపల్‌ చైర్మన్‌కు కూడా చాంబర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు భావించి పనులు కూడా మొదలుపెట్టారు. కానీ ఆ గదిలో చాంబర్‌ ఏర్పాటుకు చైర్మన్‌ అంగీకరించలేదని తెలుస్తోంది.

Updated Date - 2021-04-24T04:42:29+05:30 IST