అధిక బరువుతో మోకాళ్ళకు దెబ్బ!

ABN , First Publish Date - 2020-03-03T16:21:38+05:30 IST

యంత్రుడి చేతితో... మోకాలికి మంత్రం అరిగిపోయిన టైరు మార్చిన విధంగా, అరిగిపోయిన మోకీలునూ మార్చక తప్పదు. అయినా కీలు మార్పిడి అనగానే వెనకడుగు వేస్తున్నాం. రిస్క్‌ ఎక్కువనీ,

అధిక బరువుతో మోకాళ్ళకు దెబ్బ!

ఆంధ్రజ్యోతి(03-03-2020)

యంత్రుడి చేతితో... మోకాలికి మంత్రం

అరిగిపోయిన టైరు మార్చిన విధంగా, అరిగిపోయిన మోకీలునూ మార్చక తప్పదు. అయినా కీలు మార్పిడి అనగానే వెనకడుగు వేస్తున్నాం. రిస్క్‌ ఎక్కువనీ, కృత్రిమ కీళ్లలో బలం తక్కువనీ, మార్పిడి తర్వాత అన్ని పనులూ చేయలేమనీ...ఇవన్నీ అర్థం లేని అపోహలు, భయాలు. ఇప్పుడు అత్యాధునిక  4జి రోబో హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆ ‘యంత్రుడి’ చేతి (రోబోటిక్‌ ఆర్మ్‌) సాయంతో జరిపే ఆర్ర్థోప్లాస్టీతో ఎలాంటి పొరపాట్లకూ ఆస్కారం లేకుండా మోకాలి మార్పిడి చేయించుకోవచ్చు. ఆ వసతి ఉన్న ఏకైక ఆస్పత్రి సన్‌ షైన్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌. ఆ ఆస్పత్రి ఎం.డి, చీఫ్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎ.వి. గురవారెడ్డి ‘నవ్య’తో పంచుకున్న విశేషాలు... 


పూర్తి మోకాలి మార్పిడి (టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌) సర్జరీ తీగ మీద నడక లాంటిదే! ఏమాత్రం పట్టు తప్పినా నష్టం తప్పదు. అందువల్ల ఏ చిన్న పొరపాటుకూ తావు లేకుండా కచ్చితత్వంతో సర్జరీ సాగాలి.


అనుభవానికి తోడుగా కచ్చితత్వం!

సర్జరీ సమయంలో అరిగిన కీళ్లకు ఇంప్లాంట్‌ బిగించేందుకు వీలుగా కత్తిరించవలసి ఉంటుంది. తొలగించిన ఎముక స్థానంలో కృత్రిమ కీలు కచ్చితంగా ఇరుక్కుంటేనే సర్జరీ సఫలమవుతుంది. కాబట్టి ఎముకలను ఎంతమేరకు, ఎంత లోతుగా, తొలగించాలి అనేది కచ్చితత్వంతో సాగాలి. ఎముకలను కత్తిరించే బ్లేడ్‌ ఏ కొంచెం పక్కకు జారినా, కీళ్లకు ఆసరాగా ఇరువైపులా ఉండే లిగమెంట్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఆ రెండింటిలో ఏ ఒక్కటి డ్యామేజి అయినా, కీళ్లు పట్టు కోల్పోతాయి. కాబట్టి ఎముకలను కొలత ప్రకారం కత్తిరించాలి. అనుభవజ్ఞులైన వైద్యులు ఈ పనిని సమర్థంగా చేయగలిగినా, రోబో సహాయం తీసుకోగలిగితే ఆ పనిలో ఇసుమంత పొరపాటుకూ తావు ఉండదు. వైద్యుల అనుభవానికి, రోబో కచ్చితత్వం తోడవుతుంది. అలా వైద్యులకు తోడ్పడే ఆధునిక నాలుగో జనరేషన్‌ రోబో ‘మ్యాకో’! 


మార్పిడి క్రమం ఇదే!

