ముమ్మరంగా జ్వర సర్వే

ABN , First Publish Date - 2022-01-22T04:46:53+05:30 IST

కరోనా నియంత్రణలో భాగంగా శుక్రవారం మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు.

ముమ్మరంగా జ్వర సర్వే
మనోహరాబాద్‌లో జ్వర సర్వేను పరిశీలిస్తున్న ప్రతిమాసింగ్‌

ఇంటింటికీ వైద్య బృందాలు

కొవిడ్‌ లక్షణాలుంటే వెంటనే హోంఐసోలేషన్‌ కిట్‌

మెదక్‌ రూరల్‌, జనవరి 21: కరోనా నియంత్రణలో భాగంగా శుక్రవారం  మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. ఆరోగ్యకార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగతూ ఇంట్లో జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు. జ్వరంతో బాధపడుతున్న వారికి  హోంఐసోలేషన్‌ కిట్లను అందజేశారు. మెదక్‌ మండలం మంబోజిపల్లిలోని సర్పంచ్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి, జ్వరంతో బాధపడుతున్న వారికి కిట్లు అందజేశారు.   

సర్వేను పరిశీలించిన ప్రతిమాసింగ్‌

తూప్రాన్‌/తూప్రాన్‌ (మనోహరాబాద్‌)/తూప్రాన్‌రూరల్‌, జనవరి 21: ఏమేమి సర్వే చేస్తున్నారూ? సర్వేలో ఏమేమి నమోదు చేస్తున్నారూ..? అంటూ మెదక్‌ అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ జ్వరసర్వే బృందాన్ని ప్రశ్నించారు. శుక్రవారం తూప్రాన్‌ పట్టణ పరిధి హైదర్‌గూడలో, మనోహరాబాద్‌ మండలంలోని రామాయపల్లి, మనోహరాబాద్‌, దండుపల్లి, తూప్రాన్‌ మండలం ఘనపూర్‌, యావాపూర్‌లో నిర్వహిస్తున్న జ్వరసర్వేను ప్రతిమాసింగ్‌ పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను సర్వే తీరుపై ప్రశ్నించి, ఇంటింటా సర్వేలో నమోదు చేస్తున్న పత్రాలను ఆమె పరిశీలించారు. రెండో డోసు వాక్సిన్‌ తీసుకోకుంటే పత్రాల్లో ఖాళీ వదలకుండా ఇవ్వాల్సిన తేదీని నమోదు చేయాలని సూచించారు. సర్వేలో ప్రతిఒక్కరికి సెకండ్‌ డోస్‌, బూస్టర్‌ డోస్‌ తీసుకోవలసిన గడువుపై స్పష్టంగా అవగాహన కల్పించాలన్నారు. ఏ ఇంటిని వదలకుండా సర్వే చేయాలని సూచించారు. కొన్ని ఇళ్లవద్దకు వెళ్లి కుటుంబసభ్యులను పలకరించారు.కాగా శుక్రవారం తూప్రాన్‌ మండలంలో 1091 ఇళ్లల్లో జ్వర సర్వే జరిగినట్లు పీహెచ్‌సీ వైద్యాధికారి ఆనంద్‌ తెలిపారు. 51మంది జ్వరపీడితులను గుర్తించి ఐసొలేషన్‌ కిట్లు ఇచ్చామని చెప్పారు. ఆమె వెంట మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, కమిషనర్‌ మోహన్‌, ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో రమేశ్‌, మనోహరాబాద్‌ సర్పంచు మహిపాల్‌రెడ్డి ఉన్నారు.

ఫీవర్‌ సర్వేను పరిశీలించిన జిల్లా వైద్యాధికారి

నర్సాపూర్‌, జనవరి 21: రెడ్డిపల్లి, నర్సాపూర్‌లోని ఏడో వార్డులో పర్యటించి జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు సర్వే తీరును పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయనిర్మల, పీహెచ్‌సీ డాక్టర్‌ ప్రియదర్శిని, చందు తదితరులు పాల్గొన్నారు. 

