సొంతంగానే ‘వృత్తి విద్య’ ఫీజుల ఖరారు!

ABN , First Publish Date - 2022-05-26T09:00:58+05:30 IST

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): వృత్తి విద్యా కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ

సొంతంగానే ‘వృత్తి విద్య’ ఫీజుల ఖరారు!

శ్రీ కృష్ణ కమిటీ సిఫారసుల అమలు కష్టమే

నేటి టీఏఎఫ్‌ఆర్‌సీ భేటీలో తుది నిర్ణయం

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): వృత్తి విద్యా కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ముఖ్యంగా కనిష్ఠ ఫీజు విషయంలో కమిటీ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా ఉండడంతో.. సొంతంగానే ఫీజులను ఖరారు చేయాలని యోచిస్తున్నారు. దేశంలో ఇంజనీరింగ్‌ కోర్సుల కనీస ఫీజును రూ.79,600గా, గరిష్ఠ ఫీజును రూ.1.89 లక్షలుగా బీఎన్‌ శ్రీకృష్ణ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా.. ఈ మేరకు ఏఐసీటీఈ అధికారులు అన్ని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. అయితే, ఈ కమిటీ సిఫారసులను రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ సిఫారసులను అమలు చేయాలా? లేక సొంతంగా ఫీజులను ఖరారు చేయాలా? అనే విషయంపై సొంతంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించింది. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

మూడేళ్ల పాటు ఇవే ఫీజులు

ఈ ఏడాది నుంచి (2022-23) వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో వసూలు చేసే ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. 2019-22 నుంచి మూడేళ్ల కాలానికి సంబంధించి గతంలో నిర్ణయించిన ఫీజుల అమలు గడువు ముగిసింది. దాంతో 2022-23 నుంచి కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పుడు ఖరారు చేసే ఫీజులు 2024-25 విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయి. ఇంజనీరింగ్‌తోపాటు, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్‌ వంటి అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు ఈ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ను జారీ చేసి, ఆయా కాలేజీల నుంచి ప్రతిపాదనలను కూడా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజు కనిష్ఠంగా రూ.30వేలు ఉండగా,  గరిష్ఠ ఫీజు రూ.1.34లక్షల వరకు ఉంది. వీటిని కనీసం 50శాతం మేర పెంచాలని ఆయా కాలేజీలు ఏఎ్‌ఫఆర్‌సీకి ప్రతిపాదనలను సమర్పించాయి. వీటిపై పరిశీలన సైతం పూర్తయింది. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను కేంద్రం రాష్ట్రానికి పంపించింది. ఇందులో ఇంజనీరింగ్‌ విద్యకు సంబంధించి కనిష్ఠ ఫీజును రూ. 79,600గా నిర్ణయించారు. అయితే, రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజులను ఈ స్థాయికి పెంచే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఈ మేరకు శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను పక్కన పెట్టి, సొంతంగానే ఫీజులను ఖరారు చేయాలని సర్కార్‌ భావిస్తోంది. అందులో భాగంగా శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను తిరస్కరిస్తూ ఏఎ్‌ఫఆర్‌సీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తారు. ఆ తర్వాత సొంతంగా ఫీజులు ఖరారు చేసే అవకాశం ఉంది.

Updated Date - 2022-05-26T09:00:58+05:30 IST