‘కేర్‌’ తీసుకోగలరా?

ABN , First Publish Date - 2022-01-23T04:45:51+05:30 IST

జిల్లాలో రెంటింపు సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించింది. నియోజకవర్గానికి వంద బెడ్‌ల సామర్థ్యం కలిగిన కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌లకు సూచనలు అందాయి. అందుకు తగిన వసతులు కలిగిన భవనాలు అందుబాటులో కనిపించడం లేదు.

‘కేర్‌’ తీసుకోగలరా?
ఎస్‌.కోటలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ కోసం అధికారులు పరిశీలించిన కల్యాణ మండపం

కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు వసతి కరువు

ప్రభుత్వ ఆదేశంతో భవనాలను పరిశీలిస్తున్న అధికారులు

ఎంపిక చేయలేక తలలు పట్టుకుంటున్న వైనం


జిల్లాలో రెంటింపు సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించింది. నియోజకవర్గానికి వంద బెడ్‌ల సామర్థ్యం కలిగిన కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌లకు సూచనలు అందాయి. అందుకు తగిన వసతులు కలిగిన భవనాలు అందుబాటులో కనిపించడం లేదు. కొన్ని భవనాలను పరిశీలిస్తున్నా సరైన సదుపాయలు లేక తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఖర్చులు కూడా జేబులో నుంచి తీయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 


శృంగవరపుకోట, జనవరి 22:

కొవిడ్‌ విజృంభిస్తున్నా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నీ నడుస్తున్నాయి. ఇతర ప్రైవేటు, ప్రభుత్వ భవనాలతో పాటు కల్యాణ మండపాలు గుర్తిస్తున్నా అవి కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు అనుకూలంగా లేవు. ఎక్కడో ఓ చోట కల్యాణ మండపాలు అందుబాటులో ఉన్నా మరుగుదొడ్లు మూడు, నాలుగుకు మించి లేవు. వంద బెడ్‌ల సామర్థ్యం కలిగిన కొవిడ్‌ సెంటర్‌కు కనీసం పది మరుగుదొడ్లు లేకపోతే అవస్థలు తప్పవు. వీటి యజమానులు కూడా కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు ఇచ్చేశామంటూ తేదీలు కూడా చెబుతున్నారు. గతంలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నప్పుడు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. పాఠశాల, కళాశాల భవనాలు ఖాళీగా ఉండేవి.  మరుగుదొడ్లు కూడా సరిపోయేలా ఉండడంతో వీటి ఏర్పాటుకు అధికారులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. కాగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెబుతున్న ప్రభుత్వం ఇందుకు అవసరమైన బడ్జెట్‌ గురించి చెప్పడం లేదు. 

పాఠశాలలు, కళాశాలల భవనాల్లో విద్యాసంస్థలకు సంబంధించిన బెంచీలు ఉంటాయి. ప్రైవేటు విద్యాసంస్థల వసతి గృహాలకు చెందిన బెడ్‌లు అందుబాటులో ఉండేవి. వారిని బతిమాలి వాడుకోనేవారు. ఇప్పుడు ఎంపిక చేసిన స్థలాల్లో బెంచీలు, బెడ్‌లు వంటివి లేవు. వాటిని కొనుగోలు చేయాల్సి ఉంది. ఆసుపత్రిలో ఉన్న బెడ్‌లను ఇక్కడ వినియోగిద్దామంటే వంద బెడ్‌ల సామర్థ్యానికి మించి ఉన్న ఆసుపత్రుల్లో జిల్లాలో కేంద్రాసుపత్రి, పార్వతీపురం సామాజిక ఆసుపత్రి మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఆసుపత్రులన్నీ సామాజిక ఆసుపత్రులు. ఇందులో కొన్ని ప్రాంతీయ ఆసుపత్రులుగా రూపాంతరం చేశారు. అంటే వంద పడకలకు పెంచారు. ఈమేరకు అభివృద్ది మాత్రం ఇంకా జరగలేదు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో ఈ ఆసుపత్రుల యాజమాన్యం కూడా జాగ్రత్తలు పడుతోంది. సెకెండ్‌ వేవ్‌లో చేరినట్లు కొవిడ్‌ బాధితులు థర్డ్‌ వేవ్‌లో వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. వెరసి పరిస్థితిని ఎలా అధిగమించాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటు న్నారు. శృంగవరపుకోటలో అధికారులు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటకు అవసరమైన భవనాలను ఎంపిక చేసేందుకు క్షేత్ర స్థాయికి వెళ్తున్నారు. ఎక్కడా లభ్యంకాకపోవడంతో పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ కల్యాణ మండపాన్ని ఎంపిక చేశారు. ఇది కూడా విమర్శలకు తావిస్తోంది. ఈ కల్యాణ మండపానికి సమీపంలో జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాల, మరో పక్క మండల ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రం, అంగనవాడీ కేంద్రం, మండల వనరుల కేంద్రం ఉన్నాయి. నివాస గృహాలు, వ్యాపార సముదాయాలూ ఉన్నాయి. దీంతో స్థానికంగా వ్యతిరేకత వినిపిస్తోంది. ఇదే పరిస్థితి ఇతర చోట్లా ఉంటోంది. దీంతో కేర్‌ సెంటర్ల ఏర్పాటుపై అధికారులు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. 



Updated Date - 2022-01-23T04:45:51+05:30 IST