దారి అడ్డగించి వ్యాపారవేత్త నుంచి రూ.20 లక్షల దోపిడి.. ఐదుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-12T21:26:43+05:30 IST

రిటైలర్ల వద్ద డబ్బు వసూలు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ వ్యాపారవేత్త అడ్డగించిన ఇద్దరు దుండగులు రూ.20 లక్షల నగదు దోపిడీ చేశారు.

దారి అడ్డగించి వ్యాపారవేత్త నుంచి రూ.20 లక్షల దోపిడి.. ఐదుగురి అరెస్ట్

జబల్‌పూర్ : రిటైలర్ల వద్ద డబ్బు వసూలు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ వ్యాపారవేత్త అడ్డగించిన ఇద్దరు దుండగులు రూ.20 లక్షల నగదు దోపిడీ(Robbery) చేశారు. మధ్యప్రదేశ్‌(Madyapradesh)లోని జబల్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొబైల్ యాక్ససరీస్ వ్యాపారం నిర్వహించే రాజ్‌కుమార్ తివారీ గత శుక్రవారం రిటైలర్ల నుంచి డబ్బు కలెక్షన్ చేసుకుని తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో పక్కాప్లాన్ ప్రకారం బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు దారిఅడ్డగించి నగదు కాజేశారు. పారిపోతుండగా బాధితుడు రాజ్‌కుమార్ అనుసరించాడు. కానీ దొంగలను పట్టుకోలేకపోయాడు. దీంతో ఫిర్యాదు అందడంతో 24 గంటల వ్యవధిలోనే దొంగలను అదుపులోకి తీసుకున్నామని జబల్‌పూర్ సిటీ పోలీసులు వెల్లడించారు. రుణ చెల్లింపులు, డ్రగ్స్ కొనుగోలు కోసం, త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే ఈ దోపిడీ చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(జబల్‌పూర్ జోన్) ఉమేష్ జోగ వెల్లడించారు. నగదుతోపాటు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా దొంగిలించారని వివరించారు. నిందితుల నుంచి 2 మోటార్‌బైకులు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కమ్లేష్ ఝరియా అలియాస్ కమ్ము(20), అన్షుల్ చౌదరి(31) ప్రధాన నిందితులు కాగా సుమిత్ బెన్(21), శివం చన్సోరియా(22), గౌరవ్ చౌరాసియా(22) వీరికి సహకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు వివరించారు.


కమ్లేష్ ఝరియా, అన్షుల్ చౌదరి ఇద్దరూ నేరప్రవృతి కలిగినవారు. వీరిపై ఇప్పటికే హత్యాయత్నం, దాడి, డ్రగ్స్ కలిగివుండడం వంటి నేరాల కింద కేసులు ఉన్నాయని చెప్పారు. అరెస్ట్ చేసిన అనంతరం ఇద్దరినీ ప్రశ్నించగా.. మిగతావారి పేర్లను వెల్లడించారని, మిగతావారిని కూడా అరెస్ట్ చేశామని వివరించారు. 

Updated Date - 2022-06-12T21:26:43+05:30 IST