బుల్లెట్‌ స్పీడ్‌ మీటర్లు

ABN , First Publish Date - 2020-07-07T07:25:52+05:30 IST

బుల్లెట్‌ స్పీడ్‌ మీటర్లు

బుల్లెట్‌ స్పీడ్‌ మీటర్లు

హైదరాబాద్‌/సిటీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): గత నెలలో కరెంటు బిల్లులు ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా తేరుకోకముందే జూన్‌ నెలకు సంబంధించి ఊహించని రీతిలో భారీగా బిల్లులు రావడం వినియోగదారులను కలవరపెడుతోంది. ఈసారి ఏకంగా రూ.లక్షల్లో విద్యుత్తు బిల్లులు వస్తుండటంతో జనం కంగారుపడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జూన్‌ నెల వినియోగానికి తీసిన బిల్లులు పలువురికి షాక్‌ ఇచ్చాయి. లాలాగూడ సెక్షన్‌లోని సీతాఫల్‌మండి ఈఆర్‌వో పరిధిలో ఎ.కృష్ణమూర్తి(సర్వీస్‌ నెం.100293954)ఇంట్లో ఈ నెల 5న మీటర్‌ రీడింగ్‌ తీశారు. అయితే 121 రోజులకుగాను మార్చి 6న 3,237 రీడింగ్‌ ఉంటే.. జూలై 5వ తేదీకి 3,48,244 రీడింగ్‌ తీశారు. మొత్తం 3,45,007 యూనిట్లకు ఎనర్జీ ఛార్జీల కింద రూ.24.93 లక్షలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కింద రూ.20,700 కలుపుకొని రూ.25,13,775 బిల్లు వచ్చింది. ఇంత బిల్లు చూసి వినియోగదారుడు లబోదిబోమనడంతో మీటర్‌ను తీసుకెళ్లి పరీక్షించగా.. అందులో లోపాల వల్లే ఇలా జరిగిందని గుర్తించిన యంత్రాంగం. రూ.2,095 కడితే చాలని కొత్త బిల్లు ఇచ్చింది. ఇక చంపాపేట లెనిన్‌నగర్‌ ఈఆర్‌వో పరిధిలోని జనప్రియ మహానగర్‌లో ప్లాట్‌నెం.1122(సర్వీ్‌సనెంబర్‌ 102531164)కు జూన్‌లో 26 రోజులకుగాను 4,56,246 యూనిట్లు వాడినందుకు రూ.5,72,014 బిల్లు వచ్చింది. గత నెలలో 2,499గా ఉన్న రీడింగ్‌.. 26 రోజులకు ఏకంగా 4,58,745కు చేరింది. దీనిపై వినియోగదారుడు ఫిర్యాదు చేయగా.. మీటర్‌ మహత్యమే తప్పుడు బిల్లుకు కారణమని యంత్రాంగం తేల్చింది. జూన్‌ నెలకు రూ.1,347 కడితే చాలని.. మొత్తం 238 యూనిట్లు వినియోగించినట్టు లెక్కకట్టి, సవరించిన బిల్లు ఇచ్చారు. ఇప్పటికే మార్చి, ఏప్రిల్‌, మే నెలల వినియోగాన్ని గంపగుత్తగా లెక్కకట్టి.. ఇచ్చిన బిల్లులలో శ్లాబులు మారి.. వినియోగదారుల జేబులు గుల్లయ్యాయి. నాసిరకం మీటర్లే దీనికి కారణమని పలువురు మండిపడుతున్నారు.

Updated Date - 2020-07-07T07:25:52+05:30 IST