అసలు వైరస్‌ను నిర్మూలించగలరా?

ABN , First Publish Date - 2020-04-15T06:34:00+05:30 IST

అనుకున్న విధంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో 19 రోజులపాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రకటన చేశారు. ఇప్పటికే ఆయన ఈ విషయంలో దేశాన్ని మానసికంగా ఎప్పుడో సన్నద్ధం చేశారు. లాక్‌డౌన్ పొడిగించమని మేమే ప్రధానికి చెప్పామని కొందరు...

అసలు వైరస్‌ను నిర్మూలించగలరా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆర్థిక సంక్షోభం గురించి లీలామాత్రంగా ప్రస్తావించకపోలేదు. ఆర్థికరంగ దృక్పథంతో చూస్తే కరోనా కల్లోలం భారీ మూల్యంతో కూడుకున్నదేనని ఆయన అన్నారు. ఆ భారీ మూల్యాన్ని ప్రజలు చెల్లించనవసరం లేకుండా వారిని ఎలా ఆదుకోగలరన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా వున్నది.


అనుకున్న విధంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో 19 రోజులపాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రకటన చేశారు. ఇప్పటికే ఆయన ఈ విషయంలో దేశాన్ని మానసికంగా ఎప్పుడో సన్నద్ధం చేశారు. లాక్‌డౌన్ పొడిగించమని మేమే ప్రధానికి చెప్పామని కొందరు ముఖ్యమంత్రులు ఇప్పటికే బాహాటంగా ప్రకటనలు చేశారు. అందువల్ల మోదీ లాక్‌డౌన్ పొడిగింపు ప్రకటన లాంఛన ప్రాయమే అయింది. అయితే మంగళవారం నాడు ప్రధానమంత్రి కేవలం లాక్‌డౌన్‌ను పొడిగించడానికే ప్రజల ముందుకు రాలేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రులు సంసిద్ధత వ్యక్తం చేసిన రీత్యా ఒక అధికారిక ఉత్తర్వును జాతీయ స్థాయిలో వెలువరిస్తే సరిపోతుందని కూడా ఆయనకు తెలుసు. లాక్‌డౌన్ తర్వాత జరిగిన పరిణామాలను నిశితంగా గ్రహిస్తే మనకు అర్థమువుతున్నదేమిటంటే తమ ఉనికిని ప్రకటించేందుకు, తాము చేస్తున్న చర్యల గురించి చెప్పుకునేందుకు నాయకులు మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవడం. మంగళవారం ఉదయం పదిగంటలకు ప్రధానమంత్రి ప్రసంగాన్ని వివిధ ఛానెల్స్‌లో కొన్ని లక్షల మంది తిలకించారన్న విషయం యూ ట్యూబ్‌లో ఆయా ఛానెల్స్ వీక్షకుల సంఖ్యను బట్టి అర్థమవుతుంది.


ఈ విషయం తెలిసినందువల్లే ప్రధానమంత్రి ఈ ప్రసంగాన్ని ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఉపయోగించుకున్నారు. ఇందులో ప్రధానమైనది కరోనా వ్యాధిని అరికట్టే విషయంలో తానెంత వేగంగా చర్యలు తీసుకున్నదీ, ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశం ఎంత వేగంగా స్పందించిందీ చెప్పేందుకు ప్రధానమంత్రి ప్రధానంగా తన ప్రసంగాన్ని ఉద్దేశించారన్నది స్పష్టమవుతోంది. అనేక సత్వర నిర్ణయాల ద్వారా కరోనా వ్యాప్తిని మొగ్గలో తుంచేందుకు ప్రయత్నించామని చెప్పేందుకు ఆయన గత నెల రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలన్నిటినీ వివరించారు. స్థూలంగా చెప్పాలంటే తాను సకాలంలో సత్వరంగా, సమగ్రంగా, సంపూర్ణంగా, నిర్ణయాత్మకంగా కార్యాచరణ చేపట్టి ఉండకపోతే పరిస్థితి భిన్నంగా ఉండేదని ఆయన చెప్పుకున్నారు. ఒక రకంగా ఇది స్వీయ ప్రశంస. ఈ స్వీయ ప్రశంస ద్వారా ఆయన తన అభిమానులకు, పార్టీ సభ్యులకు ఒక స్పష్టమైన లైన్ ఇచ్చారు. రానున్న రోజుల్లో కరోనాను పూర్తిగా అరికట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఎన్ని సంక్షోభ పరిస్థితులు ఏర్పడినా నరేంద్రమోదీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ఆయన రంగం సిద్ధం చేయడం ప్రారంభించినట్లు ఈ ప్రసంగం ద్వారా స్పష్టమవుతోంది. ఆయనే స్వయంగా చెప్పుకున్నట్లు ఇప్పటి వరకూ తీసుకున్నది సమగ్రమైన, సంపూర్ణమైన, నిర్ణయాత్మకమైన సత్వర కార్యాచరణ అవునా కాదా అన్న విషయం చర్చించడానికి, ప్రశ్నించడానికి ఇది అనువైన సమయం కాదని ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అంతేకాక ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రస్తుతం ప్రజలు సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉన్నదా లేదా అన్నది కూడా చర్చనీయాంశం.


