బుల్డోజర్ బాబా జోరు... ఉధృతంగా అక్రమ కట్టడాల కూల్చివేత

ABN , First Publish Date - 2022-04-07T23:06:45+05:30 IST

లక్నో: అక్రమ కట్టడాలకు పాల్పడిన వారిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బుల్డోజర్ల సాయంతో అక్రమ కట్టడాల కూల్చివేత ఉధృతంగా కొనసాగిస్తోంది.

బుల్డోజర్ బాబా జోరు... ఉధృతంగా అక్రమ కట్టడాల కూల్చివేత

లక్నో: అక్రమ కట్టడాలకు పాల్పడిన వారిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బుల్డోజర్ల సాయంతో అక్రమ కట్టడాల కూల్చివేత ఉధృతంగా కొనసాగిస్తోంది. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లామ్‌ అక్రమంగా నిర్మించిన పెట్రోల్ బంక్‌ను బుల్డోజర్లు ధ్వంసం చేశాయి. తగిన ఆధార పత్రాలు చూపించాలని బరైలీ జిల్లా యంత్రాంగం ముందే నోటీసులు జారీ చేసినా ఇస్లామ్ చూపలేకపోయారు. దీంతో కూల్చివేత కొనసాగింది. వాస్తవానికి ఇటీవలే షాజిల్ ఇస్లామ్‌ సీఎం యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎస్పీకి బలం పెరిగింది. ఇకపై ఎస్పీ తుపాకుల నుంచి పొగరాదు. బుల్లెట్లు వస్తాయని షాజిల్ వ్యాఖ్యానించారు. దీనిపై మండిపడిన బీజేపీ శ్రేణులు షాజిల్ ఇస్లామ్‌‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాయి. 


మాఫియాపైనా యూపీ అధికారులు విరుచుకుపడుతున్నారు. గ్యాంగస్టర్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మాఫియాతో సంబంధం ఉన్నవారి ఇళ్లను నేలకూలుస్తున్నారు. కాన్పూర్‌ వ్యాపారి మనీశ్ గుప్తా హత్య కేసుతో సంబంధం ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ జగత్ నారాయణ్ సింగ్ ఇంటిని కూడా అధికారులు కూల్చి వేశారు. 


ప్రయాగ్ రాజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత అతీఖ్ అహ్మద్ అక్రమ కట్టడాన్ని కూడా అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. 


ఇటీవలి ఎన్నికల సమయంలో యోగి ఆదిత్యనాథ్‌ను సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ బుల్డోజర్ బాబాగా అభివర్ణిస్తూ ఎద్దేవా చేసేందుకు యత్నించారు. అయితే దీన్నే ఆయుధంగా తీసుకున్న యోగి ప్రచారంలో మాఫియాపై బుల్డోజర్ల దాడులు కొనసాగిస్తామన్నారు. ఇటీవలి ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ బీజేపీకి సొంతంగా 255 స్థానాలు వచ్చాయి. ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ సర్కారు మాఫియా నేతల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం ప్రారంభించింది. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో యోగి... అక్రమార్కులపై బుల్డోజర్లతో విరుచుకుపడుతున్నారు.  





Updated Date - 2022-04-07T23:06:45+05:30 IST