వరిపైరును ముంచిన ‘బురేవి’

ABN , First Publish Date - 2020-12-04T04:53:24+05:30 IST

నివర్‌ తుఫాన్‌ నుంచి కోలుకోకముందే మరో తుఫాన్‌ బురేవి రైతులను దెబ్బతీసింది.

వరిపైరును ముంచిన ‘బురేవి’

నాయుడుపేట, డిసెంబ రు 3 : నివర్‌ తుఫాన్‌ నుంచి కోలుకోకముందే మరో తుఫాన్‌ బురేవి రైతులను దెబ్బతీసింది. ఇప్పటికే పైర్లు జలమయం కావడంతో అనేక మంది రైతులు  తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో బురేవి ప్రభావంతో గురువారం కురిసిన వర్షంతో తుమ్మూరు, పండ్లూరు, అన్నమేడు, ద్వారకాపురం, అరవపెరిమిడి, కాపులూరు, కూచివాడ తదితర గ్రామాల్లో వరిపైరు నీట మునిగింది. మండలంలో 4,650 హెక్టార్ల వరిసాగు చేపట్టారు. వరినాట్లు వేసి 25-35 రోజులవుతోంది. రైతులు దుక్కి, నాట్లు, అడుగుమందు తదితరాలకుగాను ఎకరాకు చేసిన రూ. 15వేల  ఖర్చు వర్షం పాలైంది. దాదాపు 30 రోజుల వరిపైరు నష్టపోయిన రైతులకు 80శాతం సబ్సిడీపై విత్తనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అలాగే 80శాతం దెబ్బతిన్న  పైరు నష్టాలను అధికారులు అంచనావేస్తున్నారు. గతంలో హెక్టారు నష్టానికి  15వేలు, ఎకరాకు 6వేలు వంతున అందజేశారు. ఈ ఏడాది నష్టపరిహారంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు  చేయలేదు. తగిన పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2020-12-04T04:53:24+05:30 IST