కథ కంచికేనా?

Dec 8 2021 @ 01:12AM
పోర్టు నిర్మాణం జరగాల్సిన గిలకలదిండి హార్బర్‌

బందరుపోర్టుకు మూడుసార్లు గ్లోబల్‌ టెండర్లు.. 

ముందుకు రాని కాంట్రాక్టర్లు

ప్రభుత్వ వైఖరే కారణమా? 


బందరుపోర్టు నిర్మాణం కథ కంచికి చేరుతోందా?  ఏడాదిలో మూడుసార్లు గ్లోబల్‌ టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయకపోవడానికి కారణాలేమిటి? అసలు బందరుపోర్టును నిర్మించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమా? ఎన్నికల సమయం వరకు బందరుపోర్టు అంశాన్ని తొక్కిపెట్టి, ఎన్నికల ముందు ఈ అంశాన్ని తెరపైకితెస్తారా?... ఇప్పుడు అందరి మనసుల్లోనూ ఇవే ప్రశ్నలు. జిల్లా అభివృద్ధిలో కీలకమైన బందరుపోర్టు నిర్మాణంపై జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోవడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.


   ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే బందరుపోర్టు పనులను నవయుగ సంస్థ  సకాలంలో ప్రారంభించలేదనే కారణం చూపి రద్దు చేసింది. అనంతరం ప్రభుత్వమే పోర్టు నిర్మాణ పనులు చేపడుతుందని, పోర్టు నిర్వహణను ప్రభుత్వమేచూస్తూ ఆదాయం  సమకూర్చుకుంటుందని ప్రకటించింది. ఏడాదిన్నరగా బందరుపోర్టు నిర్మాణ పనులను చేపట్టేందుకు టెండర్లు పిలుస్తున్నా ఒక్క కాంట్రాక్టరూ ముందుకు రాకపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. 


15న ప్రజాభిప్రాయ సేకరణ 

బందరు పోర్టుకు గతంలోనే పర్యావరణ అనుమతులు వచ్చాయి. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు పోర్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఈ నెల 15వ తేదీన జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2006లో పోర్టు నిర్మాణం జరిగేకరగ్రహారంలో అప్పటి కలెక్టర్‌ శైలజారామయ్యర్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక పంపారు.  ఈ నివేదిక ఆధారంగానే పోర్టు నిర్మాణంపై  వివిధ కోణాల్లో సాంకేతికపరమైన సర్వేలు  నిర్వహించారు. చెన్నైకు చెందిన ఇండోమెర్‌ సంస్థ,  కేంద్ర ప్రభుత్వ రైట్స్‌ సంస్థ సర్వే చేసి, ఈ ప్రదేశం పోర్టు నిర్మాణానికి అనుకూలమేనని నివేదికలు ఇచ్చాయి. గతంలో పోర్టు పనులను దక్కించుకున్న నవయుగ సంస్థ డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను కూడా తయారు చేసింది. 3,762 ఎకరాల్లో రూ.5,834 కోట్ల అంచనాలతో పోర్టు నిర్మాణం చేపట్టాలని డీపీఆర్‌ తయారు చేశారు. ఈ నివేదికల ఆధారంగానే పర్యావరణ అనుమతులు వచ్చాయి. 


తొలివిడత రూ.1860 కోట్లతో నిర్మాణం 

బందరుపోర్టు నిర్మాణంపై ఇటీవల రైట్స్‌ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీపీఆర్‌ను కొంతమేర సవరించి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తొలివిడతగా 2,328 ఎకరాల్లో రూ.1,860 కోట్ల వ్యయంతో మూడు బెర్తులు,  బ్రేక్‌ వాటర్‌ విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. 2017లోనే  పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతంలోని కరగ్రహారం, మంగినపూడి,  తపశిపూడి, చిలకలపూడి, గిలకలదిండి తదితర  గ్రామాల్లోని ప్రభుత్వ, అసైన్డ్‌భూమి 2,328 ఎకరాలను సేకరించి, కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించారు. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా రైతుల నుంచి 530 ఎకరాలు సేకరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మరో 750 ఎకరాలను ఎకరానికి రూ.25 లక్షలు చొప్పున చెల్లించి మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా)ద్వారా కొనుగోలు చేశారు. పోర్టు పనులకు 2008 ఏప్రిల్‌లో ఒకసారి, 2019 ఫిబ్రవరిలో మరోసారి శంకుస్థాపన చేశారు. అయినా కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు బందరు పోర్టు నిర్మాణంపై  ప్రజాభిప్రాయ సేకరణ అంశాన్ని తెరపైకి తీసుకురావడం గమనార్హం. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులు పోర్టు నిర్మాణానికి అనుకూలంగా నివేదికను సమర్పిస్త్తారా? లేక పక్కదారి పట్టిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోర్టు నిర్మాణం జరిగితే వేలాదిమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, స్థానికులకు ఈ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు హామీలవర్షం కురిపించారు. ఆ తరువాత మెల్లగా పక్కన పెట్టేశారు. మళ్లీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని సరికొత్తగా ప్రజల ముందుకు తీసుకురావడం పాలకులకు అలవాటుగా మారింది.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.