ప్రచారాలు ముగిశాయ్‌ ..ప్రలోభాలు ఊపందుకున్నాయ్‌!

ABN , First Publish Date - 2021-03-09T07:38:30+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారపర్వం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది.ప్రచారానికి చివరి రోజు కావడంతో పలుచోట్ల అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం సుడిగాలి పర్యటనలు జరిపి ఎన్నికల ప్రచారం సాగించారు.

ప్రచారాలు ముగిశాయ్‌ ..ప్రలోభాలు ఊపందుకున్నాయ్‌!
మదనపల్లెలో బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేస్తున్న సిబ్బంది

మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం


తిరుపతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):మున్సిపల్‌ ఎన్నికల  ప్రచారపర్వం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది.ప్రచారానికి చివరి రోజు కావడంతో పలుచోట్ల అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం సుడిగాలి పర్యటనలు జరిపి ఎన్నికల ప్రచారం సాగించారు. తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి 5, 9, 43 డివిజన్లలో తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు.టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ముఖ్యనేతలు నరసింహప్రసాద్‌, నరసింహ యాదవ్‌, శ్రీధర్‌ వర్మ, జేడీ రాజశేఖర్‌ తదితరులు చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చిత్తూరులో అధికార పార్టీ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసు లు ఇరువారం, జానకారపల్లె, కట్టమంచి తదితర ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లను మద్దతు కోరగా టీడీపీ నేతలు పోలింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మదనపల్లెలో వైసీపీ నేతలు ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించగా 2వ వార్డులో సీపీఎం అభ్యర్థి గెలుపుకోసం టీడీపీ, సీపీఎం నేతలు సంయుక్త ప్రచారం నిర్వహించారు. అలాగే బీజేపీ, జనసేన పార్టీల నేతలు కూడా తమ అభ్యర్థుల కోసం కలసికట్టుగా ప్రచారం చేశారు. పలమనేరులో ఆదివారం రాత్రి మాజీ మంత్రి అమరనాధరెడ్డి టీడీపీ అభ్యర్థుల కోసం రెండు వార్డుల్లో ప్రచారం చేయగా సోమవారం వైసీపీ తరపున ఎమ్మెల్యే వెంకటేగౌడ సైతం రెండు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. 


డిప్యూటీ సీఎం, రోజా సంయుక్త ప్రచారం

అంటీముట్టనట్టుగా వుండే డిప్యూటీ సీఎం నారాయణసామి, ఎమ్మెల్యే రోజాలు సోమవారం సంయుక్తంగా ఎన్నికల ప్రచారంలోకి దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జీడీనెల్లూరు నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణస్వామి పుత్తూరు పట్టణంలో నివసిస్తున్నారు. సోమవారం పుత్తూరులో ఓపెన్‌ టాప్‌ జీపులో రోజా సుడిగాలి ప్రచారం సాగించారు. ఆ క్రమంలో 22వ వార్డుకు వెళ్ళారు. ఆ వార్డులోనే డిప్యూటీ సీఎం నివాసముంటు న్నారు. దీంతో ఆమె నేరుగా ఆయన నివాసానికి వెళ్ళి ప్రచారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. నారాయణ స్వామి కూడా అదే స్థాయిలో స్పందించారు. తనతో పాటు భార్యా కుమార్తెలను కూడా వెంటబెట్టుకుని మరీ రోజాతో కలసి ఓపెన్‌ టాప్‌ జీపెక్కి ప్రచారంలో పాల్గొన్నారు. తానున్న 22వ వార్డుతో పాటు పక్కనే వున్న 23వ వార్డులోనూ ప్రచారం చేశారు. అంతర్గత విభేదాలను పక్కనపెట్టి వీరిద్దరూ సాగించిన ఎన్నికల ప్రచారం పట్టణ ప్రజలను ఆకర్షించింది.

మదనపల్లెలో రాత్రికి రాత్రి కొత్త రోడ్ల నిర్మాణం

మదనపల్లె పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకుని ఓటర్ల మద్దతు దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు అనేక తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగా రాత్రికి రాత్రే అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయిస్తున్నారు.ఎప్పుడో టెండర్లు, అగ్రిమెంట్ల ప్రక్రియలు పూర్తయిన పలు తారు రోడ్ల నిర్మాణ పనులను ఇంతకాలం పట్టించుకోని అధికారులు, కాంట్రాక్టర్లు హడావిడిగా గంటల వ్యవధిలో పూర్తి చేసేస్తున్నారు. పట్టణంలోని శేషమహల్‌, అప్పారావు తోట, ఎస్‌బీఐ కాలనీ, సొసైటీ కాలనీ తదితర చోట్ల ఇప్పటికే తారు రోడ్ల నిర్మాణం పూర్తి కాగా ఇపుడు పెంచుపాడు రోడ్డ్డులో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాత్రి వరకూ లేని కొత్త రోడ్లు తెల్లారేసరికల్లా ప్రత్యక్షమై ఆయా ప్రాంత ప్రజల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.


