దివిసీమలో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-11-17T10:26:36+05:30 IST

ఆదివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు రహదారులు జలమయం అయ్యాయి.

దివిసీమలో భారీ వర్షం

కోడూరు, నవంబరు 15 : ఆదివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు  మండలంలోని పలు రహదారులు జలమయం అయ్యాయి. వరి చేలు ముంపునకు గురయ్యాయి. ఈదురుగాలులు, భారీ వర్షానికి చేతికొచ్చిన పంట నేలకొరిగింది.  పంట చేతికందే దశలో కురుస్తున్న వర్షం వల్ల నష్టాలపాలు అవుతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.  నాగాయలంక : ఆదివారం మండలంలో భారీ వర్షం కురిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈదురుగాలులతో కుండపోతగా వర్షం కురిసింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మూడ్రోజుల క్రితం భారీ వర్షానికి వరి పొలాలు నేలకొరగగా, మరోసారి కురుస్తున్న వర్షానికి పంట పూర్తిగా దెబ్బతింటుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


మోపిదేవి : వర్షంతో మండలంలోని ఆయా గ్రామాల్లో వరి పంట నేలకొరగటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి, పెదప్రోలు, పెదకళ్లేపల్లి, వెంకటాపురం గ్రామాల్లో పంట చేతికంది వస్తుందనుకున్న తరుణంలో వర్షం  కురుస్తుండంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేసి ప్రభుత్వమే ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.  


వరికి నష్టం

కూచిపూడి : వర్షం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. గత వారం పదిరోజులుగా అడపాదడపా కురిసిన వర్షాలకు వరి  నేలకొరిగింది. తాజాగా ఆదివారం పలు గ్రామాల్లో వర్షం కురవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటకు అపార నష్టం వాటిల్లటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వారం రోజుల్లో వరి కోతలు ప్రారంభించాల్సిన తరుణంలో వర్షం రైతు  వెన్ను విరిచినట్లయింది. 


వణుకుతున్న రైతులు

తోట్లవల్లూరు : మండలంలో ఆదివారం  వర్షం కురిసింది. కొన్ని చోట్ల కోతలు కోసిన వరి పనలు తడిసిపోగా, చాలాచోట్ల పైర్లు నేల వాలాయి. వరి గింజలు మొలకలు వచ్చే ప్రమాదం నెలకొందని రైతులు భయపడుతున్నారు.  వరి చేతికి దక్కకపోతే పూర్తిగా కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


 పమిడిముక్కల : మండలంలో వర్షం కురవటంతో వరి కోతలు కోసిన రైతులు బెంబేలెత్తుతున్నారు. ఐదు రోజులుగా కపిలేశ్వరపురం, గుర్రాలంక, హనుమంతపురం, మంటాడ, పమిడిముక్కల, అగినపర్రు గ్రామాల్లో రైతులు వరికోతలు కోస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం పడటంతో కోత జరిగి పనలపై ఉన్న వరి తడిచిపోయింది. దీని వల్ల గింజ రంగు మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-11-17T10:26:36+05:30 IST