బందరు కాల్వలో బాలిక గల్లంతు

ABN , First Publish Date - 2020-11-10T10:48:15+05:30 IST

నానమ్మకు సహాయం చేయడానికి వెళ్లిన ఓ చిన్నారి కాలుజారి బందరు కాల్వలో పడిపోయింది. అందరూ చూస్తుండగానే చేతులెత్తి సహాయం కోసం ఆర్థిస్తూ గల్లంతైంది. ఈ ఘటన విజయవాడ ఫకీరుగూడెంలో సోమవారం చోటుచేసుకుంది.

బందరు కాల్వలో బాలిక గల్లంతు

విజయవాడ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : నానమ్మకు సహాయం చేయడానికి వెళ్లిన ఓ చిన్నారి కాలుజారి బందరు కాల్వలో పడిపోయింది. అందరూ చూస్తుండగానే చేతులెత్తి సహాయం కోసం ఆర్థిస్తూ గల్లంతైంది. ఈ ఘటన విజయవాడ ఫకీరుగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. ఫకీరుగూడెంలో నివసించే ఆటోడ్రైవర్‌ పేరిపోగు క్రాంతికుమార్‌ పెద్ద కుమార్తె రిషిత(12) బందరు కాల్వ రేవులో బట్టలు ఉతుకుతున్న నానమ్మ మరియమ్మకు సహాయం చేయడానికి వెళ్లింది. అక్కడ కాలు జారి కాల్వలో పడిపోయింది. కళ్లెదుటే మనవరాలు కాపాడమంటూ నీటిలో కొట్టుకు పోతుంటే, మరియమ్మ తను కూడా పెద్దగా కేకలు వేస్తూ పాపను రక్షించడానికి చీరను విసిరింది. పక్కనే ఉన్న మరో వ్యక్తి తాడును విసిరాడు. అయినా ఫలితం లేకపోయింది. రిషిత తండ్రి కాల్వలోకి దూకినా ప్రయోజనం లేకపోయింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం గాలింపు చర్యలు చేపట్టినా, ఆచూకీ లేదు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.  


 సాయం చేసేందుకు వెళ్లి..  

బందరు కాల్వలో రిషిత గల్లంతవడంతో ఎప్పుడూ సందడిగా ఉండే ఆ వీధిలో విషాదం అలముకుంది. ఉయ్యూరులోని ఓ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న రిషిత లాక్‌డౌన్‌లో హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటోంది. సోమవారం ఉదయం ఇంట్లో తండ్రితో చాలాసేపు గడిపింది. తర్వాత మేనత్త ఇంటికి వెళ్లింది. సాయంత్రం మేనత్త కుమార్తె పుట్టినరోజు వేడుకలు ఉండడంతో ఇంటి డెకరేషన్‌లో ఆమెకు సాయమందించింది. అక్కడి నుంచి రేవుకు వెళ్లింది. అక్కడ బట్టలు ఉతుకుతున్న నానమ్మ మరియమ్మకు సాయం చేయాలనుకుంది. ఎప్పటి మాదిరిగానే రేవులో దిగింది. మెట్లకు నాచు పట్టేసి ఉండడంతో రిషిత దిగానే కాలు జారి నీళ్లలో పడిపోయింది. పనిలో నిమగ్నమై ఉన్న మరియమ్మ పెద్ద శబ్దం వినిపించడంతో వెనుదిరిగి చూసింది.


కాపాడమంటూ కొట్టుకుపోతున్న మనమరాలిని చూసి సాయం కోసం కేకలు వేసింది. వీధిలో ఉన్న వారంతా వచ్చినా ఫలితం లేకపోయింది. తండ్రి క్రాంతికుమార్‌కు ఈత రావడంతో కాల్వలోకి దూకి, బిడ్డను కాపాడే ప్రయత్నం చేశాడు. రిషిత చేతులను పట్టుకునే లోపే మరింత లోతుకు జారిపోయింది. కళ్లెదుటే బిడ్డ కనిపించకుండా పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృంద సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలించారు. అయినా రిషిత ఆచూకీ లభించలేదు. 

Updated Date - 2020-11-10T10:48:15+05:30 IST