మోకాలి మార్పిడిలో తొలి అంకం సి.టి. స్కానింగ్‌. దీని ద్వారా వచ్చిన త్రీడీ ఇమేజ్‌తో మోకీళ్లు ఎంత మేరకు అరిగిపోయాయి, ఎంతమేరకు ఎముకలను కత్తిరించాలి అనేది అర్థం అవుతుంది. ఆ తర్వాత ఈ వివరాలను కంప్యూటర్‌కు ఫీడ్‌ చేసి, ఎంతమేరకు ఎముక కత్తిరించాలి అనే లెక్కలు సేకరిస్తారు. ఈ లెక్కలను రోబోకు ఫీడ్‌ చేస్తారు. ఇది సెమీ అటానమస్‌ రోబో. వైద్యులు సర్జరీ చేసే సమయంలో బ్లేడ్‌ కచ్చితంగా కదిలేలా బ్లేడ్‌ కదలికలనూ, పరిధినీ అది నియంత్రిస్తుంది. కాబట్టి పొరపాటుకు ఏ మాత్రం ఆస్కారం ఉండదు. ఇలా రోబో సహాయంతో ఎముకలను లిగమెంట్లు పాడవకుండా కత్తిరించిన తర్వాత, వైద్యులు ఇంప్లాంట్స్‌ను బిగిస్తారు. 


మరుసటి రోజే నడక!

రోబోల సహాయం లేకుండా చేసే సంప్రదాయ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో ఎముకలు కత్తిరించడానికి 30 నిమిషాల సమయం పడితే, మ్యాకో రోబో తాలూకు రోబోటిక్‌ ఆర్మ్‌ సహాయంతో ఎముకలు కత్తిరించడానికి పట్టే సమయం కేవలం రెండు నిమిషాలే! అలాగే సాధారణ సర్జరీకి తొంభై నిమిషాలు పడితే, మ్యాకో రోబోతో ఇదే సర్జరీని డెబ్భై నిమిషాల్లో ముగించవచ్చు. మున్ముందు మరింత నైపుణ్యం సాధించాక, మరింత సమయం ఆదా అయ్యి, సర్జరీకి పట్టే సమయం 40 నిమిషాలకు తగ్గే వీలుంది. కోతలు పెద్దగా లేకుండా, ఇంత త్వరగా, తేలికగా సర్జరీ ముగుస్తుంది కాబట్టి రోగికి సర్జరీ తరువాత నొప్పి స్వల్పంగానే ఉంటుంది. దానివల్ల రోగి కోలుకోవడానికి పట్టే సమయం కూడా సహజంగానే తగ్గుతుంది. పైగా సర్జరీ కోసం శరీరం మీద పెట్టే కోతలూ తక్కువే! ఫలితంగా తక్కువ రక్తస్రావంతో, సర్జరీ చేసిన మరుసటి రోజే ఎటువంటి సహాయం లేకుండా రోగి నడవగలుగుతాడు. సర్జరీ తర్వాత పదిహేను రోజుల పాటు ఫిజియోథెరపీ చేయవలసి ఉంటుంది. మ్యాకో రోబోతో బిగించిన కృత్రిమ కీళ్లు దాదాపు ఇరవై ఏళ్లకు పైగా మన్నుతాయి. 


ఈ మార్పిడితో ప్రయోజనాలు!

రోబోటిక్‌ మోకాలి మార్పిడి సర్జరీలో హై ఫ్లెక్స్‌ రకం ‘ట్రయథ్లాన్‌’ జాయింట్లు వాడతారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందికి మోకాలి మార్పిడికి వాడిన జాయింట్‌ ఇదే. కాబట్టి సర్జరీకి ముందు చేయలేని పనులను సైతం సర్జరీ తర్వాత చేయగలుగుతారు. ఉదాహరణకు... 

నడవడమే కాదు... వేగంగా నడవవచ్చు

నేల మీద కూర్చోవచ్చు

మెట్లు ఎక్కవచ్చు


అధిక బరువుతో మోకాళ్ళకు దెబ్బ!  

