నిస్సిగ్గుగా సమర్థింపు..!

ABN , First Publish Date - 2020-11-08T08:19:58+05:30 IST

పవిత్రమైన దుర్గమ్మ సన్నిధిని దేవదాయశాఖ మంత్రే..

నిస్సిగ్గుగా సమర్థింపు..!

విజయవాడ, ఆంధ్రజ్యోతి : పవిత్రమైన దుర్గమ్మ సన్నిధిని దేవదాయశాఖ మంత్రే రాజకీయాలతో కలుషితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు చర్యలు తీసుకోకపోగా, నిస్సిగ్గుగా సమర్థించుకునేందుకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రయత్నించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణ వీధిలోని దుర్గగుడి పరిపాలనా కార్యాలయాన్ని మంత్రి వెలంపల్లి తన అడ్డాగా మార్చుకున్నారు. పార్టీ సమావేశాలకు వేదికగా తయారు చేశారు.


మే 17న పశ్చిమలోని 22 డివిజన్లలో పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా శుక్రవారం దుర్గగుడి చైర్మన్‌ పైలా సోమినాయుడు నేతృత్వంలోనే వైసీపీ నేతలు, కార్యకర్తలను సమావేశపరిచి పార్టీ ర్యాలీల నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. 


తప్పు ఒప్పుకోకపోగా..

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో అసహనానికి గురైన మంత్రి వెలంపల్లి తన ట్విట్టర్‌లో దుర్గగుడి పాలనా కార్యాలయాన్ని తన క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడంలో తప్పేమిటో తెలియడం లేదన్నట్టుగా పేర్కొన్నారు. టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు కూడా దుర్గగుడి పాలనా కార్యాలయంలోనే తన క్యాంపు కార్యాలయాన్ని నిర్వహించారంటూ గుర్తుచేశారు. ఇది వాస్తవమే. దేవదాయశాఖ మంత్రి క్యాంపు కార్యాలయంగా దుర్గగుడి పాలనా కార్యాలయాన్ని వాడుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, దాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేయడంపైనే భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


ఆంధ్రజ్యోతి వెలికితీస్తున్న వాస్తవాలపై వణుకెందుకో..: జనసేన నేత పోతిన వెంకట మహేశ్‌

దుర్గగుడి పరిపాలనా కారాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేసిన ఘనత మంత్రి వెలంపల్లికి దక్కుతుందని జనసేన నేత పోతిన మహేశ్‌ విమర్శించారు. దుర్గగుడి పాలనా కార్యాలయంలో  మంత్రి క్యాంపు కార్యాలయం ఉండటం ఎవరికీ ఆక్షేపణ కాదని, కానీ అక్కడ వైసీపీ సమావేశాలు నిర్వహించడంపైనే అందరి అభ్యంతరం అని మహేశ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి వాస్తవాలను ప్రచురిస్తే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తన అక్రమాలను సిగ్గులేకుండా సమర్థించుకోవడం ఏమిటని ఆయన నిలదీశారు. 


దుర్గగుడి చైర్మన్‌, ఈవోపై పోలీసులకు ఫిర్యాదు

దుర్గగుడి పాలకమండలి కార్యాలయంలో వైసీపీ సమావేశం నిర్వహించి, భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్‌బాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నాయకులు కామరాజ్‌ హరీశ్‌ కుమార్‌ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-11-08T08:19:58+05:30 IST