ప్రాణం తీసిన వేగం

ABN , First Publish Date - 2021-03-01T05:15:56+05:30 IST

ముందు వెళుతున్న వాహనం ఆగిఉందా, వెళుతుందా ? అని గుర్తించకపోవడం, వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో మండలపరిధిలోని జాతీయ రహదారిపై బద్దెవోలు క్రాస్‌ రోడ్డు సమీపంలో ఆదివారం ట్రాలీని బస్సు ఢీకొంది.

ప్రాణం తీసిన వేగం
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

బస్సు డ్రైవర్‌ దుర్మరణం

కండక్టర్‌తో సహా 20 మందికి గాయాలు

మనుబోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం


 మనుబోలు, ఫిబ్రవరి 28: ముందు వెళుతున్న వాహనం ఆగిఉందా, వెళుతుందా ? అని గుర్తించకపోవడం, వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో మండలపరిధిలోని జాతీయ రహదారిపై బద్దెవోలు క్రాస్‌ రోడ్డు సమీపంలో ఆదివారం ట్రాలీని బస్సు ఢీకొంది.ఈ ప్రమాదంతో బస్సు డ్రైవర్‌ పఠాన్‌ గౌస్‌భాషా (50)మృతిచెందగా, కండక్టర్‌తోపాటు 20మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఉదయగిరి డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఉదయగిరి నుంచి చెన్నైకు ప్రయాణికులతో వెళుతోంది. బస్సులో దాదాపుగా 25మంది ప్రయాణికులు ఉన్నారు. మనుబోలు దాటగానే బద్దెవోలు క్రాస్‌ రోడ్డు సమీపంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. దీంతో బస్సు ముందు ఇనుపకమ్ములతో  వెళుతున్న ట్రాలీ సడన్‌బ్రేక్‌ వేసి నిదానంగా వెళుతుండడంతో దాన్ని గుర్తించని బస్సు డ్రైవర్‌ వేగాన్ని అదుపు చేయలేక ట్రాలీని ఢీకొట్టాడు. ప్రమాదం జరగ్గానే బస్సులో కమ్ములు, సీట్లు, అద్దాలు ఢీకొట్టుకుని పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు ముందుబాగం నుజ్జునుజ్జు కావడంతో అత్యవసర ద్వారం పగులగొట్టి కండక్టర్‌ను, ప్రయాణికులను స్థానికులు బయటకు తీశారు. స్థానికులు గంటపాటు శ్రమించి క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ గౌస్‌బాషాను బయటకు తీయగలిగారు.

 

క్షతగాత్రులు వీరే..

ప్రమాదంలో కండక్టర్‌ బీ. వెంకటరమణారెడ్డితోపాటు ప్రయాణికులు షేక్‌ ఉమర్‌, సీహెచ్‌ పెద్దరామయ్య, జీ. రమణమ్మ, జీ అభిషేక్‌, ఓబులపు శ్రీనువాసులు, ఒంటేరు ధనలక్ష్మి, దాసరి శిరీష, లక్ష్మీదేవి, బి. కార్తీక్‌, ఏంజిల్‌,  లక్ష్మమ్మ, నవీన్‌, ప్రశాంత్‌, రమ్య, నాగరాజు, గురవయ్య, మానస, కొండయ్య, కోమలి గాయపడ్డారు. 108లో వారిని గూడూరు, నెల్లూరులకు తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ డ్రైవర్‌ గౌస్‌బాషా మృతిచెందాడు.  ప్రమాదం సమాచారం తెలుసుకుని హుటాహుటిన ఎస్‌ఐ ముత్యాలరావు సిబ్బందితో ప్రమాదస్థలికి చేరుకున్నారు. అలాగే గూడూరు, చిల్లకూరు ఎస్‌ఐలు భాబీ, పుల్లారావులు చేరుకుని క్షతగాత్రులను చికిత్సకు తరలించి ప్రమాదవివరాలు తెలుసుకున్నారు. క్రేన్‌ల సహాయంతో లారీని, బస్సును వేరు చేసి, రెండు మార్గాలలో ఆగిఉన్న ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదంలో మృతిచెందిన  డ్రైవర్‌ నెల్లూరులోని మహాత్మానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు. ఏడాదిన్నరగా ఉదయగిరి డిపోలో పనిచేస్తున్నాడు. నెల్లూరు జీజీహెచ్‌లో రోగుల బంధువుల ఆర్తనాదాలు, రోదనలతో దద్దరిల్లింది. డ్రైవర్‌ బంధువులు, భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మనుబోలు పోలీసులు తెలిపారు. 







Updated Date - 2021-03-01T05:15:56+05:30 IST