జిల్లాలో బంద్‌ ప్రశాంతం

ABN , First Publish Date - 2021-03-06T05:45:47+05:30 IST

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నిర్వహించిన బంద్‌ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.

జిల్లాలో బంద్‌ ప్రశాంతం
కర్నూలు కొత్త బస్టాండు వద్ద వామపక్ష నాయకుల రాస్తారోకో

  1. మధ్యాహ్నం వరకు తిరగని ఆర్టీసీ బస్సులు, ఆటోలు


కర్నూలు(న్యూసిటీ), మార్చి 5: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నిర్వహించిన బంద్‌ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం బంద్‌కు వామపక్షాలతో పాటు అధికార వైసీపీ కూడా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం వరకు నిలిపివేసింది. సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ ఆటో కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వడంతో నగరంలో బంద్‌ విజయవంతం అయింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వర్తక, వాణిజ్య సంస్థలు బంద్‌కు సహకరించాయి. నగరం లోని పలు ప్రాంతాలలో వామపక్ష నేతలు మోటార్‌ బైక్‌తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌, సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కె. రామాంజనేయులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను కారుచౌకగా ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నాన్ని బీజేపీ మానుకోవాలని హితవు పలికారు. ఏపీలో ఉన్న ఏకైక అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమను మోదీ ప్రభుత్వం తనకు అనుకూలమైన ఆదానీ, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని  ఆరోపించారు. కార్మికోద్యమాల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరోమారు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.  సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు రామక్రిష్ణ, నారాయణ, అంజి బాబు, గౌస్‌దేశాయ్‌, ఏఐటీయూసీ నాయకులు ఎస్‌.మునెప్ప, ఎస్‌ఎన్‌.రసూల్‌, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 

ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతం అయింది. గాయత్రి ఎస్టేల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఉప సంహరించుకోకపోతే విద్యార్థులు, యువకులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరిం చారు. విద్యార్థి సంఘాల నాయకులు నగేష్‌, శ్రీరాములు, భాస్కర్‌, ప్రకాష్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-06T05:45:47+05:30 IST