ప్రజలకు పరీక్ష!

ABN , First Publish Date - 2020-11-07T07:31:05+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ అంటూ అధికారులు ఓపక్క హెచ్చరిస్తూనే, పరీక్షల కోసం వెళుతున్న కొవిడ్‌ అనుమానితులకు ఆ అవకాశమే లేకుండా చేస్తున్నారు.

ప్రజలకు పరీక్ష!

 ఐమాస్క్‌ బస్సులు లేక ఇబ్బందులు 

 విధుల బహిష్కరణలో వైద్యసిబ్బంది

 అస్తవ్యస్తంగా పరీక్షల నిర్వహణ తీరు 

  మరోవైపు పొంచి ఉన్న స్వైన్‌ ఫ్లూ ముప్పు 

  పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కరోనా సెకండ్‌ వేవ్‌ అంటూ అధికారులు ఓపక్క హెచ్చరిస్తూనే, పరీక్షల కోసం వెళుతున్న కొవిడ్‌ అనుమానితులకు ఆ అవకాశమే లేకుండా చేస్తున్నారు.  నిన్న మొన్నటి వరకూ ఐమాస్క్‌ బస్సుల ద్వారా ఏరోజు ఏ ప్రాంతంలో కొవిడ్‌ నమూనాలు (స్వాబ్‌) సేకరిస్తున్నారో ముందుగా ప్రజలకు తెలిసేలా ప్రకటించిన జిల్లా అధికారులు ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. 


ఇప్పుడు కరోనా పరీక్షల ప్రక్రియే సజావుగా సాగడం లేదు. ఐమాస్క్‌ బస్సుల ద్వారా నమూనాలు సేకరించే కాంట్రాక్టు వైద్యసిబ్బందికి మూడు నెలలుగా జీతాలు చెల్లించడంలేదు. ఈ కారణంగా వారంతా విధులను బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలో 24 ఐమాస్క్‌ బస్సుల ద్వారా స్వాబ్‌ తీసే ప్రక్రియ నిలిచిపోయింది. కరోనా అలజడి మొదలైనప్పటి నుంచి విజయవాడ నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, రైల్వేస్టేషన్‌, వన్‌టౌన్‌లోని గాంధీజీ మున్సిపల్‌ హైస్కూలు, గుణదలలో మేరీమాత చర్చి వద్ద.. ఇలా నిర్దేశిత పాయింట్లలో కరోనా పరీక్షలకు నమూనాలు (స్వాబ్‌) సేకరించేవారు. వాటికి ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి పాజిటివా? నెగెటివా? అనే సమాచారాన్ని బాధితుల సెల్‌ఫోన్‌లకే సమాచారం అందించేవారు. మూడు రోజులుగా కాంట్రాక్టు వైద్యసిబ్బంది విధులను బహిష్కరించడంతో ఆ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.


 సెకండ్‌ వేవ్‌ భయం

జిల్లాలో ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైందని అధికారులే ప్రకటిస్తుండటంతో ప్రజలు భయంతో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు అలవాటు ప్రకారం ఐమాస్క్‌ బస్సులుండే ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత సిబ్బంది లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగి వస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఎక్కువమంది దగ్గు, జలుబు, తుమ్ములతో బాధపడుతున్నారు. చలికాలంలో ఇలాంటి సీజనల్‌ కేసులు సహజమే అయినా.. ప్రస్తుతం జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైందని, వైరస్‌ మరోసారి విజృంభించే ప్రమాదముందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి.


సాధారణ జలుబు, దగ్గు, తుమ్ములు వస్తున్నా కరోనా అనే భయంతో పరీక్షలు చేయించుకునేందుకు పరుగులు తీస్తున్నారు. తీరా ఐమాస్క్‌ బస్సులుండే ప్రాంతాలకు వెళ్లాక.. అక్కడ స్వాబ్‌ తీసేందుకు వైద్య సిబ్బంది లేరని తెలుసుకుని వెనుదిరుగుతున్నారు. చాలామంది ప్రాణభయంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రభుత్వం ఉచితంగా నిర్వహించే పరీక్షల కోసమే ఎదురుచూస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నవారు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు, గ్రామీణ ప్రాంతాలవారు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవచ్చునని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. 


 జిల్లాలో ఐమాస్క్‌ బస్సులు లేకపోవడంతో రోజువారీగా నిర్వహించే కరోనా పరీక్షల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. రోజుకు ఐదు వేలకు పైగా నమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌లకు పంపించేవారు. ఇప్పుడు నమూనాల సేకరణ నిలిచిపోవడంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గిపోయింది. జిల్లాలో సెకండ్‌ వేవ్‌ మొదలై ప్రాణాంతక వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంకా ఎక్కువగా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తే తప్ప జిల్లాలో సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఏస్థాయిలో ఉందనేది తెలుసుకోవడం కష్టమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత చలికాలంలో కరోనాతోపాటు స్వైన్‌ఫ్లూ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని, కరోనా తరహాలోనే స్వైన్‌ఫ్లూ కూడా ఊపిరితిత్తుల వ్యవస్థ (రెస్పిరేటరీసిస్టం)పై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాణాంతక వైరస్‌ల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

Updated Date - 2020-11-07T07:31:05+05:30 IST