నిజానికి గత నాలుగువారాల్లో ప్రధాని చేస్తున్న ప్రసంగాలతో పోలిస్తే ఈ నాల్గవ ప్రసంగంలో లాక్‌డౌన్ పొడిగింపు తప్ప చెప్పుకోదగ్గ ప్రత్యేకమైన విషయం ఏమీ లేదు. ప్రధానమంత్రి సప్తపదిగా పేర్కొంటున్న ఏడు సూత్రాలు వేడి నీరు, కషాయం తాగమని చాలా మంది పెద్దలు చేసే ఉద్బోధలు, హితబోధల మాదిరే ఉన్నాయి. తన ప్రసంగంలో ప్రధాని రెండే రెండు రంగాల గురించి ప్రస్తావించారు. అవి: రబీ కాలంలో రైతులు ఎదుర్కొనే సమస్యలు; అసంఘటిత రంగానికి చెందిన దినసరి కార్మికుల కష్టాలు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం గత శనివారంనాడు ముఖ్యమంత్రుల సమావేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు లేవనెత్తిన అనేక డిమాండ్ల గురించి ప్రధానమంత్రి ప్రసంగంలో ప్రస్తావనే లేదు. కనీసం వాటిని నిశితంగా పరిశీలిస్తున్నానని కూడా ఆయన చెప్పలేదు. 


ప్రధానమంత్రి ఆర్థిక సంక్షోభం గురించి లీలామాత్రంగా ప్రస్తావించకపోలేదు. ఆర్థిక రంగ దృక్పథంతో చూస్తే కరోనా కల్లోలం భారీ మూల్యంతో కూడుకున్నదేనని ప్రధానమంత్రి అన్నారు. కాని ఆ భారీ మూల్యాన్ని ప్రజలు చెల్లించనవసరం లేకుండా వారిని ఎలా ఆదుకోగలరన్నదే ఇప్పుడు అంతా చర్చనీయాంశం అవుతోంది. ఈ భారీ మూల్యం ప్రభావం ఇప్పటికే దేశంలోని కోట్లాది ప్రజల జీవితాలపై పడింది. అనేక ఆర్థిక సంస్థల లావాదేవీలపై పడింది. ఇప్పటికే పెచ్చరిల్లిపోయిన నిరుద్యోగానికి తోడు అదనపు నిరుద్యోగం తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయ వనరులు లేకుండా చాలా రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని చెబుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తీవ్రంగా పడిపోతే మొత్తం ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోతుంది. ఇప్పటికే దినసరి వేతనాలపై ఆధారపడేవారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్లు, చెప్పులు కుట్టుకునేవాళ్లు, వాహనాలు మరమ్మతులు చేసేవాళ్లు, రోడ్డుప్రక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు, హమాలీలు మొదలైన అనేకమంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. సాధారణంగా మామూలు రోజుల్లో ఇండియాగేట్ సమీపానికి వెళితేనే వందలాది మంది రకరకాల వస్తువులను అమ్ముకుంటూ, బూట్ పాలిష్ వంటి సేవల్ని చేస్తూ కనపడతారు.


