కొనండి సారూ..!

ABN , First Publish Date - 2021-11-29T06:18:07+05:30 IST

వానలు ముంచెత్తాయి.

కొనండి సారూ..!
రుద్రవరంలో ఆరబోసిన వరి ధాన్యం

  1. ప్రభుత్వానికి వరి రైతుల వేడుకోలు
  2. భారీ వర్షాలకు నీట మునిగిన పంట
  3. కోత కోశాక మళ్లీ వానలతో నష్టం
  4. భారీగా పెరిగిన నూర్పిడి ఖర్చు
  5. బహిరంగ మార్కెట్‌లో ధర పతనం
  6. కనిపించని కొనుగోలు కేంద్రాలు


రుద్రవరం/ఉయ్యాలవాడ, నవంబరు 28: వానలు ముంచెత్తాయి. వరి పంట నీట మునిగింది. రైతులు తిప్పలుబడి కోత కోసి కొంత దిగుబడి సాధించారు. ఆరబెట్టేలోగా మళ్లీ వాన మొదైలైంది. అమ్ముకుందామంటే ధర పతనమైంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎక్కడి పంటను అక్కడే గిట్టుబాటు ధరకు కొంటామని బీరాలు పలికిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ఇది జిల్లాలో వరి రైతుల దుస్థితి. వరి సాగు చేసిన ఎవరిని పలకరించినా కంటతడి పెడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ కింద సుమారు 2 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఎకరానికి రూ.30 వేల దాకా పెట్టుబడి పెట్టారు. పంట చేతికందేసమయంలో వర్షాలు కురవడంతో తీవ్రంగా నష్టపోయారు ఎకరాకు 35 నుంచి 40 బస్తాలు రావాల్సిన దిగుబడి కేవలం 15 నుంచి 25 బస్తాలకు పడిపోయిందని వాపోతున్నారు. 


ఉయ్యాలవాడ మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 800 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. పంట చేతికి వచ్చే సమయానికి అధిక వర్షాలు దెబ్బతీశాయి. అరకొరగా వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. 


గిట్టుబాటు ధర ఏదీ..?


కేంద్ర ప్రభుత్వం గత ఏడాది క్వింటం వరి ధాన్యం గ్రేడ్‌-ఎ రకానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది గ్రేడ్‌-ఎ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 ప్రకటించింది. ప్రస్తుతం 75 కిలోల వరి ధాన్యం బస్తా రేటు మార్కెట్‌లో రూ.1,050 నుంచి రూ.1,100 పలుకుతోంది. ఈ లెక్కన బస్తాపై రూ.355 నుంచి రూ.370 వరకూ నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. 


బస్తా డీఏపీ రూ.1,380 


కష్టపడి పండించిన ధాన్యం బస్తా రేటు కంటే ఎరువు బస్తా రేటే ఎక్కువగా ఉంది. డీఏపీ ధర రూ.1,380 పలుకుతోంది. ఇంతకంటే ఓ రూ.300 తక్కువ ధరకే వరి ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు కంటతడి పెడుతున్నారు. 


కొనుగోలు కేంద్రాలు ఏవీ..?


వరి రైతులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి పంటను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని పదే పదే ప్రకటిస్తున్నారేగానీ, ఎక్కడా అమలు చేయడం లేదు. వరి కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. దీంతో రైతులు తక్కువ ధరకు వ్యాపారులకు అమ్మాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. 


తగ్గిన దిగుబడులు


అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా వరి ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఎకరాకు 15 నుంచి 25 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోంది. కొన్ని చోట్ల వరి పంట నేల వాలిపోయి తేమశాతం ఎక్కువై కుళ్లిపోతోంది. కోతకు మునుపే ధాన్యానికి మొలకలు వచ్చాయి. దీంతో కొంత మంది రైతులు నూర్పిడి చేయకుండానే వదిలి వేశారు. ఈ ఏడాది వరి రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు.


పెరిగిన కోత ధరలు


వరి కోత ధరలు అమాంతం పెరిగాయి. కోత దశలో నేలను ఎండబెట్టి టైర్ల కోత యంత్రాలతో నూర్పిడి చేసుకుంటారు. ఈ యంత్రాలకు గంటకు రూ.1,200 నుంచి రూ.1,400 చెల్లిస్తారు. కానీ ఇప్పుడు వానల కారణంగా పొలాన్ని ఎండబెట్టే పరిస్థితి లేకుండా పోయింది. చైన్‌ మిషన్‌లతో మాత్రమే పంటను నూర్పిడి చేసే వీలుంది. ఇదే అదునుగా భావించిన కమీషన్‌ దారులు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి చైన్‌ మిషన్‌లు తెప్పించారు. గంటకు రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎకరా వరికోతకు 1.30 గంటల నుంచి 2 గంటల సమయం పడుతోంది. గిరాకీ పెరిగే కొద్దీ కోత ధరలను పెంచుతున్నారు. దీంతో రైతులపై మరింత భారం పడుతోంది. 


రూ.వెయ్యికే అమ్మాను


ఆరు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. ఎకరాకు 25 బస్తాల దిగుబడి వచ్చింది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నిల్వ చేయటానికి వీలులేక బస్తా రూ.వెయ్యికే అమ్మాను. పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. ఒక బస్తా ఎరువు ధర రూ.1200 నుంచి రూ.1600 ఉంది. అంత ధర కూడా ధాన్యానికి లభించడం లేదు.                 


 - ప్రభాకర్‌ రెడ్డి,  రైతు, మాయలూరు


నూర్పిడి ఖర్చు పెరిగింది


పంట నూర్పిడి యంత్ర సేవల ధరలు అమాంతం పెరిగాయి. ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చు అవుతోంది. అధిక వర్షాల వల్ల పొలాల్లో తేమ ఆరలేదు. అందువల్ల చైన్‌ మిషన్‌తో పంట కోయవలసి వస్తోంది. గంటకు రూ.3,700 చెల్లిస్తున్నాం. వర్షాలు వెంటాడుతున్నాయి. అందువల్ల అధిక ధర వెచ్చించి పంట కోయాల్సి వస్తోంది.

 

 - పెద్ద జగ్గన్న, రైతు మాయలూరు


తగ్గిన దిగుబడి


దిగుబడి ఎకరాకు 20 నుంచి 25 బస్తాలకు పడిపోయింది. 35 నుంచి 40 బస్తాలు దిగుబడి రావాల్సి ఉంది. ప్రకృతి దాడితో తీవ్ర నష్టం జరిగింది. ఏడు ఎకరాల్లో సాగు చేస్తే పెట్టుబడి కూడా చేతికందలేదు.


- మాధవ, రైతు, చిత్రేణిపల్లె 


నష్టపోయా..


22 ఎకరాల్లో వరి సాగు చేసి తీవ్రంగా నష్టపోయాను. చేతికందే సమయంలో ప్రకృతి దెబ్బతీసింది. పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదు. ఈ ఖరీఫ్‌ అప్పులను మిగిల్చింది. 


- పుల్లారెడ్డి, రైతు, డి.కొట్టాల 


త్వరలో కొంటారు..


వరి ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. గ్రేడ్‌-ఎ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధరను ప్రకటించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి పౌర సరఫరాల శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.


- ప్రసాదరావు, ఏవో, రుద్రవరం


Updated Date - 2021-11-29T06:18:07+05:30 IST