ప్రతీ ఇంటికి ఫీవర్‌ సర్వే నిర్వహించాలి: మాణిక్‌రావు

జహీరాబాద్‌, జనవరి 21: వైద్య సిబ్బంది ప్రతీ ఇంటిని సందర్శించి ప్రతీ ఒక్కరికి ఫీవర్‌ పరీక్షలు నిర్వహించాలని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలో ప్రారంభమైన ఫీవర్‌ సర్వే వివరాలను ఎమ్మెల్యే వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిషత్‌ సీఈవో ఎల్లయ్య జహీరాబాద్‌ మండలంలోని అల్గోల్‌లో సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. అలాగే రాయిపల్లి, శేఖపూర్‌, హుగెల్లిలో కొనసాగుతున్న ఫీవర్‌ సర్వేను మండల ప్రత్యేకాధికారి జిల్లా పశువైద్యాధికారి వసంతకుమారి పరిశీలించారు.

హవేళిఘణపూర్‌: మండల పరిధిలోని గ్రామాల్లో 35 బృందాలు 2029 మందికి సర్వే చేయగా  84 మందికి జ్వరం, 148 మందికి జలుబు, 111 మందికి దగ్గు, 40 మందికి ఒళ్లు నొప్పులు ఉండగా వీరందరికి హోం ఐసోలేషన్‌ కిట్లను అందజేసినట్లు మండల వైద్యాధికారి చంద్రశేఖర్‌రావు తెలిపారు.

పెద్ద శంకరంపేట: వివిధ గ్రామాల్లో 26 బృందాలు మొత్తం 2,189 కుటుంబాల్లో 6,936 మందికి జ్వర సర్వే నిర్వహించినట్లు మండల వైద్యాధికారి పుష్పలత తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్న 52మందికి కిట్లను అందజేసినట్లు వైద్యాధికారి తెలిపారు. పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 16 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌గా తేలినట్లు ఆమె వివరించారు. సర్వేలో ఎంపీపీ శ్రీనివాస్‌, సర్పంచ్‌ సత్యనారాయణ, ఎంపీవో రియాజుద్దీన్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శ్రీశైలం పాల్గొన్నారు.    

చిన్నశంకరంపేట: మండలంలోని కొర్వీపల్లి, అగ్రహారం, అంబాజిపేట గ్రామాల్లో మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రావణి ఆరోగ్య సర్వేను పరిశీలించారు. సర్వేలో 168 మందికి స్వల్ప లక్షణాలుండడంతో కిట్లను అందజేసినట్లు తెలిపారు. ఆమెవెంట ఎంపీడీవో గణే్‌షరెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశాలు ఉన్నారు.

జిన్నారం: బొల్లారం పీహెచ్‌సీ పరిధిలో 696 ఇళ్లల్లో డాక్టర్‌ రాధిక ఆధ్వర్యంలో ఫీవర్‌ సర్వేను నిర్వహించారు. 36మందికి జ్వరం లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, వారికి హోం ఐసోలేషన్‌ కిట్‌ పంపిణీ చేశారు. 

కంది: మండలంలోని 22 గ్రామాల్లో మొత్త 10,800 ఇండ్లు ఉన్నాయి. అందులో శుక్రవారం 3,193 ఇండ్లలోని జర్వసర్వే పూర్తయిందని, జ్వరం. దగ్గు, జలుబు లక్షణాలున్న 16 మందికి ఐసోలేషన్‌ కిట్లను అందజేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

పాపన్నపేట/చేగుంట/రేగోడు/ఝరాసంగం/నారాయణఖేడ్‌/గుమ్మడిదల: పాపన్నపేట, చేగుంట, రేగోడు, ఝరాసంగం, నారాయణఖేడ్‌, గుమ్మడిదల మండలాల్లో శుక్రవారం ఇంటింటికీ జ్వర సర్వే కార్యక్రమం నిర్వహించారు. పాపన్నపేటలో ఏపీడీ భీమయ్య, సర్పంచ్‌ గురుమూర్తిగౌడ్‌, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ జ్వర సర్వేలో పాల్గొన్నారు. గుమ్మడిదలలో ఎంపీడీవో దయాకర్‌రావు, మండల వైద్యాధికారి శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఎంపీపీ సద్ది ప్రవీణా విజయభాస్కర్‌రెడ్డి సర్వేను పరిశీలించారు.


Updated Date - 2022-01-22T04:46:53+05:30 IST