Human composting: మనుషుల మృతదేహాలను పెట్టెల్లో పెట్టి.. ఎరువుగా మార్చి.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2022-09-20T00:12:09+05:30 IST

నేచురల్ ఆర్గానిక్ రిడక్షన్(Natural Organic Reduction) పద్ధతితో మృతదేహాలను మట్టి, ఎరువుగా మార్చే.. పర్యావరణహిత అంత్యక్రియలకు చట్టబధ్దత కల్పించే దిశగా కాలిఫోర్నియా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Human composting: మనుషుల మృతదేహాలను పెట్టెల్లో పెట్టి.. ఎరువుగా మార్చి.. ఎందుకంటే..

ఎన్నారై డెస్క్: పంచభూతాలతో రూపొందిన ఈ దేహం చివరికి ప్రకృతిలో కలిసిపోవాల్సిందే. కానీ..పుట్టిన నాటి నుంచి మనిషి తెలిసో తెలియకో తన కార్యకలాపాలతో పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంటాడు. దురదృష్టవశాత్తూ.. మరణించాక కూడా ఈ తీరు కొనసాగుతుంది. మృతదేహాల దహనం కోసం శిలాజ ఇంధనాల వినియోగం..దహనకార్యక్రమంతో వెలువడే కర్బన ఉద్గారాలు.. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఇక కొన్ని సంస్కృతుల్లో మృతదేహాలను ఎంబామింగ్(Embalming) చేస్తారు. అంటే..శరీరాల్లోకి కొన్ని రసాయనాలను ఎక్కించి ఖననం చేసే వరకూ అవి కుళ్లిపోకుండా చేస్తారు. ఈ ప్రక్రియలో వాడే కెమికల్స్ పర్యావరణానికి హాని కలిగిస్తాయి. మరి దీనికి ముగింపు లేదా అంటే ఉందంటోంది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం. నేచురల్ ఆర్గానిక్ రిడక్షన్(Natural Organic Reduction) పద్ధతిలో మృతదేహాలను మట్టి, ఎరువుగా మార్చే.. పర్యావరణహిత అంత్యక్రియలకు చట్టబధ్దత కల్పించే బిల్లుపై  ఆ రాష్ట్ర గవర్నర్ ఆదివారం సంతకం చేశారు. 2027 నుంచి ఆ రాష్ట్రంలో ఈ తరహా అంత్యక్రియలకు అనుమతిస్తారు. 




హ్యూమన్ కంపోస్టింగ్- పర్యావరణహిత అంత్యక్రియలు..

ఈ విధానంలో మనిషిని దహనం, ఖననం చేసే బదులు.. సహజసిద్ధమైన పద్ధతుల్లో మట్టి, ఎరువుగా మార్చేస్తారు. అంటే కంపోస్ట్ కింద మార్చడం అన్నమాట. ఆ కంపోస్ట్‌ను మొక్కల పెంపకానికి వినియోగిస్తారు.  దీన్నే హ్యూమన్ కంపోస్టింగ్(Human composting) అని కూడా అంటారు. వాస్తవానికి ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఈ తరహా అంత్యక్రియలకు గతంలో ఆమోదం తెలిపాయి. ఈ విధానంలో భాగంగా ఎనిమిది అడుగుల కంటెయినర్‌లో గడ్డి, పూలు, రంపపు పొట్టు వంటివాటిని పరిచి వాటిపై మృతదేహాలు పెట్టి కంపెయినర్‌ను మూసేస్తారు. 


ఇలా 35 నుంచి 40 రోజుల పాటు క్రిమికీటకాలు, సూక్ష్మజీవుల కారణంగా మృతదేహం మట్టి, ఎరువుగా మారిపోతుంది. ఈ ప్రక్రియలో వెలువడే కార్బన్ డైఆక్సైడ్ కూడా మట్టిలో భాగమైపోతుంది. అలా తయారైన కంపోస్ట్‌ను(Compost) వృక్షాలు పెరిగేందుకు వీలుగా సమీప అడవుల్లో చల్లుతారు. హ్యూమన్ కంపోస్టింగ్‌తో ఓ మెట్రిక్ టన్ను కార్బన్ డైఆక్సైడ్ గాల్లో కలవకుండా నిరోధించవచ్చని నిపుణులు చెబుతారు. అన్నట్టు.. సియాటిల్‌కు చెందిన రికంపోజ్(Recompose) సంస్థ ఇప్పటికే ఈ తరహా అంత్యక్రియలు నిర్వహిస్తోంది. ఇప్పటికే.. హ్యూమన్ కంపోస్టింగ్‌కు ఆమోదం తెలుపుతూ వాషింగ్టన్(Washington), కొలరాడో(Colorado), డెలావేర్(Delaware), హవాయ్(Hawaii) రాష్ట్రాలు చట్టాలు తెచ్చాయి. అయితే..ఇలా వచ్చిన ఎరువుతో వ్యవసాయం మాత్రం చేయకూడదని నిబంధన విధించాయి. 

Updated Date - 2022-09-20T00:12:09+05:30 IST