అమరావతిని కాదంటే అంధకారమే

ABN , First Publish Date - 2020-11-06T10:15:54+05:30 IST

సీఎం జగన్‌ సచివాలయానికి వెళ్లే ప్రతిసారీ దీక్షా శిబిరాలను పోలీసులు ఖాళీ చేయించటం అన్యాయం అని రాజధాని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతిని కాదంటే అంధకారమే

తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, నవంబరు 5: సీఎం జగన్‌ సచివాలయానికి వెళ్లే ప్రతిసారీ దీక్షా శిబిరాలను పోలీసులు ఖాళీ చేయించటం అన్యాయం అని రాజధాని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం 324వ రోజుకు చేరాయి. ఐనవోలు, తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, దొండపాడు, అనంతవరం, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, రాయపూడి, నేలపాడు శిబిరాల్లో ఆందోళనలు కొనసాగాయి. తాడేపల్లి మండలం పెనుమాకలో రైతుల నిరసన దీక్షలు చేపట్టారు.


మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతు సంఘ నేతల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. మందడం శిబిరంలో ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు అన్నారు. ఆ రెండు కళ్లను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పొడిచారని, రాష్ట్రం అంధకారమైందన్నారు. కాగా, సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశానికి సీఎం హాజరవుతున్న నేపథ్యంలో మందడంలో భారీగా పోలీసులు మోహరించారు. బలవంతంగా దుకాణాలను మూసివేయించారు. దీక్ష చేస్తున్న వారిని వదిలేసి తమను ఎందుకు ఖాళీ చేయమంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. సీఎం కాన్వాయ్‌ వెళ్లే సమయంలో రైతులు ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు.  

Updated Date - 2020-11-06T10:15:54+05:30 IST