Air India విమానంలో కాలిన వాసన... అత్యవసరంగా మస్కట్‌కు మళ్లింపు...

ABN , First Publish Date - 2022-07-17T20:27:18+05:30 IST

కాలికట్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు బయల్దేరిన విమానంలో కాలిన వాసన రావడంతో

Air India విమానంలో కాలిన వాసన... అత్యవసరంగా మస్కట్‌కు మళ్లింపు...

న్యూఢిల్లీ : కాలికట్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు బయల్దేరిన విమానంలో కాలిన వాసన రావడంతో అత్యవసరంగా మస్కట్‌కు మళ్లించారు. ముందు వరుసలోని ఓ కిటికీ నుంచి ఈ వాసన వస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది. ఇటీవల స్పైస్‌జెట్, ఇండిగో విమానాల్లో కూడా సాంకేతిక లోపాలు కనిపించడంతో అత్యవసరంగా వేరొక విమానాశ్రయాల్లో దిగవలసిన పరిస్థితులు ఎదురైన సంగతి తెలిసిందే. 


ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వీటీ-ఏఎక్స్ఎక్స్ ఆపరేటింగ్ ఫ్లైట్ ఐఎక్స్-355 (కాలికట్-దుబాయ్)  శనివారం రాత్రి మస్కట్‌లో సురక్షితంగా దిగినట్లు డీజీసీఏ తెలిపింది. ముందు వరుసలోని ఓ కిటికీ నుంచి కాలిన వాసన వస్తున్నట్లు సిబ్బంది గుర్తించడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ విమానాన్ని అత్యవసరంగా దించినట్లు తెలిపింది. 


విమానాల్లో ఇటీవల బయటపడుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. షార్జా-కొచ్చి ఎయిర్ అరేబియా విమానంలో శనివారం హైడ్రాలిక్ వైఫల్యం కనిపించింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. అదే రోజున ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న ఇండిగో విమానం ఇంజిన్ కంపించడంతో జైపూర్‌లో అత్యవసరంగా దించేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ విమానాన్ని అత్యవసరంగా దించేసినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. 


షార్జా-హైదరాబాద్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారని ఇండిగో ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్ళించినట్లు పేర్కొంది. ఈ విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళేందుకు మరొక విమానాన్ని పంపించినట్లు పేర్కొంది. 


ఇటీవల దుబాయ్-మధురై స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఆలస్యంగా బయల్దేరింది. అడ్డిస్ అబబా నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రెజరైజేషన్ సమస్య ఏర్పడటంతో అత్యవసరంగా కోల్‌కతాలో దిగిందని డీజీసీఏ జూలై 16న ప్రకటించింది. 


Updated Date - 2022-07-17T20:27:18+05:30 IST