బస్‌.. ఫిట్‌లెస్‌

ABN , First Publish Date - 2022-06-28T06:36:16+05:30 IST

పాఠశాలల బస్‌లన్నీ ఓకేనా అంటే.. కాస్త ఆలోచించాల్సిందే.

బస్‌.. ఫిట్‌లెస్‌

జిల్లాలో 271 బస్‌లకు నో ఫిట్‌నెస్‌

మరో వారంలో పాఠశాలలు

యాజమాన్యాల వెనకడుగు

ఎఫ్‌సీ చేయించకపోతే చర్యలు

గత నెల 15తో ముగిసిన గడువు


పాఠశాలల బస్‌లన్నీ ఓకేనా అంటే.. కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఇంకా 271 బస్‌ల వరకూ ఫిట్‌నెస్‌ తెలియదు.. పాఠశాలలు తెరిచే సమయం చూస్తే దగ్గర పడిపోతోంది.. అయితే పాఠశాలల యాజమాన్యాల్లో మాత్రం ఇంకా కదలిక లేదు. జిల్లా వ్యాప్తంగా 1071 బస్‌లు ఉండగా ఇప్పటికే రవాణా శాఖాధికారులు 800 బస్‌లకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇచ్చారు. మిగిలిన బస్‌లు మాత్రం ఇంత వరకూ ఫిట్‌నెస్‌ చేయించుకోలేదు.. దీంతో             ఆ బస్సులన్నీ ఫిట్‌లెస్‌ అని రవాణా శాఖాధికారులు చెబుతున్నారు.  


రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 27 : మళ్లీ స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. వచ్చే నెల 5వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభంకానున్నాయి. ఈ నేప థ్యంలో ఇప్పటికే విద్యార్థుల తల్లిదం డ్రులు సంసిద్ధమైపోతున్నారు. అయితే పలు పాఠశాలల యాజమాన్యాల్లో మా త్రం ఇంకా కదలిక లేదు. స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణాశాఖ అధికారులు దృష్టిసారించారు. స్కూళ్లు తెరిచే నాటికి ప్రతి స్కూల్‌ బస్సుకు వాహనపటుత్వ సర్టిఫికెట్‌ (ఎఫ్‌సీ) ఉండేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని స్కూల్‌ యాజమాన్యాల నుంచి కొంత స్పందన కనిపిస్తున్నా ఇంకా చాలా మంది ముందుకు రావాల్సి ఉందని తెలుస్తుంది. స్కూళ్లు తెరిచేనాటికి ఎఫ్‌సీలు తీసుకోకపోతే బస్సులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఉండదని రవాణాశాఖ అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే స్కూళ్ల యాజమాన్యాలపై జరిమానాలు విధించానికి కూడా వెనుకాడమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 


జిల్లాలో 1071 బస్‌లు..


 జిల్లాలో మొత్తం స్కూల్‌ బస్సులు 1071 ఉన్నాయి. వీటన్నింటికీ ప్రతిఏటా వాహనపటుత్వ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీలు) తీసుకోవాల్సి ఉంటుంది. గతేడాది తీసుకున్న ఎఫ్‌సీలకు గత నెల 15వ తేదీతో గడువు ముగిసింది. మళ్లీ ఏడాది కాలానికి ఎఫ్‌సీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ సుమారు 800ల వరకూ బస్సులకు ఎఫ్‌సీలు జారీ చేశారు. మరో 250కి పైగా బస్సులకు ఎఫ్‌సీలు జారీ చేయాల్సి ఉంది. దీంతో వీటికి ఎఫ్‌సీలు జారీపై రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిజానికి స్కూల్‌ బస్సులకు ఎఫ్‌సీ చేయించడం స్కూల్‌ యాజమాన్యాలదే బాధ్యత. ఈ విషయంలో రవాణాశాఖ ఎలాంటి ఒత్తిడీ చేయదు. బస్సు ఫిట్‌గా ఉంటేనే విద్యార్థులు సురక్షితంగా బస్సులో ప్రయాణిస్తారు. ఎఫ్‌సీ కోసం మీ సేవ, ఈ సేవ, సచివాలయాలు వంటి చోట్ల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వానికి నిర్ణీత రుసుం చెల్లించిన తర్వాత రవాణాశాఖ అధికారులను సంప్రదిస్తే సరిపోతుంది. బస్సుల కండీషన్‌, ఇతర నిబంధనలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా తనిఖీ చేసి రవాణాశాఖ అధికారులు ఎఫ్‌సీ జారీ చేస్తారు. వాహనాల జీవితకాలం 15 ఏళ్లు పైబడితే వాటికి ఎఫ్‌సీ చేయరు. 15 ఏళ్లలోపు వాహనాలకు మాత్రమే ఎఫ్‌సీ జారీ చేస్తారు.


ఎఫ్‌సీ లేకపోతే జరిమానా


స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. అది ఉంటేనే రోడ్లపైకి రావడానికి స్కూల్‌ బస్సులకు అనుమతి ఉంటుంది. స్కూళ్లు తెరిచిన ఒకటి, రెండు రోజుల తర్వాత నుంచి స్కూల్‌ బస్సులపై స్పెషల్‌ డ్రైవ్‌ పెడతాం. ఎఫ్‌సీ లేకపోతే కేసులు బుక్‌చేస్తాం. రూ.5 వేల వరకూ జరిమానా పడుతుంది. యాజమాన్యాలు ముందుకొస్తే స్కూళ్లు తెరిచేనాటికి మిగిలిన బస్సులకు కూడా ఎఫ్‌సీలు జారీ చేస్తాం. అలాగే స్కూల్‌ బస్సుల డ్రైవర్ల ఆరోగ్యంపైనా     యాజమాన్యాలు దృష్టిసారించాలి. 

 - ఎస్‌ఎస్‌ రంగనాయకులు , జిల్లా ఇన్‌ఛార్జి రవాణా అధికారి          


Updated Date - 2022-06-28T06:36:16+05:30 IST