కాగితాల్లోనే కట్టడాలు

ABN , First Publish Date - 2020-11-23T04:52:10+05:30 IST

గ్రామ సచివాలయాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ నెలాఖరు నాటికి వీటి నిర్మాణం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ... ఆ దిశగా పనులు ముందుకు సాగడం లేదు. చాలా చోట్ల స్థల సమస్య కారణంగా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించడం లేదు. ఫలితంగా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.

కాగితాల్లోనే కట్టడాలు
పునాది దశలోనే ఉన్న కేశుపురం సచివాలయ భవనాలు

- క్షేత్రస్థాయిలో కానరాని పురోగతి

- ఇదీ గ్రామ సచివాలయ భవనాల తీరు

(ఇచ్ఛాపురం రూరల్‌)

గ్రామ సచివాలయాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ నెలాఖరు నాటికి వీటి నిర్మాణం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ... ఆ దిశగా పనులు ముందుకు సాగడం లేదు. చాలా చోట్ల స్థల సమస్య కారణంగా క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించడం లేదు. ఫలితంగా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. 

----------

గ్రామస్థాయిలో పరిపాలన సాగించడమే లక్ష్యంగా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని గత ఏడాది అక్టోబరు 2న సచివాలయాల పాలన ప్రారంభించింది. అప్పటికే మూడోవంతు గ్రామాల్లో పంచాయతీలకు శాశ్వత భవనాలు లేవు. జిల్లావ్యాప్తంగా 1190 పంచాయతీలు ఉండగా... జనాభా ప్రాతిపదికన 845 గ్రామ సచివాలయాలుగా విభజించారు. ప్రతి సచివాలయానికి ప్రభుత్వ శాఖల పరంగా 11 మంది వంతున ఉద్యోగులను నియమించారు. వారు కూర్చునేందుకు సరిపడా వసతులు లేకపోవడంతో భవనాల విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు విభాగాలుగా విభజించి ఉపాధి హామీ అనుసంధానం కింద నిధులు మంజూరు చేసింది. 

- మొదటి కేటగిరిలో ఇప్పటికే సొంత భవనం లేకపోవడం లేదా శిథిలావస్థకు చేరిన ప్రాంతాల్లో నూతన భవనం నిర్మించేందుకు రూ.40 లక్షల చొప్పున నిధులను మంజూరు చేసింది.  

- రెండో కేటగిరి కింద ప్రస్తుత భవనం పైన రూ.25 లక్షల అంచనా చొప్పున మరో అంతస్తు వేసేందుకు నిధులు కేటాయించింది.  

- మూడో కేటగిరి కింద ప్రస్తుత భవనాన్ని విస్తరించేందుకు రూ.35 లక్షల చొప్పున మంజూరు చేసింది. అన్ని విభాగాలను కలిపి జిల్లావ్యాప్తంగా 833 గ్రామ సచివాలయాల నిర్మాణానికి రూ.333.20 కోట్లతో అధికారులు అంచనా వేశారు. ఆ పనులన్నిటికీ గత ఆర్థిక సంవత్సరంలోనే శ్రీకారం చుట్టారు. మార్చి నెల ముగింపును దృష్టిలో ఉంచుకుని ముందుచూపుతో అన్ని భవన నిర్మాణ పనులను విడతల వారీగా ఈ ఏడాది జనవరి నెల నుంచే ప్రారంభించినట్లు ఆన్‌లైన్‌లో పురోగతి చూపారు. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. జిల్లావ్యాప్తంగా సచివాలయ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం 209 సచివాలయాలు చివరి దశలో ఉన్నాయి. మరో 624 భవన నిర్మాణ పనులు వివిధ దశలలో సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.46 కోట్లు ఖర్చు చేశారు. నిర్మాణాల పురోగతిపై రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, జిల్లాస్థాయిలో కలెక్టర్‌, మండల స్థాయిలో ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేని అధికారులు కాగితాలపై కాకిలెక్కలు చూపుతున్నారు. ఇటీవల జేసీ శ్రీనివాసులు రాజాంలోని రాజీపేటలో సచివాలయ పనులు పరిశీలించారు. భవనాల నిర్మాణంలో జాప్యమైనా, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరించారు. సచివాలయాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు.


స్థల సమస్య తీరేదెన్నడో..

ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. భవనం నిర్మాణానికి స్థల సమస్య వెంటాడుతోంది. జిల్లావ్యాప్తంగా 39 చోట్ల భవనాలకు ఈ సమస్య ఉంది. తొలుత ఈ నెలాఖరుకల్లా సచివాలయాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది. పనులు ఇదే తరహాలో కొనసాగితే 50 శాతం లక్ష్యాన్ని కూడా సాధించడం కష్టమేననే భావన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి అధికారుల్లో నెలకొంది. 


త్వరగా పూర్తి చేస్తాం 

జిల్లాలో సచివాలయ భవనాలు నిర్మాణం పనులు ఇప్పటి వరకు 50 శాతం పూర్తి చేశాం. 209 భవనాలు చివరి దశలో ఉన్నాయి. మరో 248 భవనాలు స్లాబ్‌ దశలో ఉన్నాయి. కొన్ని చోట్ల స్థల సమస్య కారణంగా పనులు ప్రారంభించలేదు. వాటిని త్వరగా ప్రారంభించి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. 

- ఎస్‌.రామమోహన్‌, ఎస్‌ఈ, శ్రీకాకుళం.


 

Updated Date - 2020-11-23T04:52:10+05:30 IST