యుద్ధాన్ని ఆపాలని పుతిన్‌ను కోరగలమా? : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2022-03-03T17:42:29+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అత్యున్నత న్యాయస్థానం

యుద్ధాన్ని ఆపాలని పుతిన్‌ను కోరగలమా? : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అత్యున్నత న్యాయస్థానం చేయగలిగినదేమీ లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు. యుద్ధంతో తల్లడిల్లుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందిస్తూ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పిల్‌పై గురువారం మధ్యాహ్నం విచారణ జరుగుతుంది. 


ఈ పిటిషన్ గురువారం జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చినపుడు ఆయన మాట్లాడుతూ, ‘‘న్యాయస్థానం ఏం చేస్తుంది? యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడిని నేను ఆదేశించగలనా?’’ అని ప్రశ్నించారు. పిటిషనర్ తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మాట్లాడుతూ, ప్రజలు గడ్డకట్టుకుపోతున్నారన్నారు. వారిని కాపాడాలన్నారు. దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ,  సీజేఐ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయని, తమకు వారిపట్ల సానుభూతి ఉందని చెప్పారు. ఉక్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్నవారిపట్ల ఎవరు శ్రద్ధ వహించాలని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది కదా! అన్నారు. అటార్నీ జనరల్‌ను ఈ విషయాన్ని గమనించాలని కోరుతామన్నారు. 


ఉక్రెయిన్ గగనతలాన్ని మూసేయడంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను ప్రత్యామ్నాయ మార్గాల్లో స్వదేశానికి భారత ప్రభుత్వం రప్పిస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా గురువారం మాట్లాడుతూ, ఈరోజు ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఉక్రెయిన్ నుంచి 3,726 మందిని భారత దేశానికి తీసుకొస్తామని చెప్పారు. బుకారెస్ట్ నుంచి ఎనిమిది విమానాలు, సుసీవా నుంచి రెండు విమానాలు, కొసికే నుంచి ఒక విమానం, బుడాపెస్ట్ నుంచి ఐదు విమానాలు, ర్జెస్జోవ్ నుంచి మూడు విమానాలు వీరిని తీసుకొస్తాయన్నారు. 


రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ గురువారం ఢిల్లీకి సమీపంలోని హిందోన్ విమానాశ్రయంలో ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారతీయులకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారతీయులను తీసుకొచ్చిన భారత వాయుసేనకు చెందిన నాలుగో విమానం ఇది. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, ‘ఆపరేషన్ గంగ’ విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. నలుగురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఉక్రెయిన్ నుంచి భారతీయులను రప్పించడం కోసం ఆ దేశానికి పొరుగున ఉన్న దేశాల గుండా విమానాలను నడిపేందుకు వీరు కృషి చేస్తున్నారన్నారు. 



Updated Date - 2022-03-03T17:42:29+05:30 IST