గ్రీన సిగ్నల్‌

ABN , First Publish Date - 2022-06-25T06:34:15+05:30 IST

అమలాపురంలో అల్లర్లు, విధ్వంస సంఘటనలు జరిగిన సరిగ్గా నెల తరువాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశం గ్రీనసిగ్నల్‌ ఇచ్చింది.

గ్రీన సిగ్నల్‌
అల్లవరం మండలం మొగళ్లమూరిలో ఎంపీ చింతా అనురాధ నివాసం వద్ద పోలీసు బందోబస్తు

  • డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్పునకు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం
  • అల్లర్లు జరిగిన నెల తర్వాత ఆమోద ముద్ర
  • తుది నోటిఫికేషన త్వరలో విడుదల
  • ముందస్తుగానే జిల్లాలో భద్రతా బలగాల మోహరింపు
  • ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పటిష్ట బందోబస్తు

అమలాపురంలో అల్లర్లు, విధ్వంస సంఘటనలు జరిగిన సరిగ్గా నెల తరువాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశం గ్రీనసిగ్నల్‌ ఇచ్చింది. ముందస్తుగానే జిల్లావ్యాప్తంగా అనూహ్య రీతిలో పోలీసు బలగాలను అడుగుడుగునా మోహరింపచేసిన తరువాత  కేబినెట్‌ నిర్ణయం వెలువడింది. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు ప్రత్యక్ష పర్యవేక్షణలోనే బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలు, ముఖ్య కూడళ్లలో పోలీస్‌ పికెట్లు నిర్వహించారు. అమలాపురం, రావులపాలెం సహా కీలక ప్రాంతాల్లో వజ్ర వాహనాలను సైతం ముందస్తుగా సిద్ధం చేశారు. పేరు మార్పును హరిస్తూ ఎవరూ రోడ్లపైకి రావద్దని పోలీసులు హెచ్చరించారు. 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీలో ఆమోదం తెలిపారు. గత నెల 24న జరిగిన అమలాపురం అల్లర్ల ఘటన జరిగి సరిగ్గా నెల తర్వాత అదే తేదీన జిల్లా పేరు మార్పునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాగా గత నెల 18న రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన జారీ చేసింది. నెల కాల పరిమితితో ప్రజల అభ్యంతరాలను స్వీకరించేందుకు కలెక్టర్‌కు ప్రభుత్వం అప్పట్లో అనుమతిచ్చింది. అయితే ఆ పేరును వ్యతిరేకిస్తూ గత నెల 19న బండారులంకలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 20న అంబాజీపేట మండల స్థాయిలో ఆందోళన నిర్వహించి భారీ ర్యాలీగా అమలాపురం వచ్చి కలెక్టర్‌ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. భారీగా వినతిపత్రాలు కూడా అందజేశారు. కోనసీమ జిల్లా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు మే 24న అమలాపురం కేంద్రంగా జరిగిన ఆందోళనలు అదుపు తప్పాయి. అల్లర్లు, విధ్వంసానికి దారితీసింది. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు సహా బస్సులకు నిప్పు పెట్టి పోలీసులపై దాడికి దిగారు. అప్పటి నుంచీ కోనసీమ జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో పోలీసు బలగాలు నెల నుంచీ మోహరించే ఉన్నాయి. 144 సెక్షన కూడా అమలులో ఉంది. అయితే ప్రిలిమినరీ నోటిఫికేషన విడుదల చేసిన నెల వ్యవఽధిలో వచ్చిన అభ్యంతరాలను కలెక్టర్‌ స్వీకరించారు. వీటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికపై కేబినెట్‌లో చర్చించిన అనంతరం ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. తుది గెజిట్‌ వెలువడిన వెంటనే అధికారికంగా జిల్లా పేరును మార్చనున్నారు.

ప్రభుత్వం పేరు మారుస్తూ తీసుకోనున్న నిర్ణయానికి ముందే పోలీసు యంత్రాంగం జిల్లావ్యాప్తంగా అలెర్టయింది. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు స్వీయ పర్యవేక్షణలో భద్రతా బలగాలు అమలాపురం, రావులపాలెం, రాజోలు, తాటిపాక, కాట్రేనికోన, రామచంద్రపురం, మండపేట, కొత్తపేట వంటి అన్ని ముఖ్య కూడళ్లలో భద్రతా దళాలను మోహరింపచేశారు. అల్లవరం మండలం మొగళ్లమూరిలో ఎంపీ చింతా అనురాధ ఇంటి వద్ద, మలికిపురంలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు క్యాంపు కార్యాలయం, కత్తిమండ, చింతలమోరిలలో ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇంటి వద్ద, గోపాలపురంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇంటి వద్ద, వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇంటి వద్ద, అమలాపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇంటి వద్ద, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నివాసం ఉండే రామచంద్రపురం ప్రాంతంలోను అదనపు బలగాలను మోహరింపచేశారు. పలుచోట్ల పోలీస్‌ పికెట్లు ఏర్పాటుచేసి కవాతులు నిర్వహించారు. కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తాటిపాక సెంటర్లో అంబేడ్కర్‌ విగ్రహానికి దళితులు నిషేధాజ్ఞల నడుమ క్షీరాభిషేకానికి ప్రయత్నించగా పోలీసులు నలుగురిని మాత్రమే అనుమతించారు. అమలాపురంలో కోనసీమ అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి చైర్మన డీబీ లోక్‌, కన్వీనర్‌ జంగా బాబూరావు, ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు ఆధ్వర్యంలో దళితులు సమావేశమై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన సీఎం జగన, మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. 

Updated Date - 2022-06-25T06:34:15+05:30 IST