కోనెంపాలెం వద్ద బస్సు ప్రమాదం

ABN , First Publish Date - 2022-10-01T07:02:55+05:30 IST

అచ్యుతాపురం- పూడిమడక ప్రధాన రహదారిలోని కోనెంపాలెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది మహిళా ఉద్యోగులు స్వల్ప గాయాలకు గురయ్యారు.

కోనెంపాలెం వద్ద బస్సు ప్రమాదం
ప్రమాదానికి గురైన బస్సు

వెనుక నుంచి మరో బస్సు ఢీ

20 మందికి స్వల్ప గాయాలు

సెజ్‌లోని దుస్తుల కర్మాగారానికి ఉద్యోగులను తరలిస్తుండగా ఘటన 

అచ్యుతాపురం, సెప్టెంబరు 30: అచ్యుతాపురం- పూడిమడక ప్రధాన రహదారిలోని కోనెంపాలెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది మహిళా ఉద్యోగులు స్వల్ప గాయాలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలివి.  సెజ్‌లో గల ఒక దుస్తుల కర్మాగారానికి సెకండ్‌ షిఫ్ట్‌నకు ఉద్యోగులను తీసుకువెళ్తున్న బస్సును కోనెంపాలెం వద్ద ఉద్యోగుల్ని ఎక్కించుకునేందుకు డ్రైవర్‌ ఆపాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో బస్సు ఆగి ఉన్న ఈ బస్సును బలంగా ఢీకొంది. దీంతో  ఇరు బస్సుల్లో ఉన్న 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఢీకొట్టిన బస్సు డ్రైవర్‌ స్టీరింగ్‌ మధ్యలో ఇరుక్కుపోయాడు. అతనిని బస్సుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు స్థానికులు అతికష్టమ్మీద బయటకు తీశారు. అతడి కాలుకు గాయమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే ఈ ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు. 


‘ఏలేరు’లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం

అనకాపల్లి టౌన్‌,  సెప్టెంబరు 30: పట్టణానికి సమీపంలోని తుమ్మపాల వద్ద గల ఏలేరు కాలువలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని యువకుని మృతదేహం లభ్యమైనట్టు ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ తెలిపారు. తుమ్మపాల నుంచి బొజ్జన్నకొండకు వెళ్లే మార్గంలోని మూడవ కల్వర్టు వద్ద గుర్తించామన్నారు. మృతుని వయస్సు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని, బ్రౌన్‌ కలర్‌ టీషర్టు, డార్కు బ్లూ నైట్‌ నిక్కరు ధరించి ఉన్నాడన్నారు. చేతిపై అమ్మ అనే తెలుగు అక్షరాలతో పచ్చబొట్టు కూడా ఉందని తెలిపారు. మృతదేహాన్ని ఎన్టీఆర్‌ వైద్యాలయంలోని పోస్టుమార్టం గదికి తరలించామని, ఆచూకీ తెలిసినవారు  పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాల్సిందిగా ఎస్‌ఐ కోరారు. 


62 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు

మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

కొయ్యూరు, సెప్టెంబరు 30: గంజాయి రవా ణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారని ఎస్‌ఐ రాజారావు తెలిపారు. గూడెం కొత్తవీధి మండలంలోని మారుమూల ప్రాంతాల నుంచి అంతాడ మీదుగా గంజాయి రవాణా జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు శుక్రవారం ఘాట్‌ రోడ్డులో సిబ్బందితో నిఘా పెట్టామన్నారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనాలపై గోనె సంచుల మూటలతో వస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా, 62 కిలోల గంజాయి బయటపడిందన్నారు. ఇద్దర్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. వారితో పాటు వస్తున్న మూడు ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్‌, రూ.2500 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ వివరించారు.   

బొర్రాలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ

అనంతగిరి, సెప్టెంబరు 30: టోకూరు పంచాయతీ పరిధిలోని బొర్రా కూడలిలో గురువారం రాత్రి  విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీకి గురైంది. గ్రామంలో తాగునీటి పథకం మోటారుకు విద్యుత్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. పథకం ప్రకారం విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి ట్రాన్స్‌ఫార్మర్‌ ఎత్తుకుపోయారు.మూడు నెలల క్రితం ఇదే పంచాయతీలోని పింపులుగుడలోనూ ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగలించడంతో పాటు తరచూ వాహనాలు చోరీకి గుర వుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్‌ తీగల కోసమే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు అనుమానిస్తున్నారు. ఇటువంటి దొంగతనాలు జరుగకుండా ఉండేందుకు అనంతగిరి, బొర్రా జంక్షన్‌, డముకు, కాశీపట్నం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు  చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌ఐ రాము తెలిపారు.

Updated Date - 2022-10-01T07:02:55+05:30 IST