ద్వీపం’ దూరమేనా!

ABN , First Publish Date - 2020-11-16T11:34:51+05:30 IST

ఈ కార్తీకంలోనైనా భవానీ ద్వీపంలోకి పర్యాటకులకు ప్రవేశముంటుందా? వరద ఉధృతిలో బోట్లను అనుమతిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం సోమవారం తెలుస్తుంది. కార్తీకమాసం పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి మంచి సీజన్‌.

ద్వీపం’ దూరమేనా!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఈ కార్తీకంలోనైనా భవానీ ద్వీపంలోకి పర్యాటకులకు ప్రవేశముంటుందా? వరద ఉధృతిలో బోట్లను అనుమతిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం సోమవారం తెలుస్తుంది. కార్తీకమాసం పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి మంచి సీజన్‌. కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న పర్యాటకానికి ఈ మాసం జీవాన్నిస్తుందని, ఆదాయాన్ని కూడా సాధించవచ్చని ఏపీటీడీసీ భావిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులతో, పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు బోట్లకు అనుమతులు ఇచ్చే విషయంపై చర్చలు జరపాలని నిర్ణయించారు. 


కృష్ణానదిలో వరద కొనసాగుతూనే ఉంది. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఇంకా తెరిచే ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో బోట్లకు అనుమతులు ఇవ్వటం మంచిది కాదని ఇరిగేషన్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఇదే మాసంలో పవిత్రసంగమం వద్ద బోటు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నాడు కూడా కృష్ణానది నిండుకుండలా ఉంది. పట్టిసీమ లిఫ్ట్‌ ద్వారా పోలవరం కుడికాల్వ నుంచి గోదావరి నీరు పవిత్ర సంగమం దగ్గర కలుస్తుండటంతో కృష్ణానది నీటిమట్టం పెరిగింది. కృష్ణా, గోదావరిల సంగమ ప్రాంతంలోనే రివర్స్‌ క్లబ్‌ బోట్‌ తిరగబడింది.


ఆ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని వరద ఉధృతి కారణంగా ఇప్పటి వరకు ఇరిగేషన్‌ శాఖ బోట్లకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో పర్యాటకాభివృద్ధి సంస్థ సిబ్బంది కూడా ద్వీపంలోకి ప్రవేశించి పునరుద్ధరించే పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. బోట్లకు అనుమతులు ఇస్తే ద్వీపం మొత్తాన్ని రెండు రోజులలో శుభ్రం చేసి పునరుద్ధరిస్తామని ఏపీటీడీసీ అధికారులు అంటున్నారు. 


 భద్రత ఎంత?

 ఇరిగేషన్‌ శాఖ అనుమతులు ఇచ్చినా.. ద్వీపంలోకి ప్రవేశం ఎంత వరకు క్షేమదాయకం అన్నది చర్చనీయాంశంగా మారుతోంది. వరద ప్రవాహాన్ని పెద్ద బోట్లే తట్టుకుంటాయి. ప్రస్తుతం ఏపీటీడీసీకి చెందిన స్పీడ్‌ బోట్లు మూడు, జెట్‌ స్కీయింగ్‌లు రెండు, పన్నెండు సీటర్‌ బోట్లు మూడు, ఇరవై సీటర్‌ బోట్లు మూడింటికి మాత్రమే అనుమతులున్నాయి. 50 సీటింగ్‌ కలిగిన మూడు మెకనైజ్డ్‌ బోట్లకు అనుమతులు రాలేదు. మరమ్మతులు పూర్తి చేసుకుని ఇవి అందుబాటులోకి రావటానికి పది రోజులకు పైగా సమయం పడుతుంది.


ఈ బోట్ల ద్వారా ఎక్కువ మందిని ద్వీపంలోకి తీసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. డబుల్‌ డెక్కర్‌ క్రూయిజ్‌ బోధిసిరిలో 100 మందికి పైగా పర్యాటకులను తరలించవచ్చు. దీనికి కూడా మరమ్మతులు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అందుబాటులో ఉన్న స్పీడ్‌ బోట్లు, జెట్‌ స్కీయింగ్‌, 12, 20 సీటర్‌ బోట్లు వరద ప్రవాహంలో ఎంత వరకు క్షేమదాయకం అన్నది ప్రశ్నార్థకంగా. 

Updated Date - 2020-11-16T11:34:51+05:30 IST