పరవాడలో మధ్యాహ్నం వరకే వ్యాపారాలు

ABN , First Publish Date - 2021-04-24T05:11:37+05:30 IST

మండల కేంద్రం పరవాడలో శనివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే వ్యాపారాలు కొనసాగించాలని పంచాయతీ అధికారులు తీర్మానం చేశారు.

పరవాడలో మధ్యాహ్నం వరకే వ్యాపారాలు
మాట్లాడుతున్న పైలా శ్రీనివాసరావు

నేటి నుంచి అమలు 

పరవాడ, ఏప్రిల్‌ 23: మండల కేంద్రం పరవాడలో శనివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే వ్యాపారాలు కొనసాగించాలని పంచాయతీ అధికారులు తీర్మానం చేశారు. వచ్చే నెల 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో గ్రామంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్పంచ్‌ శిరపురపు అప్పలనాయుడు అధ్యక్షతన శుక్రవారం వ్యాపారులతో స్థానిక సంతబయలు వద్ద అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పరవాడలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోందన్నారు. అందుచేత ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. అనవసరంగా ఎవరూ బయటతిరగొద్దని కోరారు. విధిగా మాస్క్‌ ధరించాలని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాపారులు మధ్యాహ్నం ఒంటిగంట వరకే తమ కార్యాకలాపాలను కొనసాగించాలని, కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. షాపులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే తెరవడానికి వ్యాపారులు అంగీకరించారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్‌ చుక్క రామునాయుడు, ఎస్‌ఐ పి.రమేశ్‌, ఉపసర్పంచ్‌ బండారు రామారావు, పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు, వ్యాపారులు పాల్గొన్నారు. 


వాడచీపురుపల్లిలో షాపుల వేళల కుదింపు

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో షాపులను నిర్ణీత సమయాల్లో నిర్వహించాలని మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు కోరారు. వాడచీపురుపల్లిలో వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాడచీపురుపల్లి పరిసర గ్రామాల్లోని వ్యాపార సంస్థలను ఉదయం 6 నుంచి 9 గంటలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచాలని సూచించారు. అందుకు వ్యాపార వర్గాలు సమ్మతించాయి. వచ్చే నెల 1 నుంచి ఒక పూట మాత్రమే షాపులు తెరిచి ఉండేలా చూడాలని పంచాయతీ అధికారులను కోరారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ శివలంంక లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మురళీ పట్నాయక్‌, వ్యాపారులు పాల్గొన్నారు. 


కెనరా బ్యాంకు పని వేళల్లో మార్పు

పరవాడ: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పరవాడ కెనరా బ్యాంకు పని వేళల్లో మార్పు చేస్తున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. వచ్చే నెల 15వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా  బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించాలని వారు కోరారు. 


Updated Date - 2021-04-24T05:11:37+05:30 IST