ప్రశాంతంగా ఏకలవ్య ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2022-05-22T06:42:17+05:30 IST

పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఆరు నుంచి 9వ తరగతి ప్రవేశాలకు శనివారం ప్రవేశపరీక్ష నిర్వహించారు.

ప్రశాంతంగా ఏకలవ్య ప్రవేశ పరీక్ష
పరీక్ష కేంద్రం వద్ద హాల్‌ టిక్కెట్‌ నంబర్లు చూసుకుంటున్న విద్యార్థులు


2,602 మందికి 2,055 మంది విద్యార్థులు హాజరు 

పాడేరురూరల్‌, మే 21: పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఆరు నుంచి 9వ తరగతి ప్రవేశాలకు శనివారం ప్రవేశపరీక్ష నిర్వహించారు. పాడేరులోని ఐదు కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశపరీక్షకు 2,602 మంది విద్యార్థులు హాజరుకావలసి ఉండగా.. 2,055 మంది హాజరయ్యారు. ఆరవ తరగతికి 2,321 మంది హాజరు కావాల్సి ఉండగా 1,909 మంది, ఏడవ తరగతికి సంబంధించి 278 మందికి 143 మంది, ఎనిమిదవ తరగతికి ఇద్దరు, 9వ తరగతికి ఒకరు హాజరయ్యారు.  

అవస్థలు పడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షను పాడేరులోని ఐదు పాఠశాలల్లో నిర్వహించడంతో ఏ పాఠశాల ఎక్కడ ఉందో తెలియక వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఏపీఆర్‌ కళాశాల వద్దకు రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో తలారిసింగి జంక్షన్‌ నుంచి ఏపీఆర్‌ కళాశాల వరకు విద్యార్థుల తల్లిదండ్రుల వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జి.లక్ష్మణరావు, జి.రంజిత్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఏపీఆర్‌ కళాశాల ప్రాంగణంలో నలుగురు అధ్యాపకులు ల్యాప్‌ట్యాప్‌లను పట్టుకొని ఏ విద్యార్థి సెంటర్‌ ఎక్కడ ఉందో చెబుతున్నప్పటికీ పలువురు తల్లిదండ్రులకు అడ్రస్‌లు తెలియక నానా అవస్థలు పడ్డారు.  


Updated Date - 2022-05-22T06:42:17+05:30 IST