పేరుకే 24 గంటలు...!

ABN , First Publish Date - 2021-02-28T05:23:33+05:30 IST

రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వేలాది బోరుబావుల కింద సుమారు లక్ష ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ప్రధానంగా వరి, బొప్పాయి, అరటి, మామిడి, నిమ్మ, సజ్జ, వేరుశనగ తదితర పంటలు పండిస్తున్నారు.

పేరుకే 24 గంటలు...!
చిట్వేలి మండలం జట్టివారిపల్లెలో కాలిపోయిన ట్రాన్సఫార్మర్‌, ఎండుతున్న బొప్పాయి పంట వద్ద రైతు తుంగా వెంకటసుబ్బయ్య

రెండునెలలైనా పట్టించుకోని అధికారులు

కాలిపోతున్న ట్రాన్సఫార్మర్లు

కొత్తవాటికోసం రైతుల ఎదురు చూపులు

ఎండిపోయే దశలో పంటలు

విద్యుతశాఖలో నిధుల లేమి


వేసవి సీజన ప్రారంభం కాకముందే జిల్లాలో ట్రాన్సఫార్మర్ల కొరత తీవ్రంగా ఉంది. లక్షలాది ఎకరాల్లో బోరుబావుల కింద రైతులు పంటలు సాగుచేశారు. కాలిపోయిన ట్రాన్సఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్సఫార్మర్లను 24 గంటల్లోపు ఏర్పాటు చేయాల్సి ఉండగా రెండు నెలలవుతున్నా వీటిని ఇవ్వకపోవడంతో పంటలు వాడుమొగం పడుతున్నాయి. ఒక్క రాజంపేట, కోడూరులోనే సుమారు 200కు పైబడి ట్రాన్సఫార్మర్ల కొరత ఏర్పడింది.


రాజంపేట, ఫిబ్రవరి 27: రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వేలాది బోరుబావుల కింద సుమారు లక్ష ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ప్రధానంగా వరి, బొప్పాయి, అరటి, మామిడి, నిమ్మ, సజ్జ, వేరుశనగ తదితర పంటలు పండిస్తున్నారు. ఐదేళ్లకిందట అప్పటి ప్రభుత్వం ట్రాన్సఫార్మర్లను ప్రతి రైతుకు ఒక్కొక్కటి చొప్పున అందజేసింది. బోరుబావుల కింద మోటార్లు నడవాలంటే ట్రాన్సఫార్మర్లు ఉండాలి. ఐదేళ్ల కిందట ఏర్పాటు చేసిన ట్రాన్సపార్మర్లు కావడంతో వీటిలో కొన్ని ఇటీవల తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. కొన్ని కాలిపోతున్నాయి. కాలిపోయిన ట్రాన్సఫార్మర్లను వెంటనే మరమ్మతులు చేయించి ఇవ్వడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు.


నిధుల కొరతతో..

కాలిపోయిన ట్రాన్సఫార్మర్లను ప్రైవేటు కాంట్రాక్టర్ల చేత లేదా రాజంపేట, కోడూరు నియోజకవర్గ కేంద్రాల్లోని స్పెషల్‌ మెయింటినెన్స కేంద్రాలలో మరమ్మతులు చేయించాల్సి ఉంది. అయితే కాపర్‌ కొరత రావడం, నిధులు విడుదల కాకపోవడంతో వెంటనే మరమ్మతులు చేయడం లేదని సమాచారం. విద్యుత శాఖ ఆధ్వర్యంలో రాజంపేటలో నడిచే ఎస్పీఎం కేంద్రంలో అరకొరకగా రిపేర్లు చేస్తున్నారు. రైల్వేకోడూరులో ఉన్న ఎస్పీఎం కేంద్రంలో ఒక్క ట్రాన్సఫార్మర్‌ కూడా రిపేరు చేయడం లేదు. 


24 గంటల్లో ఇవ్వాలి

మామూలుగా కాలిపోయిన ట్రాన్సఫార్మర్‌ను తిరిగి ఏర్పాటు చేయాలని సంబంధిత రైతులు తిరుపతి ఎస్పీడీసీఎల్‌ కేంద్రంలోని కాల్‌ సెంటర్‌కు ఫోన చేసిన 24గంటల్లోపల వారికి కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉంది. తిరిగి కాల్‌ సెంటర్‌ వారే ఫోన చేసి ఎప్పుడు ట్రాన్సఫార్మర్‌ బిగించారు, పెట్టారా లేదా, దీనికి ఎవరు డబ్బు ఖర్చు చేశారు, వాహనం ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరైనా లంచాలు అడిగిరా... ఇలా అన్ని విషయాలు కనుక్కోవడం ఆనవాయితీ. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం వీటి మరమ్మతులకు అరకొరకగా నిధులు ఇవ్వడంతో రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో రెండు నెలలుగా కాలిపోయిన ట్రాన్సఫార్మర్లకు మరమ్మతులు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్సఫార్మర్ల సమస్య లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ మేరకు రెండురోజుల క్రితం రైతు సంఘం నేతలు చిట్వేలి ఏఈని కలిసి కాలిపోయిన ట్రాన్సఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేయాలని వినతిపత్రం సైతం అందజేశారు.


ట్రాన్సఫార్మర్ల కొరత వాస్తవమే

- చంద్రశేఖర్‌, ఈఈ, విద్యుత శాఖ, రాజంపేట 

రాజంపేట, కోడూరులలో ట్రాన్సఫార్మర్ల కొరత వాస్తవమే. ఈ రెండు నియోజకవర్గాల్లో 200వరకు ట్రాన్సఫార్మర్లు కాలిపోయాయి. వాటి స్థానంలో రిపేర్లు చేసి అందజేస్తున్నాం. ఇది జిల్లా అంతటా ఉన్న సమస్య. రైతులకు ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా కొత్త ట్రాన్సఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నాం. రాజంపేట ఎస్పీఎం సెంటర్‌లో, కడప సెంటర్‌లో తయారు చేయించి ఇస్తున్నాం.

Updated Date - 2021-02-28T05:23:33+05:30 IST