పోలింగు ఏర్పాట్లలో అధికారులు

మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్‌ హరినారాయణన్‌ సోమవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.కొవిడ్‌ ప్రోటోకాల్‌ అమలు చేయాలన్న ఆయన పోలింగ్‌ సిబ్బందితో పాటు ఏజెంట్లు కూడా మాస్కులు, గ్లౌజులు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లు సైతం మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు.ఈ సందర్భంగా  కమిషనర్లు  తాము చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్‌కు వివరించారు. పోలింగ్‌ జరిగే మున్సిపాలిటీల్లో బుధవారం సెలవు ప్రకటించారు. 


మద్యం దుకాణాలు, బార్లు మూసివేత

 ఎన్నికలు జరుగుతున్న తిరుపతి, చిత్తూరు నగరాలు, మదనపల్లె, పలమనేరు, నగరి, పుత్తూరు పట్టణాల్లోనూ, వాటికి 5 కిలోమీటర్ల పరిధిలోనూ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచీ మద్యం దుకాణాలు, బార్లూ మూతపడ్డాయి. ఈ పరిధిలో 133 మద్యం దుకాణాలు, 28 బార్లు వున్నట్టు గుర్తించారు. వీటిని పోలింగ్‌ జరగనున్న ఈ నెల 10వ తేదీ దాకా మూసివేస్తున్నట్టు అధికార యంత్రాంగం ప్రకటించింది. పోలింగ్‌ ముగిశాక 11వ తేదీ నుంచీ 13వ తేదీ వరకూ యధాప్రకారం తెరుచుకుంటాయి. కాకపోతే 13వ తేదీన ఎక్కడైనా రీపోలింగ్‌ అనివార్యమైతే ఆయాచోట్ల మాత్రం 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచీ 13వ తేదీ రీ పోలింగ్‌ ముగిసే దాకా వీటిని తిరిగి మూసివేయనున్నారు. ఇక 14వ తేదీన ఓట్ల లెక్కింపు వున్నందున ఆ రోజు ఆయా నగరాలు, పట్టణాల్లోని దుకాణాలు, బార్లూ మూతపడనున్నాయి. మద్యం దుకాణాలు, బార్లు మాత్రమే కాకుండా ఆయా నగరాలు, పట్టణాల నుంచీ ఐదు కిలోమీటర్ల పరిధిలోని అన్ని డిస్టిలరీలు, బ్రేవరీలు, కల్లు దుకాణాలు సైతం మూసివేస్తారు. అదే విధంగా జిల్లాలోని మూడు హోల్‌సేల్‌ మద్యం డిపోలను కూడా ఆయా తేదీల్లో మూసివేస్తున్నట్టు అధికార యంత్రాంగం ప్రకటించింది. ఎన్నికలు జరగని ఇతర ప్రాంతాల్లో దుకాణాలు యధావిధిగా నడుస్తాయి. వాటికి అవసరమైన మద్యం నిల్వలను ముందుగానే చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.


మొదలైన ప్రలోభాల పర్వం

ప్రచార ఘట్టం ముగిసిందో లేదో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. తిరుపతిలో వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా నగదు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఒక్కరోజులోనే 90 శాతం పంపిణీ పూర్తయినట్టు సమాచారం. ఓటుకు వెయ్యి రూపాయల వంతున పంచినట్టు చెబుతున్నారు. గతంలో లాగా పోలింగ్‌కు ముందురోజు పంపిణీ చేస్తే ప్రత్యర్థులు నిఘా వుంచడం, అధికార పార్టీ వర్గాలు పోలీసులతో దాడులు చేయించడం వంటివి చేస్తారన్న ఉద్దేశంతో ముందుజాగ్రత్తగా ఒకరోజు ముందే పని కానిచ్చేసినట్టు చెబుతున్నారు. మదనపల్లెలో టీడీపీ వర్గీయులు నాలుగు వార్డుల్లో నగదు పంపిణీ చేపట్టారు. వైసీపీకి సంబంధించి ఆరు వార్డుల్లో అభ్యర్థులతో నిమిత్తం లేకుండా నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులను రప్పించి పంపిణీ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పలమనేరులో అయితే అటువంటి పరిస్థితి కన్పించడం లేదు.





Updated Date - 2021-03-09T07:38:30+05:30 IST