వారెవరూ అవినీతిపరులు, కమిషన్లకోసం కక్కుర్తిపడేవాళ్లు కాదు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతూ, ఒక చెమట చుక్క కూడా చిందించకుండా కోట్లాది రూపాయలు గడించి తాజ్ మాన్ సింగ్ వంటి హోటళ్లలో విలాసాలు అనుభవించేవారు కాదు. వారు తమ ఇళ్లనుంచి ఎంతో దూరం వచ్చి తమ కాళ్లమీద తాము నిలబడి బతకాలనుకునే భారతీయులు. ప్రధానమంత్రి ఈ పేదలను తన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తున్నానని చెప్పుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. కాని వారిని తన పార్టీ సభ్యులుగా కూడా చేర్చుకుని ఉంటే ఎంతో బాగుండేది. ఇటీవల ఏప్రిల్ 6న బిజెపి సంస్థాపక దినం సందర్భంగా బిజెపి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అని, దాని సభ్యత్వం 18 కోట్లకు పెరిగిందని చెప్పుకున్నారు. ఇవాళ లాక్‌డౌన్ మూలంగా జీవితాలు దుర్భరమయిన కోట్లాది మందిలో ఒక్కరైనా బిజెపి సభ్యులుగా ఉన్నారా? అని ఆ పార్టీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. విచిత్రమేమంటే శ్రమజీవుల పార్టీలుగా చెప్పుకున్న వృద్ధ కమ్యూనిస్టుల పార్టీల్లో కూడా వీరెవరూ సభ్యులుగా ఉన్నట్లు కనపడడం లేదు. ఉంటే వారు లాక్‌డౌన్ ప్రకటించిన వెంటనే నిర్బయంగా అజయ్ భవన్, గోపాలన్ భవన్, మఖ్దూ భవన్‌లకు వెళ్లి సేదదీరే వాళ్లు. కాని ఇవాళ నిరాశ్రయులకు ఏ జెండా ఆశ్రయం కల్పించలేని స్థితిలో ఉన్నది. చింతచచ్చినా పులుపు చావనట్లు పదవులకోసం ఒకరి కాళ్లను మరొకరు లాగేందుకు గంటల తరబడి పోలిట్ బ్యూరో సమావేశాలు నిర్వహించేవారికి కష్టజీవుల గురించి ఆలోచించే సమయం ఎక్కడుంటుంది?


మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏమి చేయాలి? ప్రధానమంత్రి రానున్న రోజుల్లోనైనా ఈ విషయంపై తగిన కార్యాచరణను రూపొందిస్తే బాగుంటుంది. ఇందులో ప్రధానమైనది అసంఘటిత రంగం గురించి స్పష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం. వ్యవసాయ రంగంలో రైతు కూలీలు ఎంత ప్రధానమైన వారో, అసంఘటిత రంగంలో పనిచేసే శ్రామికులు ఆర్థిక వ్యవస్థకు అంత పునాది లాంటి వారు. వారికి అందరికీ ఇళ్లు, జన్ ధన్ యోజన, ఆరోగ్య బీమా వంటి సురక్షితమైన చర్యలు చేపట్టడం అవసరం. భవిష్యత్తులో ఇలాంటి లాక్‌డౌన్‌లు తలెత్తితే వారు నిర్భయంగా ఉండే పరిస్థితి కల్పించాలి. రెండవది, దేశంలో ఆరోగ్య వ్యవస్థ అంత పటిష్టంగా లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి అధునాతన వసతులు, నిపుణులు, వైద్య సిబ్బంది ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పరిస్తే దిక్కులేని ప్రజలు నగరాల్లోని ఆసుపత్రుల్లోని కారిడార్లలో పడకలు లేకుండా పడి ఉండే దుస్థితి తప్పుతుంది. గత జనవరిలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సామర్థ్యాలను సమీక్షించే ప్రశ్నావళిని రూపొందించింది. ప్రయోగశాలలు, ఉపకరణాలు, నిఘా, ముప్పు అంచనా, వేగంగా ప్రతిస్పందించే బృందాలు, అంటువ్యాధి నివారణ, నియంత్రణ చర్యల విషయంలో ఈ ప్రశ్నావళిలో పేర్కొన్న విధంగా తమ సామర్థ్యాలను ప్రభుత్వం ఎంత మేరకు తనిఖీ చేసుకున్నదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిని అడిగితే మౌనమే జవాబు వచ్చింది. మూడవది, ఈ దేశంలో డబ్బుకు కొదవ లేదు.


