మోదీకి పుతిన్ ప్రేరణ కాగలరా?

ABN , First Publish Date - 2022-03-02T06:42:09+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకప్పుడు బహిరంగ సభల్లో ప్రసంగిస్తుంటే జనం కిక్కిరిసి కనిపించేవారు. ఆయన ప్రసంగాన్ని వినేందుకు లక్షలాది ప్రజలు ఉత్సుకతతో ఎదురు చూసేవారు...

మోదీకి పుతిన్ ప్రేరణ కాగలరా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకప్పుడు బహిరంగ సభల్లో ప్రసంగిస్తుంటే జనం కిక్కిరిసి కనిపించేవారు. ఆయన ప్రసంగాన్ని వినేందుకు లక్షలాది ప్రజలు ఉత్సుకతతో ఎదురు చూసేవారు. అయితే ఆదివారంనాడు మోదీ స్వంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయ మైదానంలో జరిగిన బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతుండగానే కార్యకర్తలే లేచి వెళ్లిపోవడంతో వందలాది కుర్చీలు ఖాళీగా కనిపించాయి. బూత్‌స్థాయి కార్యకర్తలకు విజయ మంత్రాన్ని ఉపదేశించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వారణాసిలోని 3361 బూత్‌ల నుంచి వచ్చిన కార్యకర్తలు మోదీ రాక కోసం కొన్నిగంటలు ఎదురుచూశారు. తీరా మోదీ వచ్చి ప్రసంగం మొదలుపెట్టిన 20 నిమిషాలకే వారు లేచి వెళ్లిపోవడం ప్రారంభించారు. మీరెందుకు వెళ్లిపోతున్నారు అని పార్టీ కార్యకర్తల్ని టీవీ విలేఖరులు అడిగితే వారు రకరకాల సమాధానాలు చెప్పారు. తాను నడుస్తూ మోదీ మాటలు వింటున్నానని ఒక కార్యకర్త చెబితే, ఆకలేసి వెళుతున్నానని మరొక కార్యకర్త చెప్పారు. తన కూతురుకు పరీక్ష ఉన్నందువల్ల వెళ్లాల్సి వచ్చిందని ఇంకొక కార్యకర్త తెలిపారు. వారణాసి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సంభావ్య ఓటమికి ఈ సభ సంకేతం అని చెప్పడానికి వీల్లేదు. జనం సభలకు రావడానికీ, ఓటింగ్‌లో పాల్గొనడానికీ సంబంధం ఉండదని పలు సందర్భాల్లో తేలింది. కాని మోదీ ప్రసంగం తన కార్యకర్తల్ని కూడా రంజింపలేకపోతున్నదని మాత్రం ఈ ఉదంతం ద్వారా స్పష్టమవుతోంది.


ఒకే మాటలు, ఒకే హావభావాలు, ఒకే శైలి అస్తమానం ప్రజల్ని రంజింపచేయలేవు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా ప్రతిపక్షాల్ని పదే పదే విమర్శించడం, ఎప్పుడో ప్రధానిగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూను తప్పుపట్టడం, జాతీయస్థాయిలో రెండుసార్లు ఓడిపోయి, ఉత్తరప్రదేశ్‌లో ఉనికిలో లేని కాంగ్రెస్ వారసత్వ పాలనను విమర్శించడం, అభివృద్ధి గురించి గణాంక వివరాలను వల్లె వేయడాన్ని వినడం ఒకసారి, రెండుసార్లు బాగానే ఉంటుంది కాని, ప్రతిసారీ అవే మాటలు మాట్లాడితే జనం చెవికెక్కవు. పైగా ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి తనపై భౌతిక దాడి జరుగుతుందని చెప్పి జనం సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్‌లో తన వాహనం రైతుల నిరసనల వల్ల ఆగిపోయినా తాను ప్రాణాలతో బయటపడ్డానని వ్యాఖ్యానించారు. తాజాగా వారణాసిలో మరోసారి కాశీ విశ్వనాథుడికి ప్రార్థనలు జరిపిన తర్వాత మాట్లాడుతూ కొందరు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని అన్నారు. తాను మరణించేంతవరకు తాను కాశీని విడిచిపెట్టి వెళ్లనని, భక్తులకు సేవచేస్తూ మరణిస్తే అంతకంటే పుణ్యం ఏముంటుందని మోదీ ప్రశ్నించారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాటిమాటికి బేలగా మాట్లాడడం ఆయన ధైర్యానికి ఏ మాత్రం సంకేతం కాదు. ప్రపంచంలో బలమైన నేతలెవరూ ఇలా మాట్లాడే అవకాశం లేదు.


ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ఇవాళ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ధైర్యసాహసాల గురించి మీడియాలో చర్చ ప్రారంభమైంది. ఇద్దరూ జాతీయ వాదులే. ఇద్దరి వేర్వేరు పంథాల జాతీయ వాదం వారిని సంఘర్షించేలా చేసింది. రష్యన్ సైన్యాలు ఉక్రెయిన్ నగరాలను చుట్టుముడుతున్న సమయంలో తాము రాజధాని కీవ్‌లోనే ఉంటామని, పలాయనం చిత్తగించే ప్రసక్తే లేదని జెలెన్ స్కీ, ఆయన సతీమణి ప్రకటించారు. రష్యన్ దాడులకు ఉక్రెయిన్‌లో చిన్న పిల్లలతో సహా వందలాది మంది మరణించారు.


ఉక్రెయిన్ వ్యవహారాల్లో అంతర్జాతీయ స్థాయిలో నిపుణుడైన అలెగ్జాండర్ జె మొటైల్ అభివర్ణించిన లక్షణాల ప్రకారం పుతిన్ హయాంలో రష్యన్ రాజకీయ వ్యవస్థలో అధికార పార్టీ అత్యంత బలంగా మారింది. ఎన్నికల ఫలితాలను అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోగలదు. పార్లమెంట్ నామమాత్రంగానే ఉంటుంది. న్యాయవ్యవస్థ పాక్షికంగానే స్వతంత్రంగా పనిచేస్తుంది. అన్ని వ్యవస్థలపై బలమైన పట్టు ఉన్న నాయకుడు మార్కెట్ ఎకానమీలో బలమైన పెట్టుబడిదారులతో మిలాఖత్ అయి పనిచేస్తాడు. ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున వనరులు ఉంటాయి. ఎక్కడ హింసాకాండ అమలు చేయాలో ఎవరి గొంతునొక్కాలో అధికారవ్యవస్థకు స్పష్టంగా తెలుసు. జనం మద్దతు కోసం జాతీయ వాదాన్ని ఉపయోగించుకుని ఉక్రెయిన్ రష్యాలో భాగమే కాని వేరు కాదని దురాక్రమణకు పూనుకొనగల సత్తా పుతిన్‌కు ఉన్నది. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పుతిన్ లాగా జాతీయ వాదే అనడంలో సందేహం లేదు. పుతిన్ ఆధ్వర్యంలోని రష్యన్ వ్యవస్థ మాదిరి మోదీ ఆధ్వర్యంలో భారత్ వ్యవస్థ కూడా కొన్ని లక్షణాలను సమకూర్చుకుంది. అయితే మోదీ జాతీయవాదం ఎన్నికలకు, ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమవుతుందా, అంతకు మించి ధైర్య సాహసాలేమైనా ఆయన ప్రదర్శిస్తారా అని ఉత్సుకతతో ఎదురు చూసే వారు లేకపోలేదు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన మరుసటి రోజే వాట్సాప్ యూనివర్సిటీల్లో భారత్ ఆక్రమిత కశ్మీర్‌పై దాడి చేస్తుందని, సరిహద్దుల్లో చైనా దుస్సాహసాలను అరికడుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంతే కాదు ప్రపంచంలో బలమైన అగ్రనేతల్లో ఒకరైన నరేంద్రమోదీ రంగంలోకి దిగితే రష్యా- ఉక్రెయిన్ రాజీపడతాయని కూడా ప్రచారాలు ప్రారంభమయ్యాయి. శాంతికి దోహదం చేయమని జెలెన్ స్కీ కూడా మోదీకి ఫోన్ చేసి అభ్యర్థించారు. మోదీ పుతిన్‌తో కూడా మాట్లాడారు. కాని యుద్ధం తీవ్రమైందే కాని తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. రష్యన్ బాంబు దాడులకు విధ్వంసమవుతున్న ఉక్రెయిన్ నగరాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను కాపాడడమే ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్‌గా మారింది.


భవిష్యత్ సంగతి ఏమో కాని, ఉక్రెయిన్‌పై దాడి జరుగుతున్న సమయంలో మోదీ ఎన్నికల సభల్లో ఆ దాడిని ఉపయోగించే ప్రయత్నం మాత్రం చేశారు, ఉత్తరప్రదేశ్‌ లోని బహ్రెయిచ్‌లో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించారు. ‘భారతదేశం శక్తిమంతంగా ఉండాలా లేదా? ఒక టీచర్, పోలీసు అధికారి బలంగా పనిచేయాలా, లేక డీలాగా పనిచేయాలా?’ అని ఆయన ప్రశ్నించారు. ‘మీరు వేసే ప్రతి ఓటు భారత్‌ను శక్తిమంతంగా మారుస్తుంది’ అని ఆయన అన్నారు. విచిత్రమేమిటంటే ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే కార్యక్రమానికి ఆపరేషన్ గంగా అని పేరుపెట్టారు. గంగానదికీ ఈ తరలింపునకు సంబంధం ఏమిటి? గంగానది ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ప్రవహిస్తుంది కనుక ఆ పేరు పెడితే ఎన్నికల సమయంలో ఉపయోగపడుతుందని బిజెపి సర్కార్ అభిప్రాయం కావచ్చు.


