ఇరిగేషన్‌కూ బురిడీ..!

ABN , First Publish Date - 2020-12-04T04:59:31+05:30 IST

ఆండ్ర జలాశయంలో మత్స్యసంపద లూటీకి యుద్ధప్రాతిపది కన జరుగుతున్న కుట్రలపై ఆంధ్రజ్యోతిలో గురువారం ‘ఆండ్రపై వల’ శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం రేపింది.

ఇరిగేషన్‌కూ బురిడీ..!

 మత్స్యశాఖ నుంచి అందని నిధులు 

  డీడీకి కలెక్టర్‌ ఫోన్‌

  అప్రమత్తమవుతున్న స్థానిక అధికారులు

  ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

మెంటాడ: ఆండ్ర జలాశయంలో మత్స్యసంపద లూటీకి యుద్ధప్రాతిపది కన జరుగుతున్న కుట్రలపై ఆంధ్రజ్యోతిలో గురువారం ‘ఆండ్రపై వల’ శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. కోట్ల విలువైన మత్స్య సంపదను కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేసిన పెద్దలు, వారికి ఇతోధికంగా సహ కరిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్న కొందరు అధికారుల్లో కలవరం మొద లైంది. ఇంకోవైపు, ఈ కథనంపై స్పందించిన కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను పిలిపించుకుని ఈ వ్యవహారంపై వాకబు చేశారు. నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆంధ్రజ్యోతి కథనంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిజర్వాయర్లలో చేపల వేట ద్వారా మత్స్యశాఖకు జమయ్యే ఆదాయంలోగల 50 శాతంలో మత్స్యశాఖ 20 శాతం మాత్రమే ఉంచుకుని మిగిలిన 30 శాతం నిధులు సంబంధిత పంచాయతీకి జమచేయాల్సి ఉంటుంది. అయితే, ఆండ్ర రిజర్వయర్‌ ప్రారంభమైన 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు మత్స్యశాఖకు జమవుతున్న ఆదాయంలో ఒక్క శాతం కూడా ఇరిగేషన్‌కు బదలాయింపు జరగడంలేదని తాజాగా వెల్లడైంది.

కదిలిన డొంక..

దీనిపై అదనపు సమాచారం కోసం ఆంధ్రజ్యోతి ప్రతినిధి జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రకాష్‌ను సంప్రదించగా, తమకు జమైన నిధుల్లో నుంచి నిబంధనల ప్రకారం 50 శాతం బదలా యించడానికి వీలుగా బ్యాంకు ఖాతా తెరవాలని ఆండ్ర రిజర్వాయర్‌ డీఈకి సూచించామని చెప్పారు. అలాగే, మత్స్య సంపదకు వలవేసిన వ్యవహారంపై ఉన్నతాధికారుల సూచనలమేరకు నడుచుకుంటామని తెలిపారు. 

 ఒక్క రూపాయి కూడా రాలేదు 

ఇదే విషయాన్ని ఆండ్ర జలాశయం డీఈ పాండు వద్ద ప్రస్తావించగా, తన హయాంలో మత్స్యశాఖ నుంచి తమ ఇరిగేషన్‌ శాఖకు ఆండ్ర ఆదాయం నుంచి ఒక్క రూపాయి కూడా బదలాయింపు జరగలేదని స్పష్టం చేశారు. చేపలవేట లీజు ప్రక్రియపై తెలియదని చెప్పారు. తమ శాఖ అధికారులకు తెలియకుండా లీజు ఒప్పందం కుదర్చడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు.

 దోపిడీ స్కెచ్‌లో భాగమేనా..?

ఇరిగేషన్‌ శాఖ బ్యాంకు ఖాతా తెరిపించేలా జరిగిన ప్రయత్నం కూడా సదురు గ(పె)ద్దల ముందుచూపులో భాగమేనని తెలుస్తోంది. అంతా నిబం ధనల ప్రకారమే నడుచుకుంటున్నట్టుగా చెప్పుకోవడానికి మత్స్యశాఖ అధికా రుల ద్వారా కథ నడిపించినట్టు భావిస్తున్నారు. మరో గమ్మత్తేమంటే, తమ శాఖకు జమచేసిన నిధులు పంచాయతీ పేరుతో అందాయని మత్స్యశాఖ అధికారులు గురువారం కూడా ఉద్ఘాటిస్తుండగా, ఆ నిఽధులతో తమకు సంబంధం లేదని సచివాలయం కార్యదర్శి కుండబద్దలు కొడుతున్నారు.

  త్వరలోనే విచారణ

కలెక్టర్‌ ఈ వ్యవహారంపై స్పందించిన నేపథ్యంలో దీనిపై వీలైనంత త్వరలోనే విచారణ జరుగుతుందని ఇక్కడ అధికార వర్గాలు భావిస్తున్నాయి.

 ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు

తెరలేచిన దోపిడీ పర్వాన్ని బహిర్గతం చేసి ఆంధ్రజ్యోతి తమకు అండగా నిలిచిందని బాధిత గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పెద్దల కుట్రను అడ్డుకుంటూనే, మరోవైపు అధికారులు తమతో సొసైటీ ఏర్పాటు చేసేవరకు పోరాటం ఆపేదిలేదని గిరిజన పెద్దలు స్పష్టంచేశారు.

 

Updated Date - 2020-12-04T04:59:31+05:30 IST