ఎన్నికలు వచ్చే సరికి ఎక్కడా లేని విధంగా వేల కోట్లు ప్రత్యక్షమవుతాయి. స్థానిక ఎన్నికల్లో కూడా డబ్బుల వర్షం కురుస్తుంది. ఈ డబ్బుల మూలాలు గ్రహించి వాటిని వ్యవస్థలో ప్రవేశపెడితే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నాల్గవది, ప్రజాధనాన్ని కొన్ని లక్షల కోట్లు బ్యాంకులకు ఎగవేసిన వారు అనేకమంది వ్యక్తిగతంగా మాత్రం చెక్కుచెదరకుండా తప్పించుకొని, సుఖవంతంగా జీవించగలగడం ఏ విధంగా జరుగుతున్నదో ఆలోచించాలి. ఐదవది, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని (క్రోనీ కాపిటలిజం)ను నివారిస్తే క్విడ్ ప్రో కోలకు అడ్డుకట్టపడి ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి వీలు కలుగుతుంది. తద్వారా అదే డబ్బుతో కొందరు రాజకీయాలను కూడా కలుషితం చేసే అవకాశం లభించకుండా పోతుంది. ఆరవది, ప్రభుత్వ పాలనా వ్యయాన్ని తగ్గించడం. ముఖ్యంగా అనవసర వ్యయాన్ని నివారించడం. ఇటీవల వివిధ పార్టీలతో ప్రధాని జరిపిన సమావేశంలో రూ. 20వేల కోట్లతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఏమిటని ఒక పార్టీ నేత ప్రశ్నించారు. ఇప్పటికే ఉన్న నేషనల్ మ్యూజియం, విజ్ఞాన్ భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, పార్లమెంట్, ఉపరాష్ట్రపతి నివాసం, పలు మంత్రిత్వ శాఖలు కూలిపోవడమో, కొత్త భవనాలకు తరలిపోవడమో జరుగుతాయన్నమాట. అంటే ఎన్ని కోట్ల రూపాయలు వృ‍థా అవనున్నాయి? కొత్తగా అనవసర ఖర్చులు పెంచుకోవడంతో పాటు అనేక అనవసర వ్యవస్థల్ని పెంచి పోషించాల్సిన అవసరాన్ని గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఏడవది, ప్రభుత్వ వ్యవస్థలో పెట్టే ప్రతి ఖర్చూ, ప్రతి ప్రాజెక్టుపై పెట్టే వ్యయం అవసరమైనదా లేదా, సరిగా ఉన్నదా, అందుకు వేల కోట్ల అప్పులు అవసరమా అని తేల్చే వ్యవస్థలు అవసరం. సమాచార హక్కుతో పాటు ప్రజా ఆడిట్‌కు వీలయ్యే మార్గాల్ని ఏర్పర్చి పారదర్శక పాలన ఏర్పర్చినప్పుడే వ్యవస్థలో వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. విషాదకరమైనదేమంటే కరోనా వైరస్ పోతుందేమో కాని దేశంలో అవినీతి అనే వైరస్‌ను నిర్మూలించడం అనేది అత్యంత కష్టమైన పని. ఆ దిశలో మోదీ ఆలోచిస్తే భవిష్యత్‌లో ఆయన ప్రకటించే సప్తపది మరో రకంగా ఉంటుంది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-04-15T06:34:00+05:30 IST