అమరావతిపై ఎందుకింత కోపం.. తాజా నిర్ణయం వెనక...!

ABN , First Publish Date - 2021-07-27T05:48:18+05:30 IST

రాజధాని ప్రాంతంపై కోపమా? లేక మరేదైనా కారణమా..?

అమరావతిపై ఎందుకింత కోపం.. తాజా నిర్ణయం వెనక...!

  • రాజధాని ప్రాంతానికి మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు కట్‌ 
  • వాటి స్థానంలో సిటీ ఆర్డినరీ బస్సులు 
  • వసూలు చేసేది మెట్రో చార్జీలే 
  • గవర్నర్‌ పేట-1 డిపో నిర్వాకం 
  • ఆర్టీసీపై ఒత్తిళ్లు తెస్తున్నారా? 
  • సిబ్బందిపై ప్రయాణికుల అసహనం 


రాజధాని ప్రాంతంపై కోపమా? లేక మరేదైనా కారణమా? రాష్ట్ర రాజధాని అమరావతికి ఆర్టీసీ తన బస్సుల స్థాయిని తగ్గించింది. ఎప్పటి నుంచో నడుపుతున్న సీఎన్‌జీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసి, వాటి స్థానంలో సాధారణ సిటీ ఆర్డినరీ బస్సులను నడుపుతోంది. ఈ బస్సులకే మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కలరింగ్‌ ఇచ్చి.. అవే చార్జీలు వసూలు చేస్తోంది. అమరావతికి ఇలా నాలుగు సిటీ ఆర్డినరీ బస్సులను మెట్రో ఎక్స్‌ప్రెస్‌లుగా నడపటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గవర్నర్‌పేట-1 డిపో తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి మాత్రమే ఇలా చేయటం దేనికి సంకేతమన్న ఆలోచన లు కలుగుతున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అమరావతికి కాలుష్య రహిత  సీఎన్‌జీ బస్సులను ఆర్టీసీ ఎప్పటి నుంచో నడుపుతోంది. కృష్ణా రీజియన్‌ పరిధిలోని గవర్నర్‌ పేట-1 డిపో నుంచి అమరావతికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచే బస్సులు నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఏర్పడింది. అంతకు ముందు ఒకటి అరా సర్వీసు ఉన్నా.. ఆ తర్వాత దాదాపు అన్నీ సీఎన్‌జీ బస్సులనే నడుపుతున్నారు. బస్సుల సంఖ్య కూడా పెరిగింది. ఈ బస్సులను సచివాలయం మీదుగా నడుపుతున్నారు. సౌకర్యవంతంగా ఉండే ఈ బస్సులకు ఎంతో డిమాండ్‌ ఉంది.


అలాంటి బస్సులను అకస్మాత్తుగా రద్దు చేసి, వాటి స్థానంలో సిటీ ఆర్డినరీ బస్సులను నడపడం, వాటికి మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బోర్డులను తగిలించి, అవే చార్జీలను వసూలు చేయడం విమర్శలకు తావిస్తోంది. అమరావతికి సిటీ ఆర్డినరీ బస్సుల్లో రూ.45, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అయితే రూ.65 వసూలు చేస్తారు. ప్రస్తుత సిటీ ఆర్డినరీ బస్సుల్లో కూడా రూ.65 వసూలు చేస్తున్నారు. పోనీ ఈ బస్సుల్లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థాయిలో సౌకర్యాలను కల్పించారా అంటే అదీ లేదు. డిమాండ్‌ ఉన్న రూట్‌లో ఆర్డినరీ బస్సులు, అవీ కండిషన్‌లో లేనివి నడపడమేమిటో అధికారులకే తెలియాలి. వారం నుంచి అమరావతికి సిటీ ఆర్డినరీ బస్సులు నడుస్తున్నాయి. సీఎన్‌జీ బస్సులకు మరమ్మతులు చేస్తున్నారేమోనని రెండు, మూడు రోజులు ప్రయాణికులు కూడా సరిపెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నా అవే  బస్సులు నడుస్తుండటంతో ప్రయాణికుల్లో అసహనం పెరుగుతోంది. మెట్రోలు ఎందుకు రద్దు చేశారని డ్రైవర్‌, కండక్టర్లను నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆర్టీసీపై ఎవరి నుంచైనా ఒత్తిళ్లువచ్చాయా? ఆర్టీసీ అధికారులకే ఈ బుద్ధి పుట్టిందా? అన్నది వెలుగు చూడాల్సి ఉంది. 


పరిశీలిస్తాం.. అలాంటివి ఉంటే ఆపుతాం 

కావాలని సిటీ బస్సులు వేసి ఉండకపోవచ్చు. ఏవైనా బ్రేక్‌ డౌన్‌ అయి ఉంటే వాటి స్థానంలో తాత్కాలికంగా వీటిని ప్రవేశపెట్టి ఉండ వచ్చు. ఎక్కువ రోజులు ఈ పరిస్థితి ఉండదు. ఏం జరిగిందో తెలుసుకుని మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులనే నడపాలని ఆదేశిస్తాం. - ఎం.నాగేంద్రప్రసాద్‌, ఆర్టీసీ ఆర్‌ఎం 

Updated Date - 2021-07-27T05:48:18+05:30 IST