వ్యాపారసంఘం

ABN , First Publish Date - 2022-09-20T06:06:30+05:30 IST

పోరాటాలకు పెట్టింది పేరు అనంతపురం జిల్లా. కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు ఒక సమస్యపై గళం విప్పి.. కదం తొక్కాయంటే.. పరిష్కారం కావాల్సిందే.

వ్యాపారసంఘం
ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల భవన సముదాయం (పెన్నార్‌ భవన)

సమస్యల బూచి చూపి దందా

చెయ్యి తడిపే వరకూ ఉద్యమాలు

సంక్షేమ హాస్టల్‌ 

వార్డెన్లకు వేధింపులు

తలవంపులు తెస్తున్నారని నాయకుల ఆవేదన


పోరాటాలకు పెట్టింది పేరు అనంతపురం జిల్లా. కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు ఒక సమస్యపై గళం విప్పి.. కదం తొక్కాయంటే.. పరిష్కారం కావాల్సిందే. ప్రభుత్వాలను కదిలించి.. రాష్ట్ర స్థాయి సమస్యలను సైతం పరిష్కరించిన నేతలు జిల్లాలో కోకొల్లలు. కానీ ఇప్పుడు సీన మారింది. కొందరి కారణంగా సంఘం అంటే స్వార్థం.. దందా అనే దుస్థితి ఏర్పడింది. సమస్యలను కొందరు ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. ఎవరు అధికారంలో ఉంటే.. వారి పంచన చేరి దందా సాగిస్తున్నారు. ఉద్యమం వ్యాపారంగా మారడం చూసి కొందరు సంఘాల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం సంఘాలను పెట్టుకోడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొందరి కారణంగా సమస్యలపై నిజాయితీగా పోరాడే సంఘాలపై నమ్మకం సన్నగిల్లుతోందని వాపోతున్నారు. సమస్యలు ఉన్నా.. లేకపోయినా.. కొందరు సంక్షేమ శాఖలను టార్గెట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అనంతపురం ప్రెస్‌క్లబ్‌


మచ్చుకు కొన్ని..

- జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ మండలంలోని పలు వసతిగృహాలకు ఓ సంఘం పేరిట ముగ్గురు  వెళ్లారు. మిట్టమధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ వసతి గృహాన్ని పరిశీలించారు. అక్కడ పెద్దగా సమస్యలు లేకపోయినా, వార్డెనకు ఫోన చేశారు. ‘మేము వసతిగృహంలో ఉన్నాం. మీరు ఇక్కడ లేరు. ఏం చేస్తున్నారు..? ఇదేనా మీ పనితీరు..?’ అని బెదిరించారు. వారు వె ళ్లింది చిన్న పిల్లల వసతిగృహానికి. అక్కడ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే వార్డెన్లు అందుబాటులో ఉం టారు. ఇదే విషయాన్ని వార్డెన చెప్పినా వారు వినిపించుకోలేదు. హాస్టల్‌ వద్ద ధర్నాకు కూర్చుంటున్నామని హెచ్చరించారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అని.. రూ.10 వేలు చదివించున్నానని ఆ వార్డెన ఆవేదన వ్యక్తం చేశాడు. 

- కళ్యాణదుర్గంలోని ఓ వసతి గృహంలోకి ఓ విద్యార్థి సంఘం నాయకులు జెండాలు చేతబట్టుకొని ప్రవేశించారు. కలెక్టర్‌ స్థాయిలో వార్డెనను ప్రశ్నించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకూ వార్డెన సమాధానం ఇచ్చారు. ఆ తరువాత నాయకులు వసతిగృహమంతా కలియదిరిగారు. ఏమీ దొరక్క.. ‘భోజనానికి స్టోర్‌ బియ్యం ఎందుకు వాడుతున్నారు..? సోనామసూరీ బియ్యం పెట్టాలి కదా...? అంటే సోనామసూరీ బియ్యం మీరు నొక్కేసి.. పిల్లలకు స్టోర్‌ బియ్యం పెడుతున్నారా..?’ అని దబాయించారు. వింత ప్రశ్నలతో ఆ వార్డెనను బెదరగొట్టారు. తరువాత బేరం మొదలు పెట్టారు. రూ.50 వేల నుంచి మొదలు పెట్టి.. రూ.30 వేలు తీసుకుని వెళ్లినట్లు సమాచారం.

- ఉరవకొండ సమీపంలోని ఓ వసతి గృహానికి ఓ సంఘం నాయకులు వెళ్లారు. ఆ సమయంలో వార్డెన అందుబాటులో లేరు. ఇది వారికి కలిసొచ్చింది. సంఘం నాయకులు తమకు అండగా ఉంటారని భావించి, హాస్టల్‌ విద్యార్థులు తమ సమస్యలను వారికి తెలియజేశారు. అంతే..! వార్డెనకు ఫోనలు వెళ్లాయి. వార్డెన హడావుడిగా అక్కడికి చేరుకున్నారు. ఆ వెంటనే నాయకులు వార్డెనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం జరుగుతుందని విద్యార్థులు సైతం నినాదాల్లో పాలుపంచుకున్నారు. పట్టుమని పది నిమిషాలు కూడా ఆ పోరాటం సాగలేదు. వార్డెనను వంట గదిలోకి పిలుచుకువెళ్లారు. ఆ తరువాత కిమ్మనకుండా అందరూ వసతిగృహం నుంచి బయటికివెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు నివ్వెరపోయారు. ఆ వార్డెన నుంచి రూ.40 వేలకు పైగా నాయకులు దండుకున్నట్లు సమాచారం.


నమ్మకం సన్నగిల్లుతోంది...

స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు సంఘాల ముసుగు వేసుకున్నారు. వారి కారణంగా హక్కులు, సమస్యలపై పోరాటం చేసే సంఘాల నాయకులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం మానేసి, పోరాటం పేరిట సమస్యను సొమ్ము చేసుకుంటున్నారు. ఇది మంచిది పద్ధతి కాదు. ఇలాంటివారి వల్ల సంబంధిత సంఘానికి చెడ్డపేరు వస్తుంది. ఇలాంటివారిని ఎవరు అడ్డుకోగలరు..? వారిలో వారికే మార్పు రావాలి.

- డాక్టర్‌ చెన్నోల్ల తిరుపాలు, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు


మానుకోవాలి..

కులసంఘాల ముసుగులో కొందరు నేతలు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులపై బ్లాక్‌మెయిల్స్‌కు పాల్పడుతూ... విలువలను దిగజారస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు... నిజంగా సమస్యలుంటే ఆ సమస్యలపై పోరాడి ఆయా వర్గాలకు న్యాయం చేయాలి. అంతేగానీ... సమస్యను ఆదాయవనరుగా మార్చుకొని లబ్ధిపొందాలని చూడటం సమంజసం కాదు. సంఘాలను స్థాపించి కొందరు రాజకీయ పార్టీలకు అంటకాగుతూ తమ స్వార్థప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నారు. ఇప్పటికైనా అలాంటి నేతలు ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల  జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - 2022-09-20T06:06:30+05:30 IST