Bulldozer On Duty: సొంత పార్టీ కార్యకర్తనూ ఉపేక్షించని యూపీ సీఎం యోగి.. శ్రీకాంత్ త్యాగి ఇల్లు కూల్చేసిన బుల్డొజర్

ABN , First Publish Date - 2022-08-08T22:30:10+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం సొంత పార్టీ కార్యకర్తనూ ఉపేక్షించలేదు. నోయిడాలోని గ్రాండ్ ఒమాక్స్ సొసైటీలో మహిళను బెదిరించి..

Bulldozer On Duty: సొంత పార్టీ కార్యకర్తనూ ఉపేక్షించని యూపీ సీఎం యోగి.. శ్రీకాంత్ త్యాగి ఇల్లు కూల్చేసిన బుల్డొజర్

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం సొంత పార్టీ కార్యకర్తనూ ఉపేక్షించలేదు. నోయిడాలోని గ్రాండ్ ఒమాక్స్ సొసైటీలో మహిళను బెదిరించి, ఆమెపై ఒక వ్యక్తి చేయి చేసుకున్న వీడియో వైరల్ అయింది. అతను బీజేపీ కార్యకర్త అని తేలింది. దీంతో.. ఈ ఘటనకు బాధ్యుడై వార్తల్లో నిలిచిన బీజేపీ కిసాన్ మోర్చా సభ్యుడు శ్రీకాంత్ త్యాగి విషయంలో యోగి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. బుల్డొజర్‌‌ను పంపి శ్రీకాంత్ త్యాగికి చెందిన అక్రమ ఇంటిని యోగి సర్కార్ కూల్చేసింది. నోయిడాలోని గ్రాండ్ మాక్స్ సొసైటీలోని సెక్టార్-93లో శ్రీకాంత్ త్యాగికి ఒక ఇల్లు ఉంది. అయితే.. అది అక్రమ నిర్మాణమని తేల్చిన స్థానిక అధికారులు బుల్డొజర్‌తో ఆ ఇంటిని కూల్చేశారు. నోయిడా పోలీసులు త్యాగిపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగారు. మహిళను శ్రీకాంత్ త్యాగి బెదిరించిన సమయంలో అతనికి మద్దతుగా నిలిచిన వారిని కూడా పోలీసులు విచారించారు.



కొన్ని రోజుల క్రితం త్యాగికి, గ్రాండ్ ఒమాక్స్ సొసైటీకి చెందిన ఒక మహిళకు మధ్య వాగ్వాదం జరిగింది. త్యాగి తను ఉంటున్న సొసైటీలో కొన్ని మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. గ్రాండ్ ఒమాక్స్ సొసైటీ నిబంధనల ప్రకారం మొక్కలు నాటకూడదనేది ఆ సొసైటీ పెట్టుకున్న రూల్. త్యాగికి ఆ నిబంధనను సదరు మహిళ గుర్తుచేసింది. ఈ విషయంలో త్యాగి ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తనకు కూడా సొసైటీలో హక్కు ఉందని త్యాగి వాదించాడు. ఈ గొడవలో విచక్షణ కోల్పోయిన శ్రీకాంత్ త్యాగి ఆ మహిళపై చేయి చేసుకున్నాడు. ఆమెపై దాడికి దిగిన ఆ దృశ్యాలను అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటకొచ్చింది.



ఆ వీడియో వైరల్ కావడంతో ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించి, ఆమెపై చేయి చేసుకున్న శ్రీకాంత్ త్యాగిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమైంది. ఈ గొడవ ఇంతటితో ఆగలేదు. త్యాగి మద్దతుదారులు కొందరు ఆ సొసైటీకి వెళ్లి సదరు మహిళ అడ్రస్ చెప్పాలని అడిగారు. దీంతో.. అసలీ త్యాగి ఎవరని ఆరా తీయగా.. బీజేపీ కిషన్ మోర్చా సభ్యుడని తేలింది. కొందరు సీనియర్ నేతలతో కలిసి దిగిన ఫొటోలు కూడా బయటికొచ్చాయి. సోమవారం నాడు శ్రీకాంత్ త్యాగి అక్రమ ఇంటిని బుల్డొజర్‌తో కూల్చేశారు. ఈ చర్యను స్వాగతిస్తూ బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి ఖేమ్‌చంద్ శర్మ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ త్యాగి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతని కోసం పోలీసులు వెతుకులాట సాగిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా త్యాగిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని ట్వీట్ చేసింది.

Updated Date - 2022-08-08T22:30:10+05:30 IST