బదిలీల దందా!

ABN , First Publish Date - 2022-06-30T09:43:43+05:30 IST

ఆదాయాన్ని బట్టి చెక్‌‘పోస్టు’కు ధర! దీనికి అదనంగా ప్రతి నెలా కప్పం

బదిలీల దందా!

  • రవాణా శాఖలో పోస్టింగ్‌ల రచ్చ
  • ఆకస్మికంగా కమిషనర్‌ బదిలీ
  • ఆ వెంటనే రంగంలోకి ఓ నేత
  • ఎంవీఐలు, ఏఎంవీఐలతో భేటీ
  • బదిలీలు, పోస్టింగ్‌లపై భారీ బేరాలు
  • ప్రతి నెలా మామూళ్లు కూడా!
  • బెజవాడ కేంద్రంగా సాగిన దందా


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆదాయాన్ని బట్టి చెక్‌‘పోస్టు’కు ధర! దీనికి అదనంగా ప్రతి నెలా కప్పం! ఇది రవాణా శాఖలో మొదలైన కొత్తరకం బదిలీల దందా! రవాణా శాఖలో ఉద్యోగులు, అధికారుల బదిలీల ప్రక్రియ జరుగుతుండగానే... ఆ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ను మరోచోటికి బదిలీ చేసేశారు. ఇది సంచలనం సృష్టించింది. మరోవైపు... ఒక కీలక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి ‘పోస్టింగ్‌’లను అమ్మకానికి పెట్టినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... విజయవాడ ఆటోనగర్‌లోని ఒక అతిథి గృహం వేదికగా ఈ దందా మొదలైంది.  గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు పన్నెండు చెక్‌పోస్టులు, సింగిల్‌ పాయింట్‌లలో పోస్టింగ్‌ కోసం రూ.15 లక్షల నుంచి 25 లక్షల వరకూ వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది. రవాణా శాఖలో బదిలీలకు ప్రభుత్వం జీఓ విడుదల చేయగానే... పైరవీల సందడి మొదలైంది. అయితే... బదిలీ కోరుకునే వారు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలని రవాణాశాఖ కమిషనర్‌గా  ఉన్న కాటమనేని భాస్కర్‌ ఈ నెల 17న కౌన్సెలింగ్‌కు సిద్ధపడ్డారు. రెండేళ్లు దాటిన వారిని కూడా బదిలీ చేయాలన్న విన్నపాలను తొలుత తోసిపుచ్చారు. 


ఆ తర్వాత మంత్రి సిఫారసుతో సరే అన్నారు. కానీ... ప్రతి ఒక్కరికీ పది ఆప్షన్లు పెట్టి ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌కు రమ్మన్నారు. ఫోకల్‌, నాన్‌ ఫోకల్‌ ఆప్షన్లపై ఎంవీఐలు, ఏఎంవీఐలు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. నేతల నుంచి వచ్చిన సిఫారసులనూ పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్‌ రెండుసార్లు వాయిదా పడింది. చివరికి... బుధవారం  బదిలీల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, మంగళవారం రాత్రి కమిషనర్‌పైనే ప్రభుత్వం బదిలీవేటు వేసింది. ఆ వెంటనే విజయవాడ ఆటోనగర్‌లోని ఒక గెస్ట్‌ హౌస్‌లో కీలక ప్రజా ప్రతినిధితో వందమందికి పైగా ఎంవీఐలు (మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌), ఏఎంవీఐలు, ఇతర అధికారులు భేటీ అయ్యారు. ఏ పోస్టుకు ఎంత ధర? అనే అంశంపై అర్ధరాత్రి వరకు చర్చ జరిగినట్లు తెలిసింది. పోస్టింగ్‌కు ఒక్కసారి డబ్బులు ఇవ్వగానే సరిపోదని, వచ్చే ఆదాయాన్ని బట్టి ప్రతినెలా మామూలు కూడా ఇవ్వాలని సదరు నాయకుడు షరతు పెట్టినట్లు తెలిసింది. 


గరిష్ఠంగా రూ.25లక్షలు! 

ప్రస్తుతం అధికారికంగా చెక్‌పోస్టులు లేవు. కానీ... ఆయా ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతోపాటు... కొన్ని ప్రాంతాలు ‘రవాణా’ ఆదాయానికి బాగా ప్రసిద్ధి చెందాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక సరిహద్దు చెక్‌పోస్టులో పోస్టింగ్‌కు రూ.25 లక్షలు సమర్పించుకున్నట్లు తెలిసింది. ఆదోని, గూడూరు, కొవ్వూరు, ఇచ్చాపురం తదితర చెక్‌ పోస్టులతోపాటు సింగిల్‌ పాయింట్‌లలో పోస్టులకు అధిక ధర పలికినట్లు సమాచారం. జిల్లాల్లో ఆదాయం ఉండే పోస్టింగ్‌లకు రూ.10 లక్షలు సమర్పించేందుకు ఎంవీఐలు సిద్ధపడినట్లు తెలిసింది. అలాగే... వీరికి ప్రతినెలా మామూళ్లూ కూడా ఫిక్స్‌ అయ్యాయని చెబుతున్నారు. కొందరు కొత్త పోస్టింగ్‌ కోసం డబ్బులివ్వగా, మరికొందరు ఉన్న చోటు నుంచి మార్చకుండా ఉంచడానికి భారీగా ముడుపులు చెల్లించుకున్నట్లు తెలిసింది. బదిలీల ప్రక్రియ గురువారంతో ముగుస్తుంది. ఆ తర్వాత మరిన్ని లావాదేవీలు బయటికి వచ్చే అవకాశముంది.

Updated Date - 2022-06-30T09:43:43+05:30 IST