బీజేపీ గెలుపుతోనే కేసీఆర్‌కు కనువిప్పు

ABN , First Publish Date - 2020-10-30T11:42:54+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కలగాలంటే టీఆర్‌ఎ్‌సను ఓడించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

బీజేపీ గెలుపుతోనే కేసీఆర్‌కు కనువిప్పు

టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకున్నది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌


దుబ్బాక/మిరుదొడ్డి, అక్టోబరు 29 : దుబ్బాక ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కలగాలంటే టీఆర్‌ఎ్‌సను ఓడించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. గురువారం మిరుదొడ్డి మండలం మోతె, కాసులాబాద్‌ గ్రామాల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావుతో కలిసి రోడ్‌షోను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీ ఎన్నికలో కరీంనగర్‌లో గెలిచినట్లుగానే ప్రస్తుత దుబ్బాక ఉప ఎన్నికలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. దుబ్బాకలో రోజురోజుకూ బీజేపీకి అనూకూలంగా సర్వేలు వస్తుండడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలవాలని చూస్తుందని విమర్శించారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే బీజేపీపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తాము నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తులమని, తూటాలు పేల్చినా భయపడబోమని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, సీఎం కేసీఆర్‌ మెడలు వంచి నిఽధులు తేచ్చే సత్తా రఘునందన్‌రావుకే ఉందని తెలిపారు. దుబ్బాకలో కాషాయజెండా ఎగురబోతుందని ధీమా వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో రజకార్ల పాలన : రఘునందన్‌రావు

దేశంలో రామరాజ్యం కొనసాగుతుంటే... రాష్ట్రంలో మాత్రం రజాకార్ల పాలన సాగుతుందని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలు కేసీఆర్‌, హరీశ్‌రావు అహంకారానికి చెంపపెట్టు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత హరీశ్‌రావు తనంతట తానే కాల్చుకునే పరిస్థితి వస్తుందని విమర్శించారు. కాంగ్రె్‌సకు ఓటువేస్తే అది మురిగిపోయినట్టేనని, టీఆర్‌ఎ్‌సకు వేసినట్టేనని తెలిపారు. బీజేపీ గెలిస్తే చింతమడక తరహాలో ఇంటింటికి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.


దళితులను మొదటగా మోసం చేసింది కేసీఆరే

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మొట్ట మొదటగా దళితులనే మోసం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి మండిపడ్డారు. గురువారం దుబ్బాకలో ఎస్సీ కాలనీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్‌రావు తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్వరాష్ట్రంలో మొట్టమొదటి దళితుడిని సీఎం చేస్తానని చెప్పి, తానే సీఎం కుర్చీలో కూర్చొని దళితులను మోసం చేశారని మండిపడ్డారు. డబుల్‌బెడ్రూం ఇళ్లు, నిరుపేదలకు మూడెకరాల భూమి హామీలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. దుబ్బాకలో బీజేపీతోనే దళితులకు సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల తీర్పుతో సీఎం కేసీఆర్‌ మైండ్‌బ్లాక్‌ కావాలన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలవాలని చూస్తున్న కేసీఆర్‌కు భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. దుబ్బాకలో ఆరేళ్ల జరగని అభివృద్ధి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత గెలిస్తే ఇప్పుడెలా చెందుతుందని మాజీ మంత్రి బాబూమోహన్‌ ప్రశ్నించారు. దుబ్బాక బస్టాండ్‌ చూస్తేనే అభివృద్ధిలో ఎంత వెనుకబడి ఉందో అర్థమౌతుందన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచినా టీఆర్‌ఎ్‌సలోకి వెళ్లరని గ్యారంటీ ఎమైనా ఉందా అని ప్రశ్నించారు. 


కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరు

దౌల్తాబాద్‌ అక్టోబరు 29 : దుబ్బాకలో ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరని, ఇక్కడ కాషాయం జెండా ఎగురటం ఖాయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. గురువారం దౌల్తాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తోందని, దీని అంతం దుబ్బాక నుంచే మొదలవుతుందన్నారు. కేసీఆర్‌ తెలంగాణ యాస, భాషను అడ్డుపెట్టకుని మాటల గారడీ చేస్తూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మాట్లాడుతూ సమాజంలో చివరి వ్యక్తి వరకు ప్రభుత్వాలు అందించే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించాలన్న లక్ష్యంతో బీజేపీ పార్టీ రూపుదిద్దుకున్నదని తెలిపారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుటుంబాల కోసం పనిచేస్తున్న పార్టీలని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు మేలు చేయటమే లక్ష్యంగా మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.  

Updated Date - 2020-10-30T11:42:54+05:30 IST