రైతులకు భారంగా..వ్యవసాయం

ABN , First Publish Date - 2022-05-22T04:41:04+05:30 IST

అన్నదాతకు సాగు భారంగా మారుతోంది. ధరలు పెరగడంతో పెట్టుబడులు మరింత పెరుగుతున్నాయి. తాజాగా డీజిల్‌ ధరలు పెరుగుదల మరింత శాపంగా పరిణమిస్తోంది.

రైతులకు భారంగా..వ్యవసాయం

  - ధరల మోతతో కష్టంగా సాగు

  - ఆందోళన చెందుతున్న అన్నదాతలు

  - డీజిల్‌ పెరుగుదలతో ధరలు పెంచిన ట్రాక్టర్‌ యజమానులు

బెజ్జూరు, మే 21: అన్నదాతకు సాగు భారంగా మారుతోంది. ధరలు పెరగడంతో పెట్టుబడులు మరింత పెరుగుతున్నాయి. తాజాగా డీజిల్‌ ధరలు పెరుగుదల మరింత శాపంగా పరిణమిస్తోంది. దుక్కులు దున్నేందుకు, ఇతర పనులకు రైతులు ట్రాక్టర్లను వినియోగిస్తుంటారు. అయితే డీజిల్‌ ధర రూ.100దాటడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ట్రాక్టర్‌ యజమానులు కూడా దుక్కులు దున్నేందుకు గంటకు రూ.1000నుంచి 1200వరకు తీసుకుంటున్నారు. దీంతో వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ధరలు భయం పెట్టుకుంది. యంత్రాలతో సాగు చేయడం తలకు మించిన భారంగా మారుతోందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి ఖర్చులు రెట్టింపవుతున్నాయని ఇంక సాగు కంటే ఇతర పనులకు వెళ్లడమే మేలని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.

వానాకాలం సాగు చేసేదెలా

పెట్టుబడి ఖర్చులు భారీగా పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సాగుకు జిల్లాలో అన్నదాతలు దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. వేసవిలో ట్రాక్టర్లతో దుక్కులు వేస్తారు. ఈ క్రమంలో ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం రైతులపై పడుతోంది. జిల్లాలో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.121ఉండగా, లీటరు డీజిల్‌ ధర రూ.107ఉంది. గడిచిన పదిహేను రోజుల్లోనే రూ.10వరకు ధర పెరగడం వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఒక పక్క ప్రకృతి వైపరిత్యాలు, మరో వైపు పెరిగిన ఎరువుల ధరలు, వెంటాడుతున్న ఇంధన ధరలతో సాగు చేయడం సాహసంగా మారిందంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వేసవి దుక్కులు దున్నడం, పంటమార్పిడి, వానాకాలం పంటల సాగుకు పంట చేలను చదును చేయడం, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో నుంచి నల్లమట్టి, సేంద్రియ ఎరువులు తరలించడం, పత్తి కర్రను తొలగించడం లాంటి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇలాంటి పనులన్నింటిని ట్రాక్టర్‌లతోనే చేపట్టాలి. దీంతో ట్రాక్టర్ల కిరాయి తడిసి మోపడవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్‌ యజమానులు ముందస్తుగా అడ్వాన్సులు ఇస్తేనే దుక్కులు దున్నేందుకు వస్తామని షరతులు కూడా విధిస్తున్నారు.

పెరుగుతున్న అప్పులు

ప్రకృతి వైపరిత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఓ ఏడాది నష్టం వచ్చినా మరో ఏడాదైనా లాభం రాకుండా పోతుందా అన్న ఆశతో రైతులు పంటలను సాగు చేస్తున్నా అంతంత మాత్రంగానే ఆదాయం వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. గతంలో సాగుకు ఎకరాకు రూ.10వేల వరకు పెట్టగా ప్రస్తుతం ఎకరాకు ముప్పైవేలకు పైగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. ఏటా సాగుకు ఖర్చులు పెరుగుతున్న కారణంగా ఇక వ్యవసాయం చేయడం కష్టంగా మారుతోందని రైతులు వాపోతున్నారు. విత్తు నాటిన నుంచి పంట చేతికొచ్చే వరకు వివిధ దశల్లో సాగు కోసం వేల రైపాయలు ఖర్చు చేస్తున్నా ప్రకృతి వైపరిత్యాలు, వరదల కారణంగా అనేక నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

వ్యవసాయం కష్టమవుతోంది

  - లావుడే తిరుపతి, రైతు సలుగుపల్లి

ప్రస్తుతం వ్యవసాయం కష్టమవుతోంది. డీజిల్‌ ధరలు పెరుగుతున్న కారణంగా ట్రాక్టర్‌ కిరాయిలు అధికమవుతున్నాయి. సాగు కోసం అప్పులు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. ప్రతి పనికి యంత్రాల వాడకం పెరగడంతో డీజిల్‌ ధరలను భరించలేకపోతున్నాం.

ధరలు తగ్గించాలి

  - దుర్గం గణపతి, రైతు మర్దిడి

ప్రభుత్వం పెంచిన డీజిల్‌ ధరలు తగ్గించాలి. అప్పుడే వ్యవసాయంలో ఎంతో కొంత ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దుక్కులు దున్నే కాలం కావడంతో ట్రాక్టర్లు కూడా దొరకడం లేదు. దీంతో ట్రాక్టర్‌ యజమానులు ధరలను అమాంతం పెంచడంతో ఇక సాగు కష్టంగా మారింది.

Updated Date - 2022-05-22T04:41:04+05:30 IST