ఎన్నికల కోసం ఏమైనా చేయవచ్చు కాని భారత్ శక్తిమంతంగా మారడానికి, అగ్రరాజ్యాల్లో స్థానం సంపాదించుకోవడానికి ఇంకా చాలా దూరం ఉన్నది. అటు అమెరికాను, ఇటు రష్యాను వ్యతిరేకం చేసుకునే స్థితిలో మనం లేము. మొత్తం పశ్చిమ దేశాలన్నీ రష్యా ఘాతుకాల్ని విమర్శిస్తుంటే మనం పన్నెత్తు మాట అనలేని స్థితిలో ఉన్నాం. ట్రంప్ హయాంలో అమెరికాతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన మోదీ, క్వాడ్ కూటమిలో భాగమై చైనా దూకుడుకు కళ్లెం వేయగలమని భావించారు. కాని సరిహద్దుల్లో చైనా దుందుడుకు వైఖరి తర్వాత మన వేగమూ తగ్గినట్లు కనపడుతోంది. చైనా, పాకిస్థాన్‌లు రష్యాతో బలమైన సంబంధాలు ఏర్పర్చుకున్న రీత్యా ఉక్రెయిన్‌తోనూ, నాటోతోను మనం బలమైన బంధం ఏర్పర్చుకోవాలని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో మనం ఒక స్పష్టమైన వైఖరి అవలంబించే స్థితిలో నెహ్రూ, ఇందిరాగాంధీ కాలంలోనూ లేము, ఇప్పుడూ లేము. ఇందిరాగాంధీ కనీసం బంగ్లాదేశ్‌ను విముక్తి చేశారు. వాజపేయి అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా పోఖ్రాన్‌లో అణు పరీక్షలను అమలు చేశారు. పీవీ నరసింహారావు దేశ చరిత్రను మలుపుతిప్పిన ఆర్థిక సంస్కరణలను అమలు చేసి ఇజ్రాయిల్‌కు స్నేహహస్తం చాచారు. ‘లుక్ ఈస్ట్’ విధానానికి నాంది పలికారు. మన్మోహన్ సింగ్ తన ప్రభుత్వం పడిపోతుందనే భయం లేకుండా భారత్ -అమెరికా అణు ఒప్పందాన్ని అమలుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చించదగ్గ ఒక కీలక నిర్ణయం గురించి ఇంకా మనం ఎదురుచూడాల్సి ఉన్నది. పెద్ద నోట్ల రద్దు, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు, సాగు చట్టాల ఉపసంహరణ లాంటివి వ్యతిరేక చర్చలకే దారి తీశాయి. వరుసగా రెండు సార్వత్రక ఎన్నికల్లో భారీగా వచ్చిన ప్రజల తీర్పుకు సరిపోయే స్థాయిలో మోదీ నిర్ణయాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రాలేదనే చెప్పాలి. సర్జికల్ దాడులు లాంటివి ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగపడవచ్చు కాని ఉక్రెయిన్‌పై రష్యా దాడి సృష్టించినంత ప్రకంపనలు మాత్రం సృష్టించలేదు. నెహ్రూను విమర్శించవచ్చు కాని నెహ్రూ విధానాలను మాత్రం అనుసరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.


మెక్సికన్ కవి, దౌత్యవేత్త ఆక్టోవియన్ పాజ్ భారత దేశాన్ని ‘మానవ జాతుల, చారిత్రక ప్రదర్శనశాల’గా అభివర్ణించారు. ప్రముఖ కవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ టాగోర్ 1917లోనే భారత జాతీయ వాదం గురించి రాసిన ఒక వ్యాసంలో ఇలా అన్నారు. ‘భారత్ సమస్య ఏమిటంటే మొత్తం ప్రపంచం సూక్ష్మ రూపంలో ఇక్కడ ఉన్నది. భారత్ ఎంత విశాలమైనదంటే, అందులో ఉన్న జాతులు ఎంత వైవిధ్యమయినవంటే, ఎన్నో దేశాలు ఇక్కడ ఒకే భౌగోళిక పాత్రలో ప్యాక్ చేసినట్లు ఉంటాయి. యూరప్‌కు మన దేశం పూర్తిగా భిన్నం వ్యతిరేకం. కనుక దానితో మనను పోల్చుకోలేం’. పుతిన్ జాతీయవాదం మోదీకి ఎంతవరకు ప్రేరణ కాగలదో ఇవాళ ఢిల్లీలో మోహరించడానికి రకరకాల ప్రాంతీయ శక్తులు సిద్ధపడుతున్న నేపథ్యంలో అర్థం చేసుకోవాల్సి ఉన్నది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-03-02T06:42:09+05:30 IST