మండిన సూరీడు

ABN , First Publish Date - 2022-05-24T06:47:54+05:30 IST

జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదివారం 36 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత సోమవారంమూడు డిగ్రీలు పెరిగి 39 డిగ్రీలకు చేరుకుందని వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధికారులు తెలిపారు.

మండిన సూరీడు
జనసంచారం లేని అనకాపల్లి మెయిన్‌రోడ్డు

జిల్లా అంతటా పెరిగిన ఉష్ణోగ్రతలు

కోటవురట్లలో 42 డిగ్రీలు నమోదు

పేటలో 41, చోడవరంలో 40, అనకాపల్లిలో 39 డిగ్రీలు...

ఉదయం నుంచే వడగాడ్పులు

మధ్యాహ్నం నిర్మానుష్యంగా రహదారులు


భానుడు భగ్గుమన్నాడు. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే చుర్రుమనిపించేలా ఎండ కాసింది. మరో గంట తరువాత వడగాడ్పులు మొదలయ్యాయి. మధ్యాహ్నం అయ్యేసరికి వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. వివిధ పనుల నిమిత్తం ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు ఎండవేడి, ఉక్కపోతతో అల్లాడిపోయారు. జిల్లాలోని కశింకోట  మండలంలో అత్యధికంగా 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

అనకాపల్లిటౌన్‌, మే 23: జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదివారం 36 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత సోమవారంమూడు డిగ్రీలు పెరిగి 39 డిగ్రీలకు చేరుకుందని 

వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో 

ప్రజలు.. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండవేడి, వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదే సమయంలో అనధికార విద్యుత్తు కోతలు విధించడంతో ఇళ్లల్లో వున్న ప్రజలు ఉక్కపోత, చెమటతో తడిసి ముద్దయ్యారు. జన సంచారం లేకపోవడంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ మధ్యాహ్నం బోసిపోయాయి. నిత్యం రద్దీగా వుండే నెహ్రూచౌక్‌, చిననాలుగురోడ్ల జంక్షన్‌, రైల్వేస్టేషన్‌రోడ్డు, రింగురోడ్డు, చోడవరం రోడ్డు, తదితర ప్రాంతాలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. చిరువ్యాపారులు ఉదయం పది గంటల తరువాత దుకాణాలు సర్దేసుకుని  ఇళ్లకు వెళ్లిపోయారు. కాగా ఉష్ణోగ్రతలు పెరగడంతో శీతలపానీయాల వ్యాపారాలు ఊపందుకున్నాయి. పండ్ల రసాలు, కూల్‌డ్రింక్స్‌, మజ్జిగ, తదతర దుకాణాలు రద్దీగా మారాయి.  


కోటవురట్లలో 42 డిగ్రీలు

కోటవురట్ల: మండలంలో సోమవారం 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాలులు, ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. ఉదయం పది గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకురావడానికి భయపడిపోయారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బస్సులు, ఆటోలు ఖాళీగా తిరిగాయి.  ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లిన కూలీలు పూర్తిసమయం పనిచేయలేక సొమ్మసిల్లిపోయారు. కాగా శీతలపానీయాల దుకాణాలు మాత్రం కిటకిటలాడాయి. 


పేట జనం ఉక్కిరి బిక్కిరి

పాయకరావుపేట: సోమవారం వీచిన వడగాడ్పులకు పాయకరావుపేట ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదైంది.  ఎండ, వేడిగాలులకు భయపడిన ప్రజలు సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకురాలేదు. పట్టణంలోని ప్రధాన రహదారులు జనసంచారంలేక వెల వెలబోయాయి. తప్పనిసరై రోడ్లపైకి వచ్చినవారు ముఖానికి గుడ్డకట్టుకుని ప్రయాణం చేయాల్సి వచ్చింది. విద్యుత్‌ సరఫరాలో  తరచూ అంతరాయం ఏర్పడడంతో జనం ఉక్కపోతకు గురయ్యారు. పిల్లలు, వృద్ధులు ఆపసోపాలు పడ్డారు. 


మండిన చోడవరం

చోడవరం: ఎండవేడి, వడగాడ్పులతో చోడవరం మండిపోయింది. ఉదయం 8 గంటల నుంచే చురుక్కు మనపించేలా ఎండ  కాయడంతోపాటు 11 గంటలకు పరిస్థితి తీవ్రంగా మారింది. సోమవారం 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండకుతోడు ఉక్కపోత అధికంగా ఉండడంతో జనం బయటకు రాలేక, ఇళ్లల్లో ఉండలేకి ఇబ్బంది పడ్డారు. 


 రహదారులు నిర్మానుష్యం

పరవాడ: మండలంలో ఉదయం 9 గంటల నుంచే ఎండ మండిపోయింది. దీనికితోడు వడగాడ్పులు వీచడంతో జనం ఇళ్లల్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పరవాడలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న వారం పది రోజులు పరిస్థితి ఇలాగే వుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో  ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2022-05-24T06:47:54+05:30 IST