చింతలపూడి పాతబస్టాండ్ వద్ద మెయిన్ రోడ్డులో ఆగిన బస్సు
మినీ బస్టాండ్‌ను గాలికొదిలేసిన ఆర్టీసీ, మున్సిపాలిటీ
చింతలపూడిలో రోడ్డుపైనే ప్రయాణికుల పాట్లు
చింతలపూడి, మార్చి 27: పంచాయతీ నుంచి నగర పంచాయతీకి ఎదిగినా.. జనాభా పెరిగినా.. ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఏళ్ల తరబడి అవే సమస్యలు వెంటాడుతున్నాయి. పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్ధం మినీ బస్టాండ్ నిర్మించారు. కానీ అక్కడ బస్సులు ఆగవు. ఆర్టీసీ అధికారులు మినీ బస్టాండ్‌ను అసలు గుర్తించలేదు. ప్రస్తుత మున్సిపాలిటీ పట్టించుకోవడం లేదు. పలితంగా ప్రయాణికులు ఎండలో మాడిపోతున్నారు. మరుగుదొడ్డి కానీ యూరినల్స్ వెళ్లే అవకాశం కానీ లేదు. దీనికితోడు రోడ్డుపై నిలబడితే వ్యాపారానికి అడ్డమని దుకాణదారుల చీదరింపులు. వేసవిలో మాడిపోవడం.. వర్షంలో తడవడం సాధారణం.
పాతబస్టాండ్‌లో ప్రయాణికులు మరుగుదొడ్లు, వాష్‌రూమ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల అవస్థలు పడుతు న్నారు. 20 ఏళ్లుగా పాతబస్టాండ్ వద్ద మరుగుదొడ్లు నిర్మించాలని ఎన్ని వినతులు ఇచ్చినా బుట్టదాఖలే. ఎంపీ కావూరి హయాంలో రూ.2.5 లక్షలతో నిర్మించిన మినీ బస్టాండ్ వృథాగా పడిఉంది. అక్కడ బస్సులు నిలుపుదల చేయడం లేదు. ప్రభుత్వ నిధులతో మినీ బస్టాండ్ నిర్మించినా ఆర్టీసీ అధికా రులు దానిని స్వాధీనం చేసుకోలేదు. ఇప్పుడు ఆక్రమణల చెరలో ఉంది. పాత బస్టాండ్ మీదుగా నిత్యం 150 నుంచి 200 వివిధ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. దుకాణాలు పెరిగి అంగుళం స్థలం కూడా ఖాళీగా లేక ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు.
చింతలపూడికి పట్టణ హోదా వచ్చినా పొరుగు గ్రామాల వారు వస్తే ఎక్కడా వాష్‌రూములు లేవు. బహిరంగ మల విసర్జన మానండి అంటూ డబ్బు ఖర్చుచేసి ప్రచారం చేస్తారే తప్ప మరుగుదొడ్ల సౌకర్యం కల్పించరు. మున్సిపాలిటీ దగ్గర రోడ్డుపక్కనే ఉదయం వేళ బహిరంగ మల విసర్జన జరుగుతున్నా పట్టించుకోరు. పట్టణంలో వాష్‌రూమ్‌లు, పాతబస్టాండ్‌లో మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడానికి సులభ్ కాంప్లెక్స్ నిర్మించడానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఆక్రమణలతో వృధాగా పడివున్న మినీ బస్టాండ్