మండుతున్న ఎండలు

Published: Mon, 28 Mar 2022 00:22:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మండుతున్న ఎండలు

 - 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు 

- రాత్రి 9 గంటల వరకూ వేడి

- ఉక్కపోతతో అల్లాడుతున్న జనం 

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 27: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూర్యోదయం నుంచే గంట గంటలకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ మధ్యాహ్నం 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇంటి నుంచి జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇంట్లో ఉన్నా ఉక్కపోత భరించలేక పోతున్నామని, రాత్రి 10 గంటల వరకు కూడా వేడిగానే ఉంటుందని ప్రజలు అంటున్నారు. 

-వారం రోజులుగా పెరిగిన తీవ్రత

వారం రోజులుగా జిల్లాలో 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 నుంచి 40కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు తప్పనిసరి అయితే తప్ప బయటకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా వైద్యుల సూచనల మేరకు తలకు చేతి రుమాలు, టోపీలు, టవల్స్‌ ధరిస్తున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలకు గిరాకీ పెరిగింది. ఇన్నాళ్లు మూలన ఉన్న కూలర్లు, ఏసీలను మరమ్మతులు చేసుకుంటున్నారు. రోడ్డుపై చేతివృత్తులు చేసుకునే కార్మికులు, దినసరి కార్మికులు, రెక్కాడితేకానీ డొక్కాడని రిక్షా, ఆటో కార్మికులు, వీధి వ్యాపారులు ఎండ తీవ్రతతోపాటు గిరాకీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

-నిర్మానుష్యంగా రోడ్లు

నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలోని వాణిజ్య, వ్యాపార ప్రాంతాలైన టవర్‌సర్కిల్‌, ప్రకాశంగంజ్‌, అన్నపూర్ణ కాంప్లెక్సు, బస్టాండ్‌, ప్రధాన కూరగాయల మార్కెట్‌తోపాటు ప్రధాన వీధులన్నీ మధ్యాహ్నం వేళల్లో నిర్మానుష్యంగా మారుతున్నాయి. రద్దీగా ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్‌ కార్యాలయాలు కూడా బోసిపోతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల స్వచ్చంద సంస్థలు రోడ్ల పక్కన చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీటిని ఉచితంగా అందిస్తున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటలకే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఎనిమిది గంటల కూడా 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. రాత్రి ఎనిమిది గంటల వరకు గంటకు 12 కిలో మీటర్ల వేగంతో వడగాల్పులు వీయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజులపాటు 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉంటాయని, ఆ తర్వాత క్రమేపీ పెరిగే అవకాశాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.