పెరిగే వయసుతో పాటు మోకాళ్ళ అరుగుదలా పెరుగుతుంది. అయితే, మోకీళ్లు ఎక్కవ కాలం మన్నాలంటే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు పెరిగేకొద్దీ కీళ్ల మీద ఒత్తిడి పెరిగి, మృదులాస్థి పలుచనై, కీళ్లు ఒకదానికొకటి రాసుకోవడం మొదలవుతుంది. ప్రారంభంలో నొప్పి తగ్గించే మందులు, మృదులాస్థిని పరిరక్షించే మందులు వాడవలసి ఉంటుంది. రెండు, మూడు దశలు దాటి, కీళ్లు ఒరిపిడికి గురయ్యే నాలుగో దశ వచ్చిందంటే మాత్రం మోకాలి మార్పిడి చేయక తప్పదు. కాబట్టి  శరీర బరువును అదుపులో ఉంచుకుంటూ మోకాలి కండరాలు, లిగమెంట్లను బలపరిచే క్వాడ్రాసెప్స్‌, హ్యామ్‌స్ట్రింగ్స్‌ తరహా వ్యాయామాలు చేస్తూ ఉండాలి. మోకాలిపై ఒత్తిడి కలిగించే ఇండియన్‌ టాయిలెట్స్‌ కాకుండా, వెస్ట్రన్‌ కమోడ్‌లను ఉపయోగించాలి.


చేయి ఉన్న రోబో ఇది!

మోకాలి మార్పిడి సర్జరీలకు వాడే ఇతర రోబోలకూ, మ్యాకో రోబోకూ ఎంతో తేడా ఉంది. ఇతర రోబోలన్నీ సెకండ్‌ జనరేషన్‌కు చెందినవి. వాటికి మ్యాకో రోబో లాగా ప్రత్యేకమైన ‘ఆర్మ్‌’ ఉండదు. కేవలం సర్జరీ ప్లానింగ్‌ తప్ప, వైద్యులను గైడ్‌ చేసే సౌలభ్యం వాటికి ఉండదు. 


ఒక రోబో... మూడు సర్జరీలు!

ఈ అత్యాధునిక మ్యాకో రోబో సహాయంతో..

టోటల్‌ నీ  మార్పిడి

పార్షియల్‌ నీ  మార్పిడి

టోటల్‌ హిప్‌ మార్పిడి చేయవచ్చు.

గతంలో తొంభై శాతం కచ్చితత్వం, సక్సెస్‌ రేటు ఉంటే, ఈ రోబోటిక్‌ సర్జరీతో తొంభై తొమ్మిది శాతం సక్సెస్‌ వస్తోంది. మునుపటి సర్జరీతో పోలిస్తే, ఈ ఆర్థోబోట్‌ సర్జరీకి 50వేలు మాత్రమే అదనంగా ఖర్చవుతుంది. 


తెలుసుకోండి!

మోకాళ్ల అరుగుదల గురించి పలు అపోహలు నెలకొని ఉన్నాయి. వాటిలో నిజానిజాలు ఏమిటంటే....


అపోహ: మోకాళ్లు బలంగా ఉండాలంటే మెట్లు ఎక్కాలి!

నిజం: మెట్లు ఎక్కే సమయంలో మోకాళ్ల మీద శరీర బరువు ఐదింతలు పడుతుంది. మోకీళ్లు త్వరగా అరగడానికి కారణాల్లో ఇదొకటి. మెట్లు ఎక్కడం గుండె ఆరోగ్యానికి మంచిదే కానీ, మోకాళ్ళకు మంచిది కాదు.


అపోహ: మందులతో మృదులాస్థి పెరుగుతుంది.

నిజం: మందులు మృదులాస్థిని మరింత అరగకుండా నియంత్రిస్తాయి.


అపోహ: కీళ్లు అరగకుండా నిరోధించవచ్చు!

నిజం: వయసుతో పాటు కంటిచూపు తగ్గినట్టే, వయసు పెరిగేకొద్దీ కీళ్ల అరుగుదలా పెరుగుతుంది. వ్యాయామాలు చేస్తూ, బరువు పెరగకుండా చూసుకోగలి గితే మోకీళ్లు ఎక్కువ కాలం పనిచేస్తాయి.


అపోహ: కొన్ని పదా ర్థాలు కీళ్ల అరుగుదలను నియంత్రిస్తాయి.

నిజం: కీళ్ల అరుగుదలకూ, ఆహారానికీ సంబంధం లేదు.


