బస్తాల నిండా తాకట్టుపెట్టుకున్న ఆస్తుల డాక్యుమెంట్లు
- పోలీసుల సోదాల్లో వెలుగు చూసిన వైనం
- 60 మందిపై కేసులు నమోదు
కరీంనగర్ క్రైం, మార్చి 27 : అక్రమ వడ్డీ వ్యాపారు ఇళ్ళల్లో పోలీసులు నిర్వహిస్తున్న సోదాల్లో బస్తాల కొద్దీ డాక్యుమెంట్లు, అప్పుల పత్రాలు, డబ్బుల కట్టలు బయటపడుతున్నాయి. పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు 15 రోజుల పాటు రహస్యంగా వడ్డీ దందా నిర్వహిస్తున్న వ్యక్తుల వివరాలను ఆరాతీశారు. కొందరి వద్దకు అప్పు కావాలని మారు వేషంలో వెళ్లి మరీ నిర్ధారించుకున్నారు. ఇలా రకరకాల పద్ధతుల్లో అక్రమ వడ్డీ వ్యాపారుల దందాను నడిపిస్తున్న వ్యక్తులను, లొకేషన్‌ను నిర్ధారించుకుని ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
-వ్యాపారి ఇంట్లో ఆరు కార్లు
కరీంనగర్లో ఒక బడా బాబు ఇంట్లో తాకట్టు పెట్టుకున్న ఆరు కార్లు దర్శనమిచ్చాయి. స్థలం సరిపోక మరి కొన్ని కార్లను పక్క ఇంటిలో కూడా పార్క్ చేసి ఉంచారు. మరొక వ్యక్తి ఇంటిలో బియ్యం బస్తా నిండ ఆస్తుల డాక్యుమెంట్లు, మరో బస్తా నిండా డబ్బుల కట్టలు లభ్యమయ్యాయి. హుజురాబాద్ డివిజన్లో ఎక్కువ శాతం ఉద్యోగులు వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల సోదాల్లో బయటపడింది. ఇప్పటి వరకు కమిషనరేట్ వ్యాప్తంగా 60 మంది ఎలాంటి అనుమతులు లేకుండా వ్యక్తిగతంగా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నట్లు వెల్లడవటడతో వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు మొదట నోటీసులిచ్చి పంపించారు. అనంతరం డాక్యుమెంట్ పత్రాలు, అప్పు కాగితాలు, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్‌లను పరిశీలిస్తున్నారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజల వద్ద అధిక వడ్డీ వసూలు చేసినట్లు పూర్తిగా ఆధారాలు లభించిన అనంతరం వారిపై మనీలాండరింగ్ కేసులు నమోదు చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరో వైపున ఆదాయపుపన్ను శాఖకు కూడా ఈ అక్రమ వడ్డీ వ్యాపారుల జాబితాను పంపించనున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
- భారీ సంఖ్యలో ఫిర్యాదులు
లైసెన్స్ లేకుండా అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు, నిబంధనలు పాటించకుండా అధిక వడ్డీని వసూలు చేస్తున్న ఫైనాన్స్ సంస్థలపై పోలీస్ కమిషనర్‌కు బాధితులు భారీ సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. మొదటి రోజు పోలీసులే దాడులు నిర్వహించి 11 మందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత వడ్డీ వ్యాపారుల దోపిడీకి గురైన బాధితులు భారీ సంఖ్యలో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని వారికి సీపీ హామీ ఇస్తున్నారు.