ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-10-27T11:42:39+05:30 IST

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉపఎన్నిక సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భారతి హోలికేరి అధికారులకు సూచించారు.

ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు

సిద్దిపేటకలెక్టర్‌ భారతి హోలికేరి


సిద్దిపేటసిటీ, అక్టోబరు 26: స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉపఎన్నిక సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భారతి హోలికేరి అధికారులకు సూచించారు.  ఆదివారం ఆమె సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉప ఎన్నికలో 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, నియోజకవర్గపరిధిలో 315 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని రిటర్నింగ్‌ అధికారి బి. చెన్నయ్య కలెక్టర్‌కు వివరించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.  ఓటుహక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా స్వీప్‌ కార్యక్రమాలను చేపడుతున్నామని ఎన్నికల నోడల్‌ అధికారి జయచంద్రారెడ్డి వివరించారు. అనంతరం కలెక్టర్‌ భారతి హోలికేరి మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో అనుమానిత వాహనాలను, వ్యక్తులను తనిఖీ చేయాలని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించేలా చూడాలని ఆమె సూచించారు. నిబంధనలు పాటించకుండా ప్రచారం సాగిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలూ, అల్లర్లు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పోలింగ్‌ ముగిసే వరకు ఎస్‌ఎస్టీ, వీడియో వ్యూయింగ్‌ టీం, వీఎస్టీ, ఏంసీఏంసీల పనితీరును, ర్యాండమైజేషన్‌ గురించి కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ఈనెల 28లోపు ఫొటో ఓటరు జాబితాను పూర్తి చేయాలన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో పోలింగ్‌ రోజు కేంద్రాల వద్ద గ్లౌజులు, థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజర్‌, మాస్కులను అందుబాటులో ఉంచాలని ఓటర్లు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఎన్నికల రూట్‌ మ్యాపింగ్‌, రూట్‌ అధికారుల నియామకంపై అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

Updated Date - 2020-10-27T11:42:39+05:30 IST