పాలకుల నిర్లక్ష్యం.. మత్స్యకారులకు శాపం

ABN , First Publish Date - 2022-07-07T06:09:56+05:30 IST

బందరు క్యాంప్‌బెల్‌పేట బోటు సముద్రంలో తప్పిపోయి ఐదు రోజులవుతున్నా మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టలేక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

పాలకుల నిర్లక్ష్యం.. మత్స్యకారులకు శాపం

- ఐదు రోజులైనా ఆచూకీ కనిపెట్టలేని ప్రభుత్వం

- మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం 

- ఆందోళనలో క్యాంప్‌బెల్‌పేట ప్రజలు

మచిలీపట్నం టౌన్‌, జూలై 6 : బందరు క్యాంప్‌బెల్‌పేట బోటు సముద్రంలో తప్పిపోయి  ఐదు రోజులవుతున్నా మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టలేక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. బుధవారం క్యాంప్‌బెల్‌పేటను కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు కుంచే నాని, లంకే శేషగిరి, నాగుల్‌మీరాలు సందర్శించారు. బాఽధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో గిలకలదిండిలో బోటు గల్లంతైన సందర్భంలో చంద్రబాబు చొరవ తీసుకుని బోటు వెతుకులాటకు కేంద్రంతో సంప్రదించి మిలిటరీ, నేవీదళాల సహకారంతో బోటును సురక్షితంగా తీసుకుని రావడం జరిగిందన్నారు. అదే రీతిలో  ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతీసుకుని గాలింపుచర్యలు ముమ్మరం చేసి విమానాలను పంపితే బోట్ల ఆచూకీ తెలుస్తుందన్నారు. బోట్లకు జీపీఎస్‌ అనుసంధానం చేయడంలో మత్స్యశాఖాధికారులు విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో బత్తిన నాగరాజు, లంకే హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

బాధితులకు టీడీపీ భరోసా..

క్యాంప్‌బెల్‌పేటలో మత్య్యకారుల కుటుంబసభ్యులకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ధైర్యం చెప్పారు. విశ్వనాథపల్లి చినమస్తాన్‌, చిననాంచారయ్య, చెక్కా నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావుల ఇళ్లకు వెళ్లి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

గంగమ్మతల్లికి శాంతి పూజలు 

గల్లంతయిన మత్స్యకారులు క్షేమంగా ఇంటికి రావాలంటూ సముద్రుడికి క్యాంప్‌బెల్‌పేట మత్స్యకార మహిళలు పూజలు నిర్వహించారు. తరతరాల సాంప్రదాయాన్ని పాటిస్తూ పూజలు జరిపారు. పడవ ప్రయాణాలు ప్రారంభించే రోజున సముద్రుడికి పూజలు చేస్తారు. అదే రీతిలో మహిళలు పూజలు చేసి తమ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని మొక్కుబడులు సమర్పించారు. మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ ఈ పూజలు చేశారు.

ఆందోళనలో క్యాంపుబెల్‌ పేట ప్రజలు

మత్స్యకారుల ఆచూకీ తెలియక క్యాంప్‌బెల్‌పేట ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు. బాధితుల ఇళ్లలో కుటుంబసభ్యులు విషాదంలో ఉన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బోటు యజమాని బాధిత కుటుంబాలను పరామర్శిస్తూనే ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి దారుణంగా ఉంది. కొందరు మహిళలు అనారోగ్యానికి గురికాగా కొల్లు రవీంద్ర వారికి వైద్యం చేయించేందుకు ముందుకు వచ్చారు. ఐదురోజులుగా నిద్రాహారాలు లేక తమకుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో ఆచూకీ తెలియక అల్లాడుతున్నారు. ఎప్పుడు ఏ కబురు వింటామోనని ఎదురు చూస్తున్న మత్స్యకారుల కుటుంబాలు దుఖంతో కుమిలిపోతున్నారు. కంట్రోల్‌ రూమ్‌కు ఏ విధమైన సమాచారం అందడం లేదు. తహసీల్దార్‌ సునీల్‌, సీఐ కొండయ్యలు మత్స్యశాఖ అధికారులు గ్రామంలోనే ఉన్నారు. పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పేర్ని నానిని కుటుంబసభ్యులు ఎక్కడున్నారంటూ నిలదీశారు. వెళ్ళిన బోటు చిన్నది కావడంతో ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. మత్స్యకారుల పిల్లలను క్యాంపుబెల్‌పేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.ఆదిశేషు బడికి తీసుకువచ్చి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. క్యాంపుబెల్‌పేట రామాలయం అరుగులపై ప్రజలు గుమిగూడి బోటు కోసం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Updated Date - 2022-07-07T06:09:56+05:30 IST