ఇప్పుడు మా ఇంటిల్లపాదీ...

మా అబ్బాయి ఆదర్శ్‌ లండన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు. పాక్షిక మోకాలు మార్పిడి సర్జరీలో వాడు ఎక్స్‌పర్ట్‌. చిన్నప్పుడు ‘లిటిల్‌ సోల్జర్స్‌’ చిత్రంలో నటించిన మా అమ్మాయి కావ్య ఇప్పుడు కార్డియాలజిస్ట్‌. ఇక, మా అల్లుడు డాక్టర్‌ కుశల్‌ ఆటల్లో తగిలే గాయాలకు సంబంధించి (స్పోర్ట్స్‌ మెడిసిన్‌) శస్త్రచికిత్స చేయడంలో నిపుణుడు. నేను, మా అబ్బాయి, అల్లుడు ముగ్గురం మోకీలు మార్పిడి సర్జరీలు చేస్తుంటాం. ఇప్పుడు రోబోటిక్‌ సర్జరీలు చేస్తున్నాం.


మూడు రకాల సర్జరీలూ చేసే మ్యాకో రోబో ఖరీదు మన కరెన్సీలో అక్షరాలా రూ. ఏడు కోట్ల ఇరవై లక్షలు. ఇంతటి ఖర్చుకు వెనకాడకుండా, మ్యాకో రోబోను ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది... అత్యంత మెరుగైన, ఆధునిక వైద్యాన్ని ప్రజలకు అందించాలనే తపన వల్లే! ఈ సర్జరీల కోసం మా ఆస్పత్రిలో నేను, మా అబ్బాయి డాక్టర్‌ ఆదర్శ్‌, మా అల్లుడు డాక్టర్‌ కుశల్‌, మరో డాక్టర్‌ సుహాస్‌ - మొత్తం నలుగురం హాంగ్‌కాంగ్‌, ఆస్ట్రేలియా, అమెరికా... ఇలా నాలుగు దేశాల్లో నాలుగు నెలల పాటు శిక్షణ పొందాం. ఇలా మోకాలి మార్పిడికి నలుగురు సర్టిఫైడ్‌ రోబో సర్జన్లున్న ఆస్పత్రులు ప్రపంచంలో మూడు నాలుగే ఉన్నాయి.


సన్‌షైన్‌ వెలుగులు!

అంతర్జాతీయ స్ట్రైకర్‌, వట్టికుటి సంస్థల నుంచి ‘గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ అనే ట్యాగ్‌ సన్‌షైన్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌కు దక్కింది. ఈ ట్యాగ్‌ దక్కిన ఆస్పత్రికి విదేశాల నుంచి వైద్యులు వచ్చి, సర్జరీల్లో శిక్షణ పొందుతారు. భారతదేశంలో ఇలాంటి ప్రత్యేక గుర్తింపు పొందిన ఆస్పత్రి ఇదొక్కటే! సన్‌షైన్‌ ఆస్పత్రిలో ఏడాదికి సుమారుగా నాలుగు వేల కీళ్ల మార్పిడి సర్జరీలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రఖ్యాత మాయో, క్లీవ్‌ల్యాండ్‌ క్లినిక్‌లతో సమానంగా, సన్‌షైన్‌ కూడా ‘ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్థోపెడిక్‌ సెంటర్‌’ (ఐ.ఎస్.ఒ.సి)లో సభ్యత్వం పొందింది. భారతదేశంలో ఆ సభ్యత్వం పొందిన తొలి ఆస్పత్రి కూడా ఇదే!


మాటామంతీ..

సాహిత్యాభిరుచి, సమాజం మీద ప్రేమ ఉన్న గురవారెడ్డి ఈనాటి వైద్యం, ఆస్పత్రులు, రోగుల ప్రవర్తనపై పంచుకున్న అభిప్రాయాలు..


ఆడవాళ్ళకే ఎక్కువ!

ఆస్టియో పోరోసిస్‌ అనేది ఎముకలు పలుచబడే సమస్య అయితే, ఆస్టియో ఆర్థ్రయిటిస్‌ అనేది కీళ్ళకు సంబంధించిన కష్టం. చాలామంది రెండిటికీ తేడా తెలియక, గందరగోళపడుతుంటారు. నిజానికి, మోకాలి నొప్పులు వచ్చే ఆడవాళ్ళ సంఖ్య మగవాళ్ళతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ.


ఆ విమర్శ తప్పు!

సిజేరియన్‌ ఆపరేషన్ల లాగా మోకీలు ఆపరేషన్లూ చీటికి మాటికీ చేస్తున్నామనే విమర్శ తప్పు. నా మటుకు నేను ఇరవై రెండేళ్ళ వయసు వారి నుంచి నూటరెండేళ్ళ వయసు వారికి మోకాలి మార్పిడి ఆపరేషన్‌ చేశాను. ఏ డాక్టరూ కూడా మోకీలు అరుగుదల నాలుగో దశకు వెళ్ళకుండా, మార్పిడి చేసుకోమని చెప్పరు. నిజానికి, మునుపటితో పోలిస్తే ఇప్పుడు రోగ నిర్ధారణ విధానం సులువైంది. రోగులలో అవగాహన పెరిగింది. అందుకే, ఇరవై ఏళ్ళ క్రితం 1998లో లండన్‌ నుంచి నేను వచ్చినప్పుడు హైదరాబాద్‌లో ఏడాది మొత్తానికి, మహా అయితే మూడొందల మోకాలి ఆపరేషన్లు జరిగేవి. ఇప్పుడు మేమొక్కళ్ళమే నాలుగువేల ఆపరేషన్లు చేస్తున్నాం.


రోగుల వల్లే... డిఫెన్సివ్‌ ప్రాక్టీస్‌!

రోగ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం పెరగడం, అవి చేయకపోతే రోగుల నుంచి తరువాత వచ్చే విమర్శలు, ఒత్తిడి అధికం కావడంతో డాక్టర్లు ఇరుకున పడుతున్నారు. తప్పు తమ మీద లేకుండా ఉండేందుకు ముందస్తు పరీక్షలు చేయించాల్సి వస్తోంది. ఛాన్స్‌ తీసుకోకుండా డిఫెన్సివ్‌ ప్రాక్టీస్‌ చేయాల్సి వస్తోంది.


ఆ తప్పులు కొద్ది శాతమే!

కారణాలు ఏమైనా కార్పొరేట్‌ ఆస్పత్రులంటే జలగలనీ, డాక్టర్లు డ్రాకులాలనే ముద్ర పడిపోయింది. నిజానికి, 10 - 15 శాతం ఆస్పత్రులలో అలాంటి తప్పులు జరుగుతుంటాయని నేనూ ఒప్పుకుంటాను. కానీ, అందరూ దొంగలే అన్న వాదన తప్పు. కొందరు రోగులకు ఎదురైన అనుభవాన్ని అందరికీ వర్తింపజేయడం సరి కాదు.


ఇక్కడే ఖర్చు తక్కువ!

విదేశాలతో పోలిస్తే, కేవలం ఎనిమిదోవంతు ఖర్చుతోనే ఇక్కడ, అంతే అత్యాధునిక చికిత్స అందిస్తున్నాం. మోకాలి మార్పిడికి ఇక్కడ మూడు లక్షలు అవుతోందనుకుంటే, ముంబయ్‌ లాంటి చోట్ల దానికి నాలుగింతలు అవుతోంది. అమెరికాలో ఏకంగా ఇరవై రెండు లక్షలపైగా అవుతోంది. అందుకే, ఇతర రాష్ట్రాలు, విదేశాలతో పోలిస్తే, మన హైదరాబాద్‌లో మెడికల్‌ టూరిజమ్‌ ఎక్కువ. ఆ విషయంలో ఇప్పుడు మనం చెన్నైతో దీటుగా ఉన్నాం. బంగ్లాదేశ్‌, శ్రీలంక మొదలు ఆఫ్రికన్‌ దేశాల దాకా రకరకాల ప్రాంతాల నుంచి మన దగ్గరకు వైద్య చికిత్స కోసం వస్తున్నారు.

సంభాషణ: రెంటాల జయదేవ,

గోగుమళ్ల కవిత


Updated Date - 2020-03-03T16:21:38+05:30 IST