పోలీసుల తీరు హుందాగా ఉండాలి

ABN , First Publish Date - 2020-11-05T11:34:08+05:30 IST

ప్రభుత్వాల నడక ఎలా ఉన్నప్పటికీ పోలీసుల తీరు మాత్రం హుందాగా ఉండాలని, రాజధాని రైతులు, మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.

పోలీసుల తీరు హుందాగా ఉండాలి

విజయవాడ సిటీ : ప్రభుత్వాల నడక ఎలా ఉన్నప్పటికీ పోలీసుల తీరు మాత్రం హుందాగా ఉండాలని, రాజధాని రైతులు, మహిళల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. రాజధానిపై అక్రమ కేసులు, అరెస్టులు, పోలీసుల దమనకాండను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా వడ్డే మాట్లాడుతూ పోలీసుల వ్యవహారశైలిపై డీజీపీ మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు.


రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడుతూ వికేంద్రీకరణ పేరుతో సీఎం జగన్‌ నిర్ణయించిన మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదన్నారు. అమరావతి పరిరక్షణ జేఏసీ కన్వీనర్‌ శివారెడ్డి మాట్లాడుతూ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్న ఈ తుగ్లక్‌ ప్రభుత్వానికి సరైన గుణపాఠం తెలపకపోతే భావితరాల దృష్టిలో చరిత్ర హీనులుగా మిగిలిపోతామన్నారు. కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం కన్వీనర్‌ టి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ రాజధాని కోసం 5 వేల ఎకరాల భూమి సేకరణ సాధ్యం కాదని శివరామకృష్ణ చెప్పిందన్నారు. అలాంటి సమయంలో రాజధాని కోసం తమ భూములు త్యాగం చేసి త్యాగ ధనులైన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ సాగించడాన్ని చరిత్ర క్షమించదన్నారు.


రైతు ఉద్యమానికి కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్ర కమిటీ సంపూర్ణ మద్దతు అందిస్తుందన్నారు. తెలుగు రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌ తన సొంత ఖజానా నింపుకోవడానికే మూడు రాజధానుల అంశం తీసుకువచ్చారని ఆరోపించారు. అఖిలభారత రైతు మహాసభ నాయకుడు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్‌, ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర నాయకుడు జమలయ్య మాట్లాడుతూ రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి.రాణి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-05T11:34:08+05:30 IST