బన్ని ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-10-07T05:52:44+05:30 IST

కాళరాత్రి.. దేవరగట్టు క్షేత్రం విద్యుత్‌ దీప కాంతులతో మెరిసిపోతోంది.

బన్ని ఉద్రిక్తం

  1.  దేవరగట్టు జైత్రయాత్రలో ముగ్గురు పరిస్థితి విషమం 
  2.  86 మందికి గాయాలు
  3.  డ్రోన్‌, సీసీ కెమెరాల నిఘా
  4.  పర్యవేక్షించిన  కలెక్టర్‌ కోటేశ్వర రావు, ఎస్పీ సిద్ధార్థ కౌసిల్‌ 

 ఆదోని/హొళగుంద /ఆలూరు రూరల్‌ : కాళరాత్రి..  దేవరగట్టు క్షేత్రం విద్యుత్‌ దీప కాంతులతో మెరిసిపోతోంది. కొండంతా ఎటు చూసినా  భక్తజనమే. అందరి చూపు ఆ మూడు గ్రామాల భక్తుల రాక కోసమే..   సమయం   12.45 గంటలు.. డిర్ర్‌ర్ర్‌ర్ర్‌.. గోపరాక్‌   అంటూ నెరణికి, నెరణికితాండ, కొత్తపేట గ్రామాలకు చెందిన వేలాది జనం కర్రలు, కాగడాలు చేతపట్టి కొండపైకి చేరుకున్నారు. ఇష్టదైవం మాళ మల్లేశ్వరులకు కల్యాణోత్సవం నిర్వహించి ఉత్సవ మూర్తులతో కొండ దిగువన ఉన్న సింహాసన కట్టకు రాగానే బన్ని జైత్రయాత్ర మొదలైంది.   కాగడాల వెలుతురులో సాగిన ఉత్సవం కర్రల యుద్ధాన్ని తలపించింది. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తతకు చేరింది.  అరగంటకు పైగా సాగిన ఈ సమరంలో  86 మంది గాయపడ్డారు.  వారిలో మల్లప్ప, రంగప్ప, రమేష్‌ల పరిస్థితి విషమంగా ఉంది. వారిని కర్నూలుకు తరలించారు. 

          ఆలూరు నియోజకవర్గ కేంద్రానికి 15 కి.మీ దూరంలో  హొళగుంద మండలంలోని దేవరగట్టు క్షేత్రంలో విజయదశమి   పర్వదినాన బుధవారం అర్ధరాత్రి జరిగిన బన్ని జైత్రయాత్ర ఉత్సవం ఉద్రిక్తంగా, ఉత్కంఠగా సాగింది. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా కర్రలు లేకుండా ఉత్సవాలు జరిపించాలని జిల్లా యంత్రాంగం ముందస్తుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా  భక్తులు మాత్రం కర్రలు, కాగడాలతో తలపడ్డారు. యుద్ధాన్ని తలపించేలా బన్ని ఉత్సవం నిర్వహించారు.  

బన్ని జైత్రయాత్ర సాగిందిలా..: 

             బన్ని ఉత్సవానికి  లక్షలాది భక్తులు దేవరగట్టు చేరుకున్నారు.  అర్ధరాత్రి 11.40 గంటల సమయంలో నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట గ్రామాలకు చెందిన భక్తులు డొళ్లబండ చేరుకున్నారు. ఒకే మాటగా.. ఒకే బాటగా దేవుడి కార్యాన్ని   దిగ్విజయం చేస్తామని పాలబాసలు చేశారు. కర్రలు, కాగడాలు చేతపట్టి దేవరగట్టు వైపు అడుగులు వేశారు.  12.45 గంటల సమయంలో  డిర్ర్‌ర్ర్‌ర్ర్‌.. గోపరాక్‌ అంటూ వేలాది భక్తజనం ఒక్క ఉదుటున కొండపైకి చేరారు. పచ్చని చెట్ల మధ్య ఎటు చూసినా ధగధగ  మండే కాగడాల వెలుతురు. ఆరాధ్యదైవం మాళ మల్లేశ్వరులకు కల్యాణోత్సవం నిర్వహించారు.  కల్యాణం ముగిసిందనడానికి గుర్తుగా ఐదో  అవుట్‌ పేల్చారు. ఉత్సవ మూర్తులతో కొండ దిగువన ఉన్న సింహాసన కట్టకు చేరుకున్నారు. అప్పటికే కట్ట వద్దకు చేరుకున్న అరికెర, ఆలూరు, సులువాయి, ఎల్లార్తి, బిల్లేహాల్‌, తుంబళబీడు.. తదితర గ్రామాలకు చెందిన భక్తులు ఆ మూడు గ్రామాల భక్తులకు ఎదురుగా నిలవడం.. నెరణికి, నెరణికితాండ, కొత్తపేట గ్రామస్థులు ఉత్సవ మూర్తులకు రక్షణగా నిలిచి బన్ని ఉత్సవాన్ని ఆరంభించారు.  తలకు పాగచుట్టి, కర్ర చేతపట్టి బన్నిలో పాల్గొన్నారు.   భక్తులు దేవుడిపై  పసుపు (బండారు)  చల్లారు.  1.40 గంటల సమయానికి ఉత్సవ మూర్తులతో ఆ మూడు గ్రామాల భక్తులు పాదాలగట్టు, ముళ్లబండ, రక్షపడ, శమీవృక్షం పూజలు నిర్వహించేందుకు అడవిలోకి వెళ్లడంతో   కర్రల సమరం ముగిసింది. కారుచీకటిలో  25 కి.మీలు అడవిలో నడిచి వెళ్లి పూజలు నిర్వహించారు. గురువారం తెల్లవారు జామున 6.15 గంటల సమయానికి ఎదురు బసవన్న గుడికి చేరుకున్నారు. అక్కడ ఆలయ ప్రధాన పూజారి గిరిమల్లయ్య స్వామి కార్ణీకం వినిపించారు. అక్కడి నుంచి ఉత్సవ మూర్తులను సింహాసన కట్టకు చేర్చడంతో ఉత్సవం ముగిసింది. 

ఆ రెండు గ్రామాల మధ్య స్వల్ప ఉద్రిక్తత..:

       86 మంది గాయపడటం, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటం,   నెరణికి, అరికేర గ్రామాలకు చెందిన కొందరు భక్తుల స్వల్ప ఉద్రిక్తతల మధ్య ఉత్సవాలు  ముగిసాయి. అంతకు ముందు సింహాసన కట్ట దగ్గరికి ఓ గ్రామానికి చెందిన భక్తుల గుంపు కర్రలు, కాగడాలతో   వచ్చి కాగడాలను  జనంపైకి వేశారు. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. గ్రామ పెద్దలు కొందరు సర్దిచెప్పారు. ఇలాంటి సంఘటనలు మినహా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి.  తీవ్రంగా గాయపడిన హెబ్బటం గ్రామానికి చెందిన  మల్లప్ప, మునానిగుంది గ్రామానికి చెందిన  రంగప్ప, ఆదోని గ్రామానికి చెందిన  రమేష్‌లను  కర్నూలుకు తరలించారు. 

 సాంకేతిక నిఘా..:

           దేవరగట్టు ఉత్సవాల్లో ఈయేడాది కూడా సాంకేతిక నిఘా ఏర్పాటు చేశారు.   డ్రోన్‌, సీసీ కెమెరాల సహాయంతో   కలెక్టర్‌ కోటేశ్వర రావు, ఎస్పీ సిద్ధార్థ కౌసిల్‌ దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షించారు. ఎస్పీ సిద్ధ్దార్థ కౌసిల్‌ ఎప్పటికప్పుడు పోలీస్‌ యంత్రాంగానికి సూచనలు, సలహాలు ఇస్తూ   అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదోని ఆర్డీవో రామకృష్ణా రెడి,్డ  డీఎస్పీ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో రెండు రోజులుగా స్థానిక పోలీసులు అక్కడే ఉంటూ బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. డ్రోన్‌, సీసీ కెమెరాలతో సాంకేతిక నిఘా, ఇతర ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల హింసను తగ్గించగలిగామని ఎస్పీ విలేఖరులకు వివరించారు. అంతకుముందు మంత్రి గుమ్మనూరు జయరామ్‌, కలెక్టర్‌, ఎస్పీ మాళ మల్లేశ్వర్లును దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారిని సత్కరించారు.  





 








Updated Date - 2022-10-07T05:52:44+05:30 IST