ఫోన్ చేస్తే.. ఫ్రీగా మూడు పూటలా ఫుడ్ డోర్‌ డెలివరీ

ABN , First Publish Date - 2021-06-17T19:40:24+05:30 IST

కరోనా మహమ్మారి బారిన పడి.. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటూ..

ఫోన్ చేస్తే.. ఫ్రీగా మూడు పూటలా ఫుడ్ డోర్‌ డెలివరీ

  • అన్నార్తుల అక్షయపాత్ర.. సాయి క్షేత్రం
  • కొవిడ్‌ బాధితుల ఇంటికే భోజనం
  • నెల రోజుల్లో లక్ష భోజనాల సరఫరా
  • మూడు పూటలా డోర్‌ డెలివరీ 


హైదరాబాద్ సిటీ/దిల్‌సుఖ్‌నగర్‌ : దక్షిణ షిర్డీగా విరాజిల్లుతోన్న దిల్‌సుఖ్‌నగర్‌ శ్రీ షిర్డీ సాయి సంస్థాన్‌ భక్తితో పాటు.. సేవా కార్యక్రమాలకు పెద్ద పీటవేస్తోంది. నిత్య అన్నదానం చేస్తూ ఎంతోమంది అభాగ్యుల కడుపు నింపుతున్న సాయిసంస్థాన్‌ ట్రస్ట్‌ లాక్‌డౌన్‌ మూలంగా అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేసింది. కరోనా మహమ్మారి బారిన పడి.. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న వారి కడుపు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. ఆపదకాలంలో అన్నార్తుల పాలిట అక్షయపాత్రగా మారింది. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న వారికి నెల రోజులుగా మూడుపూటలా భోజనాన్ని సరఫరా చేస్తూ వారి కడుపునింపుతోంది. మే 14న కొవిడ్‌ బాధితులకు భోజన సరఫరాను ప్రారంభించిన సంస్థాన్‌ నెల రోజుల వ్యవధిలో సుమారు లక్ష భోజనాలను ఉచితంగా సరఫరా చేసింది.


ఫోన్‌ చేస్తే ఇంటికే భోజనం.. 

ఆహారం కావాల్సిన వారు సాయి సంస్థాన్‌కు (040-24150277, 040-24150184, 8330966566) సమాచారం ఇస్తే.. దిల్‌సుఖ్‌నగర్‌ సాయి సంస్థాన్‌ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని  వారికి భోజనాన్ని హోమ్‌ డెలివరీ చేస్తున్నారు. ఆహారం కోసం ఒక రోజు ముందు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చిన వారికి ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలను ఇంటికే సరఫరా చేస్తున్నారు. దూరప్రాంతాల వారికి ఆహారం కావాలంటే ముందు రోజు సమాచారం ఇచ్చి, రోగి సహాయకులు లేదా కుటుంబ సభ్యులు సంస్థాన్‌ వద్దకు వస్తే పార్శిల్‌ ఇస్తున్నారు.


శుచికి.. శుభ్రతకు పెద్దపీట 

శుచికి, శుభ్రతకు పెద్ద పీట వేసి టిఫిన్‌, భోజనాలను వండుతున్నారు. సంస్థాన్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ బచ్చు జనార్దన్‌, ప్రధానకార్యదర్శి ఈవీవీ నాగేశ్వరరావుశర్మ, అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ గుండా మల్లయ్య, వూర నర్సింహగుప్తా, శ్యామ్‌కుమార్‌, బాబురావులు నిత్యం అక్కడే ఉండి సిబ్బంది వంట చేసే తీరును పరిశీలిస్తూ శుచి, శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ వంటచేయడంతోపాటు   ప్యాకింగ్‌ చేస్తున్నారు. వంట పదార్థాల్లో కూడా రాజీ పడకుండా రోగనిరోధక శక్తి పెరుగుదల కోసం బాదం, జీడిపప్పు, నెయ్యి, కీర, క్యారెట్‌, బీట్‌రూట్‌ వంటి వాటిని అందజేస్తున్నారు. మొదటి రోజు 50 మందికి, రెండు, మూడు రోజులు 100 మందికి మాత్రమే సరఫరా చేయగా ఆ తరువాత నుంచి ప్రతి రోజూ 1300 మందికి మూడు పూటలా భోజనం సరఫరా చేస్తున్నారు. భోజనం డెలివరీ కోసం మూడు ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు.  


బల్దియా సిబ్బందికి..

జీహెచ్‌ఎంసీ తూర్పు జోన్‌ పరిధిలోని సరూర్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌ సర్కిళ్ల పరిధిలో కొవిడ్‌ సహాయ చర్యల్లో పాల్గొంటున్న పారిశుధ్య సిబ్బంది, వైద్యసిబ్బందికి కూడా ఉచితంగా ఆహారం సరఫరా చేస్తున్నారు. తమను ఆశ్రయిస్తున్న అనాథ ఆశ్రమాలకు కూడా ఆహారం అందజేస్తున్నారు.


సేవ చేయడమే ధ్యేయం 

భక్తులకు సాయి దర్శనంతోపాటు సేవలందించడమే తమ ట్రస్ట్‌ ధ్యేయం. ఉచిత అన్నదానం, వైద్య సేవలు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తాం. కరోనా కష్టకాలంలో బాధితులకు బాసటగా నిలవాలన్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సూచన మేరకు ఆహారం పంపిణీకి పాలకవర్గం ఆమోద ముద్ర వేసింది. రోజూ ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను సరఫరా చేస్తున్నాం. - బచ్చు గంగాధర్‌, సంస్థాన్‌ ట్రస్ట్‌ చైర్మన్‌.


వైద్య సేవలు.. ఉచిత మందులు

ఉచితంగా ఆహారం పంపిణీ చేయడంతోపాటు కరోనా బాధితుల కోసం ప్రత్యేక వైద్య సహాయ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ ద్వారా బాధితులకు వైద్యుల సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేస్తున్నాం. - ఈవీవీ నాగేశ్వరరావుశర్మ, సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రధానకార్యదర్శి. 


నాణ్యతకు పెద్దపీట

ఆహార తయారీలో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నాం. వంట చేసేవారు, ఆహారాన్ని ప్యాకింగ్‌ చేసే సిబ్బంది కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు సరిపడే ఆహారాన్ని తయారు చేసి పంపిణీ చేస్తున్నాం. ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌, సున్నుండలు కూడా ఇస్తున్నాం. - గుండా మల్లయ్య, ట్రస్ట్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ 


అవసరమైన వారు ఆశ్రయించండి

రోజూ సుమారు మూడు వేలకు పైగా భోజనాలను పంపిణీ చేస్తున్నాం. లాక్‌డౌన్‌ ఉన్నంత కాలం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అవసరమైన బాధితులు ఆహారం కోసం సంస్థాన్‌ను సంప్రదించాలి. అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు. - వూర నర్సింహగుప్తా, సంస్థాన్‌ ట్రస్ట్‌ ఉపాధ్యక్షుడు.

Updated Date - 2021-06-17T19:40:24+05:30 IST