తొలిరోజే తడబడి

ABN , First Publish Date - 2020-11-03T11:09:17+05:30 IST

కరోనా నేపథ్యంలో విద్యార్థులు సోమవారం భయంభయంగా పాఠశాలల్లో అడుగుపెట్టారు.

తొలిరోజే  తడబడి

విజయవాడ, ఆంధ్రజ్యోతి/మచిలీపట్నం : కరోనా నేపథ్యంలో విద్యార్థులు సోమవారం భయంభయంగా పాఠశాలల్లో అడుగుపెట్టారు. జిల్లాలో మొత్తం 1,107 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలు ఉండగా, కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పునఃప్రారంభించారు. జిల్లాలో మొత్తం 6,877 మంది టీచర్లకు గానూ, 6,189 మంది విధులకు హాజరయ్యారు. 61,999 మంది పదో తరగతి విద్యార్థులకు గానూ, 37,199 మంది హాజరయ్యారు. 67,492 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులకు 37,120 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి రాజ్యలక్ష్మి ప్రకటించారు.


క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు  భిన్నంగా ఉన్నాయి. చల్లపల్లి మండలంలో 20 శాతం మంది విద్యార్థులు కూడా రాలేదు. ఈ మండలంలో మొత్తం 13 పాఠశాలలు తెరుచుకోగా, 1,843 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 373 మందే వచ్చారు. ముసునూరు మండలంలో మొత్తం ఏడు జడ్పీ హైస్కూళ్లు తెరుచుకోగా, తొమ్మిదో తరగతి విద్యార్థులు మొత్తం 430 మందిలో కేవలం 51 మందే హాజరయ్యారు. పదో తరగతి విద్యార్థులు 394 మందికి గానూ 53 మందే వచ్చారు. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 


కొవిడ్‌ నిబంధనలు తూచ్‌..!

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఎక్కువ పాఠశాలల్లో తిలోదకాలిచ్చేశారు. తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్‌ పత్రాలు తీసుకురావాలనే నిబంధనలు అమలుకాలేదు. పామర్రు జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 124 మంది ఉండగా, కేవలం 24 మందే పేరెంట్‌ డిక్లరేషన్‌ పత్రాలు తెచ్చారు. అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులు 114 మంది ఉండగా, కేవలం 16 మందే డిక్లరేషన్‌ ఇచ్చారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలోని రుస్తుంబాద బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులు 70 మంది ఉండగా, 19 మందే హాజరయ్యారు. 9వ తరగతిలో 80 మందికి గానూ  14 మంది వచ్చారు.


తొమ్మిది, పదో తరగతి విద్యార్థినులను కూర్చుని చదువుకోమని చెప్పారు.  ఈ విషయంపై ఆరాతీస్తే.. సబ్జెక్టులు బోధించే టీచర్లు 8మంది ఇంగ్లీష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌లో ఉన్నారని, ఈనెల 23వ తేదీ వరకు రారని చెప్పారు. ఈ పాఠశాలలో ఒకే ఒక్క శానిటైజర్‌ బాటిల్‌ స్టాండ్‌ను ఉంచారు. పాఠశాలకు నిధులు లేక తమ సొంత డబ్బుతో వీటిని సమకూర్చామని టీచర్లు తెలిపారు. గుండుపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 16 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులకు గానూ ఐదుగురే హాజరయ్యారు.  పదో తరగతి విద్యార్థులు 18 మందికి  గానూ 12మంది హాజరయ్యారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌ చేసిన దాఖలాలు కనిపించలేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు, సబ్బులను పాఠశాల నిధులతో కొనుగోలు చేసుకుని తర్వాత బిల్లులు పెట్టాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.


ప్రభుత్వ పాఠశాలల్లో నిధుల కొరత కారణంగా ఉపాధ్యాయులే తమ సొంత డబ్బుతో ఒక్కొక్క శానిటైజర్‌ బాటిల్‌, సబ్బును కొని తెచ్చారు. భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న తరగతి గదులే చాలని పరిస్థితుల్లో విద్యార్థులను వరండాల్లోనూ, చెట్ల కింద నేలపై కూర్చోబెట్టి పాఠాలు బోధించారు. 

Updated Date - 2020-11-03T11:09